Thursday, 20 October 2011

దొరికిపోయాను


ఆఖరి మెట్టు పై అడుగు పెట్టి ఎదురుగా నీ నల్లని మోము చూడగానే  అర్ధం అయ్యింది ఈ రోజు నీకు దొరికేసానని...ఈ నాలుగు రోజులు నీకు చిక్కకుండా తప్పించుకున్నాననే పొగరు అనుకుంటా చాలా నిర్లక్ష్యంగా వచ్చేసాను ఏ మాత్రం జాగ్రత్త తీసుకోకుండా..

నీ వైపు భయంగా,దిగులుగా చూసాను..నువ్వేమాత్రం కనికరించేలా లేవని అర్ధం అయ్యింది..ఒక నిర్ణయానికొచ్చినట్లు  వడివడిగా అడుగులు వేసాను..ఎంత దూరం వెళతావో వెళ్ళు తప్పించుకోలేవులే అన్నట్లు నువు నవ్విన నవ్వు చెవులు చిల్లులు పడినట్లు వినబడుతుంది..

నా కంగారు చూసి ఒకరిద్దరు ఎగాదిగా చూసారు..ఎలా అయినా తప్పించుకోవాలి పరుగులాంటి నడకతో ముందుకు వెళ్ళాను..రోడ్డంతా నిర్మానుష్యం అయింది నా భయాన్ని పెంచుతూ ..అక్కడక్కడా ఇళ్ళు తలుపులు గడియపెట్టి ...

ఓ చిన్నారి పాప కిటికి ఊసలగుండా నన్ను చూస్తుంది ఆశ్చర్యంగా...కాళ్ళల్లో సత్తువ నశించింది ...వేగం తగ్గించాను ..ఎప్పుడు వచ్చి వాటేసావో వెనుకనుండి రివ్వు మంటూ.. బేలాగా చూసాను ..వదల్లేదు...మొదటి ముద్దు నుదుటిపై.. రెండవది చేతులపై..

ఓ ఇద్దరు పెద్దవాళ్ళు తమ వాహనాలపై వెళుతూ జాలిగా చూసారు నా వైపు...మరో ఇద్దరు కాలేజీ అబ్బాయిలు అల్లరిగా నవ్వుతూ వెనుకకు తిరిగి చూసారు...ఇంకొందరు అమ్మాయిలు అసూయగా చూసారుగాని ఒక్కరూ నాకు తోడురాలేదు..

ఎవరికి పట్టనట్లు వెళ్ళిపోతుంటే బాధ ఉక్రోషం..హఠాత్తుగా నీ కళ్ళల్లో మిరిమిట్లు గొలిపే మెరుపు మెరిసింది..కోటి ప్రశ్నలకు సమాధానంగా..

నిజంగా తనంటే ఇష్టం లేదా??? ఉంది !! సమాధానం స్పష్టంగా మనసులోనుండి వచ్చింది.. ఈ సమాజంకోసమే మనసుకు పెద్దరికపు ముసుగేసి ఆ ఇష్ట్టాన్ని చంపేసుకున్నాను..ఈ కొద్దిసేపు నాకోసం నేను ఈ పరదాలు తొలగించలేనా???


గట్టిగా ఊపిరి పీల్చాను ...నిండామునిగాకా చలేమిటి..... నేనూ నీతో పాటు పక్కున నవ్వాను నీ ప్రేమలో తడిసిపోతూ ...

కిటికీలో నుండి చూసున్న పాపాయి కేరింతలు కొడుతుంది వర్షంలో తడుస్తున్న నన్ను చూస్తూFriday, 14 October 2011

ఎందుకూ ???


కన్నీటికి నేనంటే ఎంత ఇష్టమో కాస్త బాధపడగానే 
వెచ్చని స్పర్శతో బుగ్గలు తడిమి  తోడుగా వస్తుంది..


మోకాళ్ళు నాకు  మరింత దగ్గరకు చేరి  
 తలను తన ఒడిలోకి తీసుకుని ఓదారుస్తాయి


చేతులు చుట్టూ పెనవేసి  గట్టిగా హత్తుకుని
నీకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పుతాయి..


ముంగురులు నా నుదిటి పై తారాడుతూ 
లాలనగా నిమురుతూ నాబాధని తగ్గించే ప్రయత్నం చేస్తాయి..


నా కోసం ఇవన్ని ఇంత తపన పడుతుంటే 
పిచ్చిమనసు ఇంకేవరికోసమో ఎదురుచూస్తుంది ఎందుకూ ???

Sunday, 9 October 2011

మా కిటికీ


కొన్నింటితో అనుబంధం ఎలా ఏర్పడుతుందోగాని ఏళ్ళతరబడి అది పెరుగుతునే ఉంటుంది మావంటింటి కిటికితో నాకు ఏర్పడినట్లు.తన సన్నిదిలో ఎన్నెన్ని జ్ఞాపకాలు పలకరించాయో ,ఇంకెన్ని ఆలోచనలు పురుడుపోసుకున్నాయో..అక్కడ నించుంటేచాలు టన్నులకొద్దీ కరగని క్షణాలను  గుప్పెటతోపట్టి ఆవలకు విసిరేయచ్చు...

కిటికీ ఊసలను పట్టుకుని బయటకు చూస్తే చాలు ఒంటరితనం నన్నొక్కదాన్ని చేసి మాయమైపోతుంది.. అప్పుడప్పుడూ చందర్రావుగారు "హెలో" అని కుశలమడిగి చల్లగా పలకరిస్తే..ప్రతిరోజూ సూర్యారావు గారు వెచ్చగా బుగ్గలను తడిమి ధైర్యం చెప్తారు.. ఏ రాత్రివేళో వారికోసం గంటలకొద్ది ఎదురు చూస్తున్నప్పుడు నాతలను తనకు   ఆన్చి ఆదమరచి నిదురపోయిన అనుభవాలు ఇప్పటికీ ఆ ఊసలకు వ్రేళ్ళడుతూనే ఉన్నాయి...

ఒక్కోసారి నల్లమబ్బు,మెరుపు తీగా కలసి పిలవగానే పరిగెత్తుకుని తన చెంతకు వెళతానా ... చల్లటి వర్షపుపూలను మొహానికేసి కొట్టి పక్కున నవ్వేస్తుంది... ఉక్రోషంగా చూస్తూ నా చేతులు బయటకు పెట్టి వానముత్యాలు రాసులుగా దోసిళ్ళతో నింపి లోపలకు తేవడానికి ప్రయత్నిస్తానా కాని చేతులు లోపలకు తీసుకురాలేక తనకు తగిలి మొత్తం నేలపాలైపోయి ఒట్టిచేతులు వెక్కిరిస్తూ చూస్తుంటే జీవితసత్యమేదో గుంభనంగా చెప్తున్నట్లు నా వైపు గంభీరంగా చూస్తుంది ...

సంతోషమొక్కటే పంచుకుంటే తను నా మంచి నేస్తం ఎలా అవుతుంది...మదిని పట్టి సుడులు తిరిగే విపరీతమైన బాధ గుండెలను దాటుకుని కన్నీటి రూపంలో బయటకు వచ్చినపుడు ఆసరాగా నా తలను తనకేసి అదుముకుని లాలిస్తుంది..నా కన్నీటి చారికలు నాకు చూపుతూ నేనున్నాను నీకు అని తోడుగా నిలుస్తుంది....ఒక్కోసారి అదుపులేని ఆవేదన కట్టలు తెన్చుకున్నప్పుడు నా చేతి వెళ్ళు తన తలుపు సందుల్లో నలిగిపోతుంటే ముల్లును ముల్లుతోనే తీసినట్లు ఒక బాధను మరొక బాధ మాత్రమే తీర్చాలా అని బేలగా చూస్తుంది ...

మా కిటికీ పరిచయం చేసిన మరో మంచిస్నేహితుడు పేరు ఊరూతెలియని ఓ పచ్చని చెట్టు ..అదైతే ఆకులు ,రెమ్మలు ,కొమ్మలు ,పూవులు అన్నీ నన్ను చూడగానే కేరింతలు కొట్టేవే..గాలి సాన్నిహిత్యాన్నిబట్టీ వయ్యారంగానో ,హాడవుడిగానో కదులుతూ ఎన్నెన్ని కబుర్లుచెబుతాయో..నా కళ్ళముందే చిన్ని పిట్టలు గూళ్ళనుకట్టి, గుడ్లనుపెట్టి ,పిల్లలని పొదిగి కువకువలాడుతుంటే నాకోసమేఅన్నట్లు మాధ్యాహ్నం వేళకు తన చెంతకుపిలిచి వాటిని ఆడిస్తుంది....తన ఊహ తప్పుకాదన్నట్లు అవేమో ఆ ఊసపై నుండి ఇక్కడకు ఈ ఊసపై నుండి అక్కడకు గెంతూతూ నన్ను చూడగానే దూరంగా పారిపోతూ నేను ప్రక్కకు తొలగగానే మళ్ళి వెదుకుతూ దాగుడు మూతలు ఆడతాయి...నేనూ వాటితోపాటు వయసుమరచి ఆడేస్తుంటే మౌనంగా చూస్తూ నవ్వుకుంటుంది..

కృష్ణుడు యశోదకు ముల్లోకాలు చూపించినట్లు ,తన వైపు చూస్తే చాలు మా కిటికీ నాకు జీవితమంటే ఏమిటో ఇట్టే చూపించేస్తుంది .. బాల్యం, కౌమారం , వృద్ధాప్యం ..సంతోషం ,విచారం ఒక్కటేమిటి ఎందరెందరో కళ్ళముందు తిరుగుతూ తెలియకుండానే నాకు జీవిత పాఠాలు నేర్పించేసి పోతారు ..ఇలా కాసేపు ఆలోచనలు రేకెత్తిస్తూ, మరికాసేపు ఆలోచనలో పడేస్తూ ,అంతలోనే ఆలోచింపజేస్తూ అండగా ఉండే మా కిటికీని వదిలి ఎలా వెళ్ళేది?

Wednesday, 31 August 2011

ఎవరు చెప్తారు నీకు?


నీతోఉన్న ప్రతిక్షణం  పోట్లాడాలనిపిస్తుంది
నువ్వెళ్లిన మరుక్షణమే  మాట్లాడాలనిపిస్తుంది
నీ సమక్షంలోకంటే నీ నిరీక్షణలోనే ఎక్కువ ప్రేమిస్తున్నానేమో ....

 నీ తడికన్నుల చల్లదనం చెంపకు తాకినట్లవుతుంది
ఆ వేడినిట్టూర్పు వెచ్చదనం తనువును తడుముతునే ఉంది
అలిగిన నీమోము బింకంగా నను చూస్తున్నట్లనిపిస్తుంది
అంతలోనే కోపాల కారాల ఘాటు అలుముకుంటుంది.

నన్నర్ధం చేసుకోవట్లేదని కోప్పడతాను కాని
నిజానికి నాకు నేనే అర్ధంకావట్లేదని ఎలా చెప్పను నీకు ?
ఏకాంతపు వాకిట్లో మౌనంగా
నీ తలపుల రంగవల్లులు దిద్దుతూ
నిదురరాని నిశిరాత్రులు గడుపుతున్నానని
ఎవరు చెప్తారు నీకు?

Sunday, 28 August 2011

బాల్యమా ఇకరావా?

    

నిన్న మొన్నటి వరకూ నా చుట్టూనే ఉన్నావుగా
మరి కాలం బూచి ఎప్పుడు మాయం చేసిందో నిన్ను
యవ్వనపు ఏమరుపాటుతో గమనించనేలేదు
గుర్తువచ్చి వెనకకు చూస్తే గుప్పెళ్ళకొద్దీ  జ్ఞాపకాలు గుండెలపై పరిచేసి పోయావు.
ఒక్కొక్కటి ఏరుకుంటుంటే ఎటు చూసినా నువ్వేకనబడుతున్నావ్..


వరండా గేటుపై ఊగుతూ ,అమ్మ చెవిలో గారంగా గుసగుసలాడుతూ
చందమామతో పరుగులు పెడుతూ ,నేస్తాలతో అలసటరాని ఆటలాడేస్తూ
ఒకటా రెండా ఎన్నెన్ని అనుభూతులు నీతో పెనవేసుకున్నానో


నాన్నమ్మ చేతిముద్ద తాలూకు రుచి ఇంకా నోట్లో నీటిమడుగు చేస్తునేఉంది.
నాన్న తిట్లువింటూ అమ్మ నడుమును పెనవేసిన వెచ్చదనం అలాగేఉంది.
అమ్మపై అలిగి మంచం క్రింద నిద్రపోయిన జ్ఞాపకం ఇంకా మేలుకునేఉంది .
స్నేహితుల తగాదాలలో తగిలిన గాయాల కన్నీటి ఉప్పదనం పెదవులకు తెలుస్తూనే ఉంది.
అన్నీ ఇక్కడిక్కడే ఈ మూలనే నక్కినట్లుగా ఉన్నాయి
నువ్వుమాత్రం నన్నొదిలి ఎక్కడికి వెళ్ళిపోయావ్

భయము బెదురులేని ఎన్నెన్ని సాహసాలు
కుళ్ళు కపటం తెలియని  గిల్లికజ్జాలు
నిన్నను చూసి బెరుకూ  లేదు
రేపును తలుచుకుని బెంగాలేదు
 

అప్పటికి ఇప్పటికి పొంతనాలేదు
ఆనాటి నువ్వుకు ఈనాటి నేనుకు పోలికాలేదు
నీ జ్ఞాపకాలు నన్ను వదిలిపోనేపోవు
ఇక నువ్వునాకోసం రానేరావు

Wednesday, 27 July 2011

పిచ్చుకనువులేక మా చూరు బోసిపోయింది
కాన రాక మా పెరడు మూగపోయింది

మా పంట చేలు ,ధాన్యపుగాదెలు
వాకిళ్ళు ,బావులు బెంగపడ్డాయి

మా ఏటిగట్లు ,ఆ కోవెల మెట్లు
కాకమ్మ, చిలకమ్మా కధల నేస్తాలన్నీ కుమిలిపోతున్నాయి

నీ బుల్లికువకువలు,నువ్వు చేసే సందడులు
ఒకనాటి జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి

ఆ గడ్డిపరకలు, ఈ చిట్టి ఒడ్లు
నీ గురుతుగా మాకు మిగిలిపోయాయి

సాంకేతికత  నీపాలిట బ్రహ్మాస్త్రం కాగా
కాలుష్యపు కోరలు కబళిస్తూ పోగా
మా నిర్లక్ష్యం,నిర్లిప్తత శాపమై తగలగా

అంతరించిపోతూ , అరుదైన జాబితాలో చేరిపోతున్నావు
మానవ మనుగడని ప్రశ్నిస్తూ సాక్ష్యంగా నిలిచావు

Tuesday, 12 July 2011

నాకోసం మళ్ళీ వచ్చేయవూ


నీకూ నాకు అనుబంధం నా పుట్టుకతోనే ఏర్పడిపోయింది .. ఆటలాడినా ,అన్నం తిన్నా ,అలసిపోయినా ఆలోచనలో ఉన్నా నాకు తెలియకుండానే అక్కున చేర్చుకుంటావు ..కమ్మని కలల్లాంటి కబుర్లు చెప్తావు..అవి ఒక్కోసారి పెదవులపై నవ్వులు పూయిస్తే, ఇంకోసారి గుండెల్లో వణుకుని తెప్పిస్తాయి...ఆ క్షణం ఉలిక్కిపడినా ,భయం వేసినా కోపం వచ్చినా కొద్ది క్షణాలే .. మళ్ళీ నీ వెచ్చని కౌగిలిలో చేరిపోతాను ..

.నా మీద నీకున్న ప్రేమను చూసి అసూయపడినవారెందరో..నువ్వు వాళ్ళను కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడవని ,ఒక వేళ పలకరించినా మొహమాటంగా అంటి అంటనట్లు ఉంటావని చాలా సార్లు నాదగ్గర వాపోయారు..వాళ్ళ అసూయచూసి ఎంత గర్వంగా ఉండేదో తెలుసా ...

మన బంధం ఇలాగే ఉంటుందని ఎవరూ విడదీయరని అనుకున్నానా ..అనుకున్న కొద్దిరోజులకే మన ఎడబాటు నా పెళ్ళిరూపంలో వచ్చేసింది.. చిన్నప్పుడు నా అల్లరి భరించలేక బలవంతంగా నీకు అప్పగించి పనులు చక్కబెట్టుకున్న అమ్మానాన్నే నాకో తోడును తీసుకొచ్చి నీకు దూరం చేసేసారు ...

అయినా వాళ్ళను అని ఏం లాభంలే నేను మాత్రం తక్కువ తిన్నానా? నువ్వు గుమ్మం దగ్గర దీనంగా నావైపు చూసినా, నేనున్నాను అని సంజ్ఞలు చేసినా కొత్త మోజులో పట్టించుకునేదాన్ని కాదు.. అతని నవ్వులు ,అతని మాటలు ,అతని చేతలు,అతని బాసలు అన్నీ నీకంటే ఎక్కువ మత్తెక్కించేవి ... అందుకే నువ్వెక్కడ మా ఇద్దరి మధ్యలో వచ్చేస్తావో అని విదిలించికొట్టేదాన్ని..చిన్న బుచ్చుకున్నావో...మనసు నొచ్చుకున్నావో మెల్లగా నాకు తెలియకుండానే దూరం అయిపోయావు..

ఎవరి పేరు చెప్పి బాధ్యతలు ,బంధాలు అని అప్పటివరకూ నిన్ను నిర్లక్ష్యం చేసానో వాళ్ళ అవసరాలు తీరంగానే నన్ను నిర్లక్ష్యం చేసేస్తున్నారు ..అప్పుడుగాని నీ విలువ తెలియలేదు.. హఠాత్తుగా దిగులైపోయాను నువ్వు గొర్తొచ్చి ..మన అనుబంధం గుర్తొచ్చి..నాకు నేనే పలకరించాలని ఎంత ప్రయత్నించినా నా వైపు చూడవు .. చూసినా ఇంతకు ముందులా అక్కున చేర్చుకోవు.... ఎప్పుడో నీకు దయకలిగితే పలకరిస్తావు లేదా నేను విదిలించికొట్టినట్లే విదిలించిపోతావు..


చేసింది తప్పే ఇంకెప్పుడూ దూరం చేసుకోను ...నాకోసం మళ్ళీ వచ్చేయవూ ... గాఢమైన నిద్రలో నన్ను సేదతీర్చవూ ...మునుపటిలాగే నీ కలల కబుర్లలో నన్ను ముంచెత్తవూ..నీవులేకపోతే జీవించడం కష్టం...ఎందుకంటే నువ్వు నా నిద్రాదేవివి.

Tuesday, 5 July 2011

కాగితపు పడవవానాకాలం రాగానే
ప్రతి పసివాడు ఒక శ్రామికుడే
తలమునకలుగా నీ తయారీకు
ప్రతి నిమిషం తను తయారే!

పేరుకి ప్రయాణించలేమని గాని
పాలబుగ్గల పసిడి నవ్వులు
మోసుకుపోతూనే ఉంటావు

నువ్వు కదులుతూ మమ్మల్ని కదిలిస్తూ
నువ్వు తరలుతూ స్మృతులను తలపిస్తూ
నువ్వు తడుస్తూ మము ఆనందంలో తడిపేస్తూ


పిల్లకాలువలో నీవే ...బకెట్టు నీటిలో నీవే
బురదగుంటలో నీవే... నీటి చెలమలో నీవే
కాదేది నీ పయనానికి అనర్హం

పట్టు మని పదినిమిషాలే నీ జీవితం
కాని పట్టలేని కేరింతల మధ్య నీ గమనం

 
అమ్మ ఒడిలో నాన్న చేతిలో
అక్క జతలో అన్న తోడులో
నువ్వు జన్మిస్తూనే
ఎన్నెన్నో  జ్ఞాపకాలను రవాణా చేసేస్తావు కదా!

Friday, 1 July 2011

మువ్వలపట్టీలునా మువ్వల పట్టీలు 
నాతో సమానంగా పరుగులు పెడుతూ అల్లరి చేసేవి ..నిధానంగా నడిస్తే విచ్చినపువ్వుల్లా మెల్లగా నవ్వేవి .
.పోనీ ఒద్దికగా కూర్చుంటే బుద్దిగా ఒదిగి గుసగుస లాడేవి ..నిద్దర్లో కూడా మెత్తగా కదులుతూ నా పాదాలతో లెక్కలేనన్ని ఊసులు చెప్పేవి ...

మోకాలి పై తలవాల్చి ఆలోచనలో ఉంటే నాకు తెలియకుండానే చేతి వేళ్ళతో ముచ్చట్లు పెట్టేసేవి.. 
 ఎర్రటిపారాణి తో కలిసి తెల్లగా మెరిసిపోతూ కొత్త అందాలను విరజిమ్మేవి ... అవి పాదాల చెంత ఉండి స్నేహితుల మధ్య గర్వంగా తల ఎత్తుకునేలా చేసేవి... 


దాగుడుమూతలప్పుడు మాత్రం ఎప్పుడూ దొంగను నన్నే చేసేవి .. మెత్తని సవ్వడి చేస్తూ అబ్బాయిల గుండెల్లో నిశబ్ధపు గంటలు మోగించేవి ...ఎన్నెన్నో అనుభూతులకు ఆలవాలు  నా మువ్వలపట్టీలు 

Friday, 20 May 2011

రాధామధు

 ఈ రోజు మనో నేత్రం బ్లాగ్ లో రాధామధు సీరియల్ గురించి చదివాను......ఇంతకు  ముందు కొన్ని   ఎపిసోడ్స్ చూసి మిగిలిన ఎపిసోడ్స్  యూ ట్యూబ్‌లో  దొరకక వదిలేసాను.ఇప్పుడు మళ్ళీ అన్ని ఎపిసోడ్స్ పెట్టేసాడు.ఆలసించినా ఆశాభంగం ...మీరు గభ  గభా చూసేయండి .మళ్ళీ వాడికి తిక్కపుడితే తీసేస్తాడు.నేను మొదలు పెట్టేసాను.మంచి సీరియల్ .మిస్ అవ్వకండి . 

Thursday, 24 March 2011

కొండవీటి దొంగ-కోటలో రాణి

నేను అసలు టివీ చూడను.బుద్ది తక్కువ అయి,ఖాళీ ఎక్కువ అయ్యి  ఈ మధ్య కొండవీటి దొంగ-కోటలో రాణి అనే ఒక చెత్త ప్రోగ్రాం చూసాను యూ ట్యూబ్‌లో .ఇప్పటివరకూ విమర్శలు అందుకున్న ప్రోగ్రాంలు సీరియల్స్ ఒక ఎత్తు అయితే ఈ చెత్త ప్రోగ్రాం ఒక్కటీ ఒక ఎత్తు.ప్రొగ్రాం మొదటి బాగం చూసినపుడే మనకు విరక్తి వెల్లువలా వస్తుంది.

టూకీగా చెప్పాలంటే పదిమంది అభం శుభం తెలియని గిరిజన యువకులను తీసుకొచ్చి వాళ్ళను రకరకాలుగా బాధలు పెట్టి మనల్ని ఎంటెర్టైన్మెంట్ చేయడం .వాళ్ళు అమాయకులు డబ్బాసో పట్నం మీద ఆశక్తో ఏదో ఒకటి ఆశ చూపి 60 రోజులు వాళ్ళ ఇళ్ళకు దూరంగా తీసుకొచ్చి మన ముందు పడేస్తారు .

షో యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటయ్యా అంటే ఈ గిరిజనులను పది మంది అమ్మాయిలకు అప్పగించి వారిని 60 రోజుల్లో నాగరికుల్లా మార్చేలా చేస్తారు.ఇందులో మళ్ళా ఎలిమినేషన్లు  వగైరాలు  ఉంటాయి ఎవరు చివర వరకు వస్తారో వాళ్ళన్న మాట" కొండవీటి రాజ కోటలో రాణి"
  
అసలు ప్రోగ్రాం మొదటి భాగంలో ఆ అమాయకులను పరిచయం చేసే కార్యక్రమమే విరక్తి తెప్పిస్తుంది. .. మన ఓం కార్ గారిని మించిపోయిన ఏంకర్ గారు ఒకరున్నారు ఇందులో.అతనూ ,అతని ఏంకరింగు నేను చెప్పడం కాదు మీరు చూసి తీరాల్సిందే.

అత్యంత ఆధునికమైన బట్టలు వేసుకున్న ఆడపిల్లల మధ్య నించో పెట్టి వాళ్ళను పరిచయ కార్యక్రమం మొదలవుతుంది.ఏంకర్ గారు ఒక గిరిజనుడిని పిలిచి ఒక అమ్మాయికి గాలిలో ముద్దు విసరమంటారు.అతను అయోమయంగా చూస్తుంటాడు. ఏంకర్ గారు వదలరు ఆ ముద్దుగుమ్మలను పిలిచి ఎలా ముద్దు ఇవ్వాలో నేర్ప మంటారు .మరొక అబ్బాయిని పిలిచి అతనికి  అందంగా అనిపించిన అమ్మాయికి గులాబి ఇచ్చి రమ్మంటారు.ఇంకా చేతి పై ముద్దు పెట్టమంటారు.వాళ్ళు సిగ్గుపడుతున్నా వినిపించుకోరు.ఇలాంటి వెర్రి మొర్రి చేష్టలు ఒకటా రెండా..అంతా చేస్తే ఆ పిల్లల వయసు 15-17 మధ్య ఉంటుంది


అంతటితో ప్రోగ్రాం అవ్వదు.ఒక్కో ముద్దు గుమ్మకు ఒక్కో అబ్బాయిని అప్పగిస్తారు.ఆ అమ్మాయిలకు  డబ్బులివ్వకుండా షాప్ కి తీసుకువెళ్ళి ఎవరినైనా అడుక్కుని (అంటే వాళ్ళ బాషలో ముద్దుగా బ్రతిమాలడం అన్నమాట) వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వీళ్ళకు ఏదైనా కొనాలన్నమాట..అక్కడితో వదిలేస్తారా షాప్ మొత్తం తిప్పేసి వాటిలో ఉన్న వస్తువులన్నీ వివరంగా వాళ్ళకు చెప్పి తీసుకురమ్మంటారు..ఇకా ఆ అమ్మయిలను చూడాలి పెన్ను తెలియని వాళ్ళకు పెన్ డ్రైవ్ ల గురించి ,mp3  ప్లేయర్ల గురించి బహుచక్కగా వివరిస్తారు .వీళ్ళు అయోమయంగా చూస్తూ ఉంటారు . మధ్య మధ్య అడుక్కునే కార్యక్రమం సాగుతూ ఉంటుంది అనుకోండి.

మరొకరోజు ఉన్నట్లు ఉండి ఒక్క రాత్రిలో వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పే మంటారు .వీళ్ళేమో పాపం రాత్రిళ్ళు 2 వరకూ కూర్చోపెట్టేసి వాళ్ళకు వచ్చిందేదో నేర్పేస్తారు .ఆ మరుసటి రోజు ఆ పిల్లలు  ఆ ఇంగ్లీష్ రైంస్ చెప్పలేక నానా తంటాలు పడుతుంటే జడ్జ్‌లు లు విలాసంగా కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ వాళ్ళ తప్పులు వివరిస్తారన్నమాట. ఒక్క జడ్జ్ తెలుగులో సరిగా మాట్లాడటం నేను చూడలేదు ఎందుకంటే మరి వాళ్ళు నాగరీకులుకదా తెలుగులో మాట్లాడితే ఇంకేమైనా ఉందా?వాళ్ళేమో నాకు తెలియడం లేదండి నాకు అర్ధం కావడం లేదండి అని ఏడుపు .

మరోసారి ఫ్యాషన్ షో.. ఉన్నట్లు ఉండి వాళ్ళను పార్లర్లకు తీసుకువెళ్ళి జుట్టును తాటి పీచులా ఎర్ర్గా మార్చేసి ,మొహాలకు ఫేషియల్స్ చేయించి పిచ్చి పిచ్హ్చి డ్రెస్స్‌లు వేసి వాళ్ళ తో ఫ్యాషన్ షో.అందులో ఒక అతనికి మొక్కుబడి ఉంది అట.పాపం అతను ఏడుపు .అసలే  వాళ్ళకు నమ్మకాలు ఎక్కువ .వీళ్ళు ఉన్నట్లు ఉండి అలా తల కట్ చేసేస్తే రేపు ఏదైనా అనుకోనిది జరిగినపుడు ఇదే కారణం అని బెంగపెట్టుకుంటే అది ఎవరు తీరుస్తారు?
పైగా ఆ అమ్మాయిలు మీద మీద పడిపోవడం .ఆ అబ్బాయిలు  మరీ పసికూనలు కాదుగా పైగా పెళ్ళిళ్ళు అయిన పిల్లలు ఉన్నారు అందులో.ఈ షోకులన్నీ వాళ్ళ్కు నేర్పీ కొంత డబ్బు మొహాన పడేసి ఆ అడవిలో బ్రతకమని పంపేస్తారు .ఎంత అమానుషం .

ఆ ఏంకర్ అయితే ఆడవాళ్ళతో మాట్లాడే తీరు అసలు బాగా లేదు .ఆ అమ్మాయిలను మరీ భయంకరంగా తిడుతున్నాడు.ఒక అమ్మాయి సరి అయిన డ్రెస్ ఎంపిక చేయలేదని మూడుపూటలా తిని పడుకోవడం కాదు కాస్త బుర్రపెట్టాలని తిట్టాడు .

 మరీ విన్నూత్న కార్యక్రమాలంటూ వెర్రి ప్రోగ్రాములు వేస్తున్నారు .  


ఏం చేయను ?

నీ ఆలోచనల అలలు నను తాకగానే
వెనుకకు మరిలినట్లే మరలి
ఉవ్వెత్తున ఎగసిపడి నను తడిపేస్తున్నాయి.
చాలాసేపు వాటి అనుభూతి తాలూకు ఉప్పదనం
మనసుని అంటిపెట్టుకుని వదలడంలేదు
పోనీ వాటి అంతు చూద్దామని
వాటితో పాటే పరుగులు తీస్తానా
దిగేకొద్ది మునిగిపోతున్నా కాని
అదుపుచేయలేకపోతున్నా  

Monday, 21 March 2011

నీ నేను

పగలంతా ఏం చేసినా రాత్రిళ్ళు నాతో వచ్చి చెప్పితే గాని నిద్ర పట్టదు నీకు.నీ బాధలు,కష్టాలు,సంతోషం,సరదాలు ఒకటేమిటీ అన్నీ నాతోనే  పంచుకుంటావు .ఒక్కోసారి చిన్నపిల్లల్లాలా వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటితో తడిపేస్తావు.మరోసారి వెన్నెల పువ్వులు  రువ్వేస్తావు .గతజ్ఞాపకాలు తలుచుకున్నా నేనే ,భవిష్యత్ ప్రణాలికలు వేసుకున్నా నేనే అన్నిటికీ నేనే కావాలి.బహుశా ఎదురు చెప్పకుండా నువ్వేమన్నా అన్నిటికీ సరే అంటా అని కాబోలు నాతోనే చెప్తావు .ఉన్నట్లుండి నీకు భావుకత ఉప్పొంగుతుంది.నాకో కవిత చెప్పేస్తావు .ఇది కవితేనా ? మళ్ళీ నన్నే అడుగుతావు .నేను మౌనంగా నవ్వుతాను.మౌనం అర్ధంగీకారం అని  అనేసుకుంటావు అమాయకంగా. కాని నువ్వు మహా దొంగవు .నాతో అన్నీ నిజాలే చెప్పేస్తున్నా అని బుకాయిస్తావుగాని అందులో సగం అబద్ధాలే .ఆ విషయం నీకు నాకూ తెలుసు.అయినా ఇద్దరం ష్  గప్ చిప్ .ఎందుకంటే నువ్వు నన్ను నమ్మవు.నీ రహాస్యాలు  ఇంకెవరికైనా చెప్పేస్తానేమో అని భయం.అందుకే నన్ను ఎవరితోనూ కలవనివ్వవు.మహా అనుమానం మనిషివి .అంతేనా మహా ముదురువి కూడా .ఒక్కోసారి నీకు నువ్వే ఇంకెవరికో నీ నిజాలను  చెప్పేయమని నన్ను వాళ్ళ ఎదురుగా కూర్చోపెట్టి దొంగచాటుగా గమనిస్తూ ఉంటావు. ఇక్కడ నిజాలంటే నీ బాధలు, నువ్వు పడిన కష్టాలు, నువ్వు చేసిన త్యాగాలు అని అర్ధం అన్నమాట.అంటే అందులో సగం నిజమైన నిజాలు కావు అని నీకునాకు మాత్రమే తెలుసు . ఒక్కోసారి రోజుల తరబడి నన్ను పట్టించుకోవు .ఒక్కోసారి రోజంతా నాతోనే ఉంటావు.నువ్వేమిటో నాకేకాదు నీకే అర్ధం కావు  .అక్కున చేర్చుకున్నా, ప్రక్కకు పడేసినా,అదరపు ముద్రలు వేసినా పదునైన గాయాలు చేసినా నాకు నీపై కోపం రాదు .ఎందుకంటే నీవులేకపోతే నాకు విలువ గుర్తింపు ఉండదు.నీవే నేను .నీ ఓదార్పును,నీ తోడును,నీ నీడను... నీ డైరీని  

Thursday, 17 March 2011

నా రెండవ కధ(ఆఖరి భాగం )

ఫోన్ నాలుగైదు సార్లు రింగయ్యి ఆగిపోయింది ...అయినా భయం తగ్గలేదు ...ఫోన్ వైరు లాగేసి క్రింద పడేసి సోఫాలో ముడుచుకుని  కూర్చున్నాను .ఇంట్లో వాసు లేడు కాబట్టి సరిపోయింది ఉంటే ఏమయ్యేది.ఈ రోజంటే నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది రేపటి సంగతి ఏమిటి ?ఎన్నాళ్ళు ఈ గొడవ ?ఏం చెయ్యాలి ?అలా ఎంతసేపు కూర్చున్నానో తెలియదు .ఎవరో తలుపు కొడుతున్న శబ్దం .గుభేలు మంది .ఈ టైమ్‌లో ఎవరు?కొంపదీసి  వచ్చేసాడా ఇంటికి .మెల్లగా తలుపుదగ్గరకు వెళ్లి కిటికీ లో నుండి బయటకు చూసాక గాని వొణుకు తగ్గలేదు .పక్కింటి పద్మ వాళ్ళ అబ్బాయి. "ఆంటీ! నీకు ఫోన్ ..అమ్మ పిలవమంది" అన్నాడు.నాకా?ప్రక్క వాళ్ళ నెంబర్ కూడా తెలుసుకున్నాడా? నోరు తడారిపోతూ ఉంటే ప్రక్కింటికి పరుగు పెట్టాను ..
 నన్ను చూడగానే పలకరింపుగా నవ్వి" మీ వారు కాల్ చేసారు మీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట మీరు" అంది.ఆ చెప్పడంలోనే ఏం చేస్తున్నావ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అనే ప్రశ్న అంతర్లీనంగా ఉంది .. మెల్లగా ఊపిరి పీల్చుకుని ' హలో 'అన్నాను."ఎక్కడికి వెళ్లావు ఇందాక నుండి కాల్ చేస్తున్నా .ఎంత భయం వేసిందో తెలుసా" అన్నాడు కోపంగా .. "అంటే అది.. స్నానానికి వెళ్లాను"  అన్నాను నెమ్మదిగా .. "సరే ..ఇంకా పని అవ్వలేదు ఇంకో రోజు ఉండాల్సివస్తుందేమో ,మేక్జిమం రావడానికి చూస్తాను సరేనా" అన్నాడు  .'ఊ 'అన్నాను ...నాకు దుఖం తో గొంతుకు పూడుకు పోతుంది ...వాసు తొందరగా వచ్చేయవా అని చెప్పాలని ఉందికాని పద్మ నన్నే చూస్తుంది ఎదురుగా నించుని ...ఫోన్ పెట్టేసి వెంటనే ఇంటికొచ్చేసాను..
ఆ రాత్రి అస్సలు నిద్రపోలేదు. ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ..లేకపోతే ఈ టెన్షన్ తో ఏమైపోతానో అనిపించేసింది..ప్రొద్దున్న సంధ్యకు కాల్ చేసి ఈ రోజు ఆఫీస్ లో లీవ్ పెట్టి మీ ఇంటికి వచ్చేస్తాను ..మాట్లాడాలి అని చెప్పి సంధ్య ఇంటికి వెళ్లాను ... "సంధ్య ఇక నావల్ల కాదు వాసుకి నాకు నేనుగా చెప్పెయడమే బెటర్ ..లేకపోతే నేనేదో ఇన్నాళ్ళు దాచేసాను అనుకుంటాడు .ఇక వేరే దారి లేదు "అన్నాను ఏడుస్తూ ..." అదికాదే , రాజేష్ క్లోజ్ ఫ్రెండ్ మా అన్నయ్యకు బాగా తెలుసు. నేను ఇప్పటికే తనని అడిగాను రాజేష్ ఎక్కడున్నాడు ఏంటి?వివరాలు కావాలని  . సాయంత్రం చెప్తాను అన్నాడు ..ఇన్నాళ్ళు ఎలాగూ ఆగావు ఈ ఒక్క రోజు ఆగు వివరాలు తెలిసాక ఆలోచిద్దాం "అంది. "తెలుసుకొని మాత్రం ఏం చేస్తాం?  .అతను అడ్రెస్స్ కూడా ఇచ్చాడుగా "అన్నాను అయోమయంగా ."నీకు చెప్తే భయపడతావని చెప్పలేదుగాని నాకింకో డవుట్ వస్తుందే "అంది మెల్లగా .".నువ్వలా టెన్షన్ పెట్టకే నాకు వణుకొస్తుంది .ఇంకేం డవుట్ అన్నాను భయంగా ..అబ్బే ,కంగారు పడకు డవుట్ అంతే ,నిజం అవ్వాలని కాదు . రాజేష్ విషయం తెలుసుకొని.. అదేదో సిన్మాలోలా ఇదంతా మీ ఆయన చెయ్యడం లేదుగా అంది నావైపు చూస్తూ .
నాకు నోట మాట రాలేదు కాసేపు తేరుకుని "ఇదేంటే అలా అంటావ్ .మా ఆయన ఎందుకలా చేస్తాడు" అన్నాను అయోమయంగా ."అహ..అలా చేస్తాడని కాదు . ఆ ఒక్క అనుమానం మాత్రం ఎందుకు .ఈ రోజు సాయంత్రం తెలిసిపోతుందిగా .అప్పుడు చెప్పేద్దువుగాని "అంది మెల్లగా . కాసేపు వరకూ ఏమీ మాట్లాడలేదు .ఇలా కూడా అయ్యే చాన్స్ ఉందా? తెలిసి వాసు నాటకం ఆడుతున్నాడా ?ఇదంతా తెలియకా నేను టెన్షన్ అనుభవిస్తుంటే నవ్వుకున్టున్నాడా? ఆ రోజు కావాలనే టేబుల్ పైన లెటర్ నాకు కనబడేలా పెట్టాడా? నిన్నరాజేష్ లా గొంతుమార్చి మాట్లాడి తరువాత  కావాలనే ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని తిట్టాడా? లేదు వాసు అలాంటివాడు కాదు .విషయం తెలియగానే మొహం మీద అడిగేస్తాడు తప్ప ఈ నిఘాలు పెట్టడు..కాని తను అలా చేసి ఉంటే ఏమి చేయాలి?ఎంత అవమానం. మళ్ళీ తనతో ఇంతకు ముందులా ప్రేమగా ఉండగాలా? కోపం ,బాధ కలగలిపి వచ్చేస్తున్నాయి.. వాసు అలా  చేసాడో ,లేదో  తెలియకుండానే ఇంత బాధ పడుతున్నాను.మరి నేను ఎవరినో ప్రేమించాను అని తెలిస్తే వాసు ఏం చేస్తాడు?  ఎన్నెన్నో అనుమానాల మధ్య ఎక్కడో ఆశ ..వాసుకేం తెలియదు .నా  వాసుకేం తెలియదు .. సంధ్య  ఎంత ధైర్యం చెప్పుతున్నా అక్కడున్నంత సేపూ  ఇవే ఆలోచనలు ..
డాక్టర్ దగ్గర అపాయంట్ మెంట్ ఉన్నాసరే వెళ్ళ బుద్దికాలేదు ...ఎలా వచ్చానో తెలియదు ఇంటికి ..తలుపు తాళం తీసి ఉంటే భయంగా తలుపు తోసుకుని  లోపలికి వచ్చాను ..ఎదురుగా వాసు ...' వాసూ!!'  పరిగెత్తుకుని అతని చేతుల్లో వాలిపోదాం అనుకున్నా గాని తన చూపుల్లో ఏదో తేడా ...కోపం ,అసహనం,ఇంకా ఏదో తెలియదు ... "ఎక్కడికి వెళ్ళావ్?" తన మాటల్లో పదును కలుక్కున గుచ్చుకుంది ."అది .. ఆఫీస్‌కి ...వంట్లో బాగోక పోతేనూ" .... ఏదో చెప్పబోతుంటే "మీ ఆఫీస్‌కి కాల్ చేసాను లీవ్ పెట్టావంటా "అన్నాడు నా వైపు సూటిగా చూస్తూ..
తనలా అడుగుతుంటే భయం తో చమటలు పట్టేసి అరచేతులు చల్లగా అయిపోవడం మొదలు పెట్టాయి.ఒక్కో పదం కూడబలుక్కుంటూ  "సంధ్య ..మీకు తెలుసుగా సంధ్య... తనకి బాలేదు అందుకని  లీవ్ ...."నా మాట పూర్తి కాకుండానే ఎందుకు నాకు చెప్పలేదు ఇన్నాళ్ళు   " అన్నాడు కోపంగా.. ఏ ..ఏంటీ ?అన్నాను తడబడుతూ .. లోపలకు వెళ్లి వచ్చాడు కోపంగా .. బీరువాలోని లెటర్స్ ,మెడికల్ రిపోర్ట్స్ ఎప్పుడుతీసాడో తెలియదు ..నేల కేసి కొడుతూ" ఎందుకు చెప్పలేదు నాకు" అన్నాడు ..అయిపొయింది ..తెలిసిపోయింది.. ఇంక ఏం చెప్పినా వినడు ..నాకు కాళ్ళు తేలిపోతున్నట్లు అనిపిస్తుంది ..."నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను నిధి .ఎందుకు ఇలా తయారయ్యావో తెలియడం లేదు.నేనేం తక్కువ చేసాను నీకు" ...తనమాటలు నూతిలోనుండి వస్తున్నట్లు వినబడుతున్నాయి..ఏం జరుగుతుంది నాకు ?ఏదో అవుతుంది ...తల విపరీతంగా తిరుగుతుంది... "నాకు చాలా విషయాలు చెప్పకుండా  దాచేస్తున్నావు ..ఎందుకిలా చే..." ఆ తరువాత ఏమయ్యిందో తెలియదు ...
కళ్ళు మెల్లగా తెరిచాను ...తల భారంగా అనిపిస్తుంది ... ఎదురుగా సంధ్య ..నన్ను చూడగానే ఇప్పుడెలా ఉంది ఆందోళనగా అంది. వాసు...  వాసు ఏడి ?అన్నాను ఓపిక తెచ్చుకుని .. "డాక్టర్ ఏవో మందులు తెమ్మనమని చెప్పారు  తీసుకురావడానికి వెళ్ళారు" అంది. నేను ఏడుస్తూ "సంధ్యా !! అయిపొయింది .. వాసుకి తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయింది ..ఇక నాకు సుఖం ఉండదు" ..దుఖం తో గొంతు పూడుకుపోయి మాట పెగలడం లేదు .. "ఏంటి తెలిసేది నీ మొహం...నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేసావ్..అసలేమీ జరగలేదు "అంది ప్రేమగా నా తల నిరుముతూ .. నేను అయోమయం గా చూసాను.."అవునే పిచ్చీ ...విషయం  వింటే మంచం ఎక్కి గెంతులేస్తావ్.."అంది నవ్వుతూ. ఏంటే,సరిగ్గా చెప్పు నాకేం అర్ధం కావడం లేదు అన్నాను విసుగ్గా.
 "విషయం ఏమిటంటే మీ ఇంటికి ఉత్తరం రాసింది నువ్వు ప్రేమించిన రాజేష్ కాదు ,మీ ఆయన చిన్ననాటి ఫ్రెండ్ రాజేష్ అట ..మీ ఆయన పేరు శ్రీని వాస్ కదా ..అతను కూడా  మీ  ఆయన్ని 'శ్రీ 'అనే పిలుస్తాడట.. పాపం ఎప్పటి నుండో  తనకోసం ప్రయత్నించి అడ్రెస్స్ పట్టుకుంటే నువ్వు అవన్నీ దాచేసావు ..ఆఖరికి ఫోన్ చేస్తే పెట్టేసావు ..".అంది నవ్వుతూ ."నిజమా" అన్నాను నమ్మలేక చూస్తూ .."ఇక ఈ రోజు మీ ఆయన ఇంటికి రాగానే  నర్స్ కాల్ చేసింది అట నీకోసం... ఈ రోజు అపాయింట్ మెంట్  ఉంది అంటగా నీకు .. పాపం ,నర్స్ చెప్పిన విషయం వినగానే తనకి ఏమి అనాలో అర్ధం కాక ,ఎందుకు నువ్వు ఈ విషయం దాచావో తెలియక విషయం తెలుసుకుందామని నీ బీరువాలో ఏమయినా మెడికల్ రిపోర్ట్స్ దొరుకుతాయేమో వెదుకుతుంటే నువ్వు దాచిన లెటర్స్ కనబడ్డాయట..దానితో తన ఫ్రెండ్ కి కాల్ చేస్తే ..ఆ అబ్బాయి లెటర్స్ వేయడం ,తను ఫోన్ చేస్తే నువ్వు పెట్టేసి మళ్ళీ  లిఫ్ట్ చేయకపోవడం అన్నీఒక్కొక్కటిగా  తెలిసాయట....ఒక్క సారిగా ఇన్ని షాక్ లు తట్టుకోలేక ఆఫీస్‌కి కాల్ చేస్తే మరొక షాక్ "లీవ్" పెట్టడం తెలిసింది ..ఈ లోపల నువ్వు ఇంటికి రావడం ..నిన్ను అడుగుతూ ఉంటుండగానే కళ్ళు తిరిగిపడిపోవడం అన్ని జరిగిపోయాయి ..అసలు నిజానికి ఇన్ని షాక్స్ విన్నాకా మీ ఆయన పడిపోవాలి ..పాపం నువ్వు ఆయనకు ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు అంది "నవ్వుతూ ...నాకేదో ఇంకా కలలో ఉన్నట్లుగా ఉంది .."ఇదంతా నిజమే !మరి ఆ రాజేష్ ఈ రాజేష్ ఒకటికాదా" అన్నాను ఇంకా అపనమ్మకంగా ..
"కాడుగాక కాడు..నువ్వెళ్ళగానే అన్నయ్య నాకు కాల్ చేసాడు ..ఆ రాజేష్ అసలు ఇండియాలో లేడట.. అమెరికాలో సెటిల్ అయిపోయాడట.పెళ్లి అయిందట ఒక బాబు కూడా .నువ్వనుకున్నంత దుర్మార్గుడెం కాడు ..కాబట్టి నువ్వు భయపడకు.. పాపం మీ ఆయన్ని చూస్తే జాలేస్తుంది ...అసలేం జరిగిందో తెలియకా, ఏం చేయాలో తోచకా వెంటనే నాకు కాల్ చేసారు .ఎందుకని తను అంత డల్ గా ఉంది ..మీరు కనుక్కోండి ..నేను మొన్న ఊరికే కొద్దిగా తిట్టాను ..తను ఇంత మనసులో పెట్టేసుకుంటుంది అనుకోలేదు అని పాపం తెగ ఫీల్ అవుతున్నారు "అంది నవ్వుతూ..ఆ మాటలకు వాసు మీద ప్రేమ అమాంతం పొంగింది .."సంధ్యా! చెప్పేస్తాను జరిగిందంతా వాసుకి ...పాపం తనని మోసం చేయడం ఇష్టం లేదునాకు.ఇష్టం అయితే కాపురం చేస్తాడు లేదంటే ....." ఇంకేమనాలో తెలియక  ఆగిపోయాను ."అదే  వద్దు అనేది .చూడు నిధి ఇదేం సినిమాకాదు శుభం కార్డ్ పడగానే అంతటితో అయిపోవడానికి..తరువాత కూడా గడపాల్సిన  జీవితం చాలా  ఉంటుంది.అదెప్పుడో తెలియని వయసులో జరిగిపోయింది.దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తావు. చెప్పడం వల్ల లాభం లేకపోగా క్రొత్త భయాలకు అనుమానాలకు తెర తీసినట్లు అవుతుంది..అనవసరంగా నువ్వు మనసు కష్టపెట్టుకుని తనను బాధ పెట్టకు.అర్ధం అయ్యిందా" అంది . నేను ఆలోచనలో పడ్డాను  ....ఈ లోపల వాసు రావడం తో తను మళ్ళీ వస్తాను ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది..
వాసు నా ప్రక్కనే కూర్చుని తల నిరుముతూ" సారీరా.. నిన్ను చాలా బాధ పెట్టాను .ఇంకెప్పుడు అలా తిట్టను... అయినా కోపం వస్తే నాలుగు తిట్టాలిగాని అలా మనసులో పెట్టేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటావా...పైగా ఈ  సమయంలో  ....అయినా ఇంత సున్నితం ఏమిటిరా నువ్వు ... నాకు తెలియక ఇలాంటి టైం లో నిన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాను ...తిండి కూడా సరిగ్గా తిని ఉండవు  " అన్నాడు ... తన చేతిని గట్టిగా పట్టుకుని ముద్దు పెడుతూ  వాసూ ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టాను నా మీద కోపం వస్తే  నన్ను వదిలి వెళ్ళవు కదూ అన్నాను కన్నీళ్ళతో తడిపేస్తూ..పిచ్చిదానా నిన్ను వదిలి నేను ఉండగలనా తను దగ్గరకు తీసుకున్నాడు ..
(ఈ కధకు ఏదైనా పేరు పెట్టండి ప్లీజ్ )

Wednesday, 16 March 2011

నా రెండవకధ (మూడవ భాగం)

మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళగానే సంధ్య కు కాల్ చేసాను ..."సంధ్యా వాడు మళ్లీ లెటర్ వేసాడు ....ఈ సారి మా ఆయన తీసుకున్నారు పద్మ నుండి .ఆయన చదివి ఉంటే ఏమయ్యేది .నాకు చాలా భయం గా ఉంది ".భయం తో మాటలు తడబడిపోతున్నాయి నాకు. "హే కంగారు పడకు అలా ఏమీకాదు నేను చెపుతున్నానుగా ...ఇంతకూ ఏమి రాసాడు ? నిన్ను కలుస్తా అన్నాడా? ఏమైనా బెదిరిస్తున్నాడా ? "అంది అనునయంగా . "బెదిరించలేదు గాని చిన్నప్పుడు మేము చూసిన సినిమాల గురించి వాటి గురించి గుర్తు చేసాడు ...నా అడ్రెస్స్ తప్పో ఒప్పో ఇంకా తెలియ లేదు అంటున్నాడు .. ఫోన్ నెంబర్ ఇచ్చాడు మళ్లీ . ఎందుకిలా చేస్తున్నాడు? కళ్ళు తుడుచుకుంటూ అన్నాను .
 
 
 
 " సినిమాలకు కూడా వెళ్ళావా ?"అటునుండి ఆశ్చర్యంగా అడుగుతుంది సంధ్య. నాకు చాలా సిగ్గుగా అనిపించింది.అంటే రెండు మూడు వెళ్లాం అంతే ...ఎక్కువకాదు కంగారుగా అన్నాను .అంతేనా  ?ఇంకేమన్నా ఉన్నాయా ? అనుమానంగా తన ప్రశ్న . రెండుసార్లు తను బుగ్గ మీద ముద్దుపెట్టు కోవడం గుర్తొచ్చినా చెప్తే ఇంకెంత తక్కువకు దిగాజారిపోతానో సంధ్య  దృష్టిలో అని ఆ బాధను కోపంగా మార్చేసి " ఎలా కనబడుతున్నాను నీకు ?ఆఖరికి నువ్వు కూడా అర్ధం చేసుకోవడం లేదుకదా "అన్నాను .ఇద్దరు ముగ్గురు నా వైపు చూసారు .
 
 
"అబ్బా..నా ఉద్దేశం అదికాదు నిధి .అతనితో తీయించుకున్న  ఫొటోస్, లవ్ లెటర్స్ గట్రా ఇంకా ఇలాంటివి   ఏమన్నా ఉన్నాయా అని  అంది నెమ్మదిగా .ఆ మాట వినగానే దిగాలుతనం వచ్చేసింది.ఫొటోస్ లేవుకాని లవ్ లెటర్స్ కొన్ని రాసాను .తను రాసినవి అమ్మా,నాన్నా చింపేసారు.తను ఇంకా ఉంచాడంటావా ? భయంగా అడిగాను . తెలియదు మరి  అంది పొడిగా .సంధ్యా ఏదో ఒకటి చెయ్యవే .నరకం అనిపించేస్తుంది నాకు అన్నాను అభ్యర్ధనగా .
 
 
"సరే సరే కంగారు పడకు అదే ఆలోచిస్తున్నా నేనూను .నువ్వు ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకు  అసలే వట్టిమనిషివి కూడా కాదు .అవునూ ఈ ప్రెగ్నెన్సీ  విషయం మీ ఆయనకు చెప్పావా? "అని అడిగింది. లేదు , తను ఆఫీస్ వర్క్ మీద ప్రొద్దున్నే ఢిల్లీ వెళ్ళారు ,"అయినా  అసలు ఎక్కడ చెప్పనిస్తున్నాడు ఈ రాజేష్. నాలుగు  రోజులనుండి కంటికి సరిగా నిద్ర కూడా లేదు . ఏంటో ఏంటో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.ఒక్కోసారి ఇదంతా ఎందుకు జరిగింది అంతా వాసుకి చెప్పేద్దాం అని అనిపిస్తుంది ...కాని ...కాని ..వాసు అర్ధం చేసుకుంటాడా? తను లేకుండా నేను ఉండలేను"  అన్నాను ఏడుపుగొంతుకతో .."వద్దొద్దు ..అలా చెప్పకు .ఈ రోజు నాలుగు తిట్టి క్షమించేయచ్చు .కాని రేపు దీని తాలూకు నీడ నీ జీవితం మీద పడుతూనే ఉంటుంది .మీ ఇద్దరూ ఏం చేసారో ఏం మాట్లాడుకున్నారో,నువ్వు ఎందుకు ఇంటికి ఆలస్యం గా వస్తున్నావో అంటూ లేనిపోని ఆలోచనలు మొదలవుతాయి .ఎంతైనా తను కూడా సగటు భర్తే కదా .మొన్న జరిగిన విషయం అప్పుడే మర్చిపోయావా "అంది.  
 
 
సంధ్య చెప్పినదానిలో నిజం లేక పోలేదు ...."పోనీ రాజేష్ కి  ఫోన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని గట్టిగా దులిపేయనా "ఆవేశం గా అన్నాను. "హే భలేదానివే అలా చెయ్యకు పూర్తిగా దొరికిపోతావ్ .వాడికి ఇంకా తెలియదుగా ఇదే మీ అడ్రెస్స్ అని .పోనీ ఒక పని చేస్తే అంది" సందిగ్ధంగా ఆగుతూ ..ఆ సమయం లో ఆసరాకు గడ్డిపోచ అయినా విలువైనదిగా అనిపిస్తుంది నాకు .'ఏంటీ'?? అన్నాను ఆత్రుతగా . మనమే వాడికి ఒక లెటర్ రాసి నువ్వన్న వ్యక్తి అడ్రెస్స్ ఇది కాదు .దయ చేసి ఇంకోసారి లెటర్స్ వేసి ఇబ్బంది పెట్టకండి అని చెప్తే?? అంది.
 
 నాకు ప్రాణం లేచోచ్చినట్లు అయ్యింది .కరెక్టే  అలా చేస్తే ఇక రాయడేమో  అన్నాను ఆశగా .నువ్వు రాయకు .మళ్ళీ నీ చేతి వ్రాత గుర్తుపట్టచ్చు.మళ్ళీ నీ ఉత్తరాలు అతని దగ్గర ఉన్నాయని అన్నావుగా.అడ్రెస్స్ చెప్పు నేనే రాసి పోస్ట్ చేస్తాను అంది. ఆ క్షణం లో సంధ్య మీద విపరీతమైన అభిమానం పుట్టుకోచ్చేసింది.వచ్చే జన్మ అంటూ ఉంటే నీ కడుపున పుట్టి ఋణం తీర్చుకుంటానే   అన్నాను . అంత వద్దులేగాని ఇప్పుడొకటి సుబ్బరంగా తిని నీ సంగతి చూసుకో అని ఫోన్ పెట్టేసింది. కొద్దిగా మనసు తేలిక అయ్యింది కాని ఇంకా ఏదో బెరుకు .
 
మేడ మీద ఒంటరిగా పచార్లు చేయడం మొదలు పెట్టాను ,వాసు లేని ఆ నాలుగు రోజులు నాలుగు యుగాలుగా అనిపించింది .ఇదే మొదటిసారి కాదు తను అలా వదిలి వెళ్ళడం,నేను బెంగ పడటం  .. కాని ఈసారి పరిస్థితి వేరు .తను ప్రక్కనే ఉండాలనిపిస్తుంది అదే క్షణం లో దూరంగా నేను ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. సంధ్య వేసిన ఉత్తరం వాడికి అంది ఉంటుందా? నమ్ముతాడా? ఇక నా గురించి వెదికే ప్రయత్నాలు మానేస్తాడా? ఏవేవో ఆలోచనలు..
 
 
నా దృష్టి ఎదురింటి మేడ మీద నాలాగే అటు ఇటు తిరుగుతున్నా పదహారేళ్ళ  అమ్మాయి మీద పడింది. ఇంకో రెండు ఇళ్ళ అవతల ఉన్న అబ్బాయి వైపు చూసి ఏవో సైగలు చేస్తుంది .వాడేదో తిరిగి చెపుతున్నాడు.చెప్పొద్దూ తిక్క కోపం వచ్చింది. వద్దే తల్లీ మీ వయసు ప్రేమలు పెళ్లి వరకూ వెళ్ళవు.సినిమాలు,సీరియళ్ళు చూసి ఇలాంటి ఆకర్షణలను ప్రేమ అనుకుని నిండా సమస్యలు ఉన్న గోతులలో  పడిపోతారు.. వాళ్ళేం మగమహారాజులు..ప్రశ్నలు వేయడం తప్ప జావాబులు చెప్పక్కరలేదు . మనమే ఇలా ఎటూ పాలుపోని స్థితిలో తేలుకుట్టిన దొంగల్లా ,కాలు కాలిన పిల్లుల్లా  తప్పుచేసిన వాళ్ళల్లా మిగిలిపోతాం కచ్చగా అనుకుంటుంటే  ఫోన్ మోగుతుంది క్రింద .
 
 
వాసు కాల్ అయ్యింటుంది. ఈ రెండు రోజులు తనకి కాల్ చేస్తే  మీటింగ్ లో ఉన్నాను మళ్లీ చేస్తాను అని,కొలీగ్స్ తో భోజనం చేస్తున్నా రాత్రికి కాల్ చేస్తా  అని పెట్టేసాడు కాని ఫోన్ చేయలేదు . అసలు ఏమనుకుంటున్నాడు నాగురించి?. ఇప్పుడు మాత్రం  గుర్తొచ్చికాదు ,ఖచ్చితంగా రేపు రావడానికి కుదరడం లేదు  ఇంకో నాలుగు రోజులు ఆలస్యం అవుతుంది అని కహానీలు చెప్పడానికి ..అదే చెప్తే అయిపోయాడే కోపంగా అనుకుంటూ విసురుగా హలో అన్నాను .
 
 
'హలో శ్రీ 'అటునుండి ఎవరిదో గొంతు  .నాకు ఒక్కసారిగా గొంతు తడారిపోయింది . బిక్కచచ్చిపోయి అలా నిలబడిపోయాను ."హలో  హలో  నేను రాజేష్ ని మాట్లాడుతున్నాను అండి  . ఇది  ఫలానా నెంబర్ ఏనా అంటూ మా ఇంటి నెంబర్ చెపుతున్నాడు .నా చేతిలో రిసీవర్ ఎలా పెట్టేసానో తెలియదు. కాసేపు మెదడంతా స్తంభించి పోయినట్లు అయ్యింది. అయిపొయింది  మా ఇంటి నెంబర్ తెలుసుకున్నాడు. దేవుడా ఇప్పుడేం చేయాలి ? చమట తో వొళ్ళంతా తడిచిపోతుంది.మళ్ళీ ఫోన్ రింగవుతుంది .. ఆ శబ్దం వింటుంటేనే ఫోన్ నేల కేసి కొట్టాలనిపిస్తుంది ..
 
 

Monday, 14 March 2011

నా రెండవ కధ (రెండవ భాగం)

తలుపు తీయగానే ఎదురుగా  వాసు ... గుండెల్లో ధడ ధడ మంటుంది ..." ఎన్ని సార్లు తలుపు కొట్టాలి ...ఏం చేస్తున్నావ్ లోపల "..ఎందుకో చాలా చిరాకు గా ఉన్నట్లు ఉన్నాడు రావడం రావడం విసుగ్గా అరిచాడు. నేనేం మాట్లాడలేదు.."ఏంటి ఏదో వాసన????".. షూ విప్పుతూ  అంటూ నా వైపు చూసి వంటగదిలోకి పరుగులు పెట్టాడు ...అప్పటికి గాని నేను ఈ లోకంలోకి రాలేదు  ...తన వెనుకే వెళ్లేసరికి అన్నం గిన్నె ,కూర గిన్నె మసి బొగ్గులు.. ఇంకాసేపు ఆగితే అది కూడా అంటుకుని మంటలు వచ్చేవేమో .  ఏం చేస్తున్నావ్ ఇంత నిర్లక్ష్యం గా ..ఛీ కొంప కొస్తే చాలు  ఏదో గోల ...కనీసం తిండి తినడానికి కూడా గతి ఉండదు  విసుగ్గా వెళ్లి బెడ్ రూమ్‌లో పడుకున్నాడు..
  
నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి.ఇదే ఇంకో సమయం అయితే మీరేనా ఉద్యోగం చేస్తుంది అనిగొడవ వేసుకునేదాన్ని ..కాని ఇప్పుడున్న పరిస్తితుల్లో మెదడంతా అల్లకల్లోలం గా ఉంది..ఏవేవో ఆలోచనలు ..రాజేష్ కి ఎవరిచ్చారు నా అడ్రెస్స్ ? ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు.?వాసు కి ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తాడు ?అర్ధం చేసుకుంటాడా? ఇవే ప్రశ్నలు తిరిగి తిరిగి . అంతలోనే మరొక భయం మొదలైంది ...ఇప్పుడు ప్రెగ్నెంట్ ని ..మందులు మాకులు ఏమి వాడకుండా హటాత్తుగా ప్రెగ్నెంట్ ని అయ్యాను..ఈ సమయం లో ఈ విషయం చెప్తే  లేని పోనీ అనుమానాలు మొదలవుతాయేమో? ఎక్కువ ఆలోచిన్చేస్తున్నానా? అలాంటి వాడా వాసు ? ఏమో అనుమానం పెను భూతం  అంటారు .ఒక వేళ అలా అనుకుంటే ?ఇప్పుడు ఏం చేయాలి? ఏ విషయం  ముందు చెప్పాలి? ఎంత సేపు ఆలోచించానో తెలియదు ..ఒక ప్రక్క విపరీతమైన నీరసం .వంట గదిలోనే గోడకు జారబడి ఆలోచిస్తూ నిద్ర పోయాను .

మధ్య రాత్రిలో నిధి ..నిధి అని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచాను ..వాసు కుదుపుతున్నాడు ... నేను కళ్ళు తెరవాగానే నన్ను గుండెలకు హత్తుకుని ఏంటిరా  ఇక్కడ పడుకున్నావ్ ..పద మన రూం కి అన్నాడు . ఆ మాత్రం ప్రేమకే కళ్ళల్లోంచి నీళ్ళు వరదలా వచ్చేసాయి .."ఇంకా నువ్వొస్తే అన్నం తినను అని అలుగుదాం ..ఎలాగూ నువ్వు బ్రతిమాలుతావ్ ఆ వంకన మాట్లాడేద్దాం  అనుకుంటే ఇంతకీ రావు అంతకూ రావు ...ఏం చేస్తున్నావో చూద్దాం అని వస్తే నువ్వు ఇలా ఒక్కదానివే పడుకుంటే బోలెడుజాలేసింది ... సారి రా కోపం లో తిట్టేసాను .నాకు నువ్వు తప్ప  ఇంకెవరున్నారు .మా బాసు వెధవ ఈ రోజు తెగ చిరాకు పెట్టేసాడు .దానికి తోడు నువ్వేమో మాట్లాడవు ...ఇక ఆ కోపం ,ఈ కోపం   నీ మీద చూపించేసాను ..నువ్వేకదా  నా కళ్ళకు లోకువగా  కనబడేది మరి అన్నాడు నుదిటిపై ముద్దు పెడ్తూ ".నాకు ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగి వచ్చేసింది. ఛీ ఎన్ని తిట్లు  తిట్టుకున్నాను ఈ నాలుగు రోజులు తనని.పైగా సంధ్య తో నన్నేదో కష్టాలు పెట్టేస్తున్నట్లు కనీసం హాస్పిటల్ కి కూడా తీసుకు వెళ్ళలేదు అని చెప్పి అక్కసు తీర్చేసుకున్నాను. ఎంత ప్రేమగా చూసుకుంటాడు నన్ను.ఏం ఒక్క మాట అనేసరికి అంత ఉక్రోష పడిపోవాలా నేను  ?

బెడ్రూమ్లో కూర్చోగానే 'ఇక్కడే ఉండేం ఇప్పుడే వస్తా 'అని వంటగదిలోకి వెళ్లి కట్ చేసిన ఆపిల్స్, మజ్జిగా తెచ్చాడు ఇద్దరికీ.నాకొద్దు అన్నా బలవంతంగా తినిపించి .." ఈ మధ్య కాస్త నీరసం గా కనబడుతున్నావ్ .తినకపోతే ఎలా? చూడు పనుల్లో పడి నేను మర్చిపోతుంటాను నీ తిండి నువ్వు చూసుకోకపోతే కష్టం ..ఇంకా చిన్నపిల్లవా " అన్నాడు.తన గుండెల పై తల వాల్చి వింటూ "వాసూ నన్ను వదిలి వెళ్ళవు కదా ...నా మీద కోపం వస్తే వదిలేస్తావా "అన్నాను తన కళ్ళల్లోకి చూస్తూ .. ఇంకా అదే ఆలోచిస్తున్నావా ? నీ మీద నాకెందుకురా కోపం ...వాడు నిన్ను పట్టుకున్నాడని ఏదో కోపం లో  అన్నాను గాని ,నిన్ను అనుమానిస్తానా ?నీ గురించి నాకు తెలియదా..సీత ,సుమతి,సావిత్రి తరువాత శ్రీనిధి  ఎవరన్నా దగ్గరకొస్తే మాడి మసైపోడూ అన్నాడు నవ్వుతూ ...అది తనకి జోకేమోగాని నాకు బాకై గుచ్చుకుంది . ఏం చేయనిప్పుడు ? ఎలా చెప్పేది ?

నాకెందుకో సంధ్య గుర్తొచ్చింది ..మేమిద్దరం చిన్నప్పటి నుండి కలసి చదువుకున్నాం .పెళ్ళయ్యాక కూడా ఒకే ఊరు కావడం తో  తరుచూ కలుసుకుని మాట్లాడుకుంటాం.తనకి రాజేష్ విషయం తెలుసు .తనని అడిగి నిర్ణయం తీసుకుంటే?అలా తెల్లవార్లు ఏవేవో  ఆలోచిస్తూ గడిపేశాను . ప్రొద్దున్న ఆఫీస్ కి వెళ్ళగానే సంధ్యకు కాల్ చేసాను .ఊ ఏంటి మీ శ్రీవారు అలకపానుపు దిగారా? ఏమంటున్నారు అని ఏదో జోక్ వేయబోయింది."ఇప్పుడు నీ జోక్స్ వినే మూడ్ లేదు ప్లీజ్ సంధ్య చెప్పేది విను" అని నిన్న రాజేష్ ఉత్తరం సంగతి చెప్పాను.. "అయ్యో ఇదేంటే ?ఇదేం ట్విస్ట్ ? వాడికి ఇప్పుడు సడెన్‌గా నువ్వెందుకు గుర్తోచ్చావ్ ? సరే సరే కంగారు పడి మీ ఆయనకు ఏమీ చెప్పకు..తరువాత తరువాత లేనిపోని తలనెప్పులు .అదెప్పుడో తెలిసి తెలియని  వయసులో ఆకర్షణ .దానికి నువ్వంత ఫీలవ్వాల్సింది ఏమీ లేదు .నువ్వు సైలెంట్ గా ఊరుకో.వాడికి ఈ అడ్రెస్స్ కరెక్టో కాదో తెలియదు కదా .నాలుగు రోజులు చూసి అది సరి అయిన అడ్రెస్స్ కాదేమోలె అని మర్చిపోతాడు.అయినా ఆ లెటర్ వచ్చి  వారం పైనే అవుతుంది అంటున్నావ్ గా  ఇంకేం రాలేదుగా ..ఏం భయపడకు "అంది ధైర్యం చెబుతూ  ..

సరే అని తనతో పైకి అన్నా ఎక్కడో ఏదో భయం ..పక్కింటావిడ నావైపు పలకరింపుగా చూసి నవ్వినా భయమే , పోస్ట్ మెన్ మా వీధిలో కనబడినా భయమే.. రెండు రోజులయ్యాకా మెల్లిగా ఊపిరి పీల్చుకున్నాను ...సంధ్య అన్నట్లు అడ్రెస్స్ సరికాదని ఊరుకుని ఉంటాడు ..అనవసరం గా ఈ గొడవలో పడి తనకి అసలు విషయమే చెప్పలేదు ..ఈ రోజు చెప్పేయాలి అనుకుంటూ ఇంటికొచ్చేసరికి టేబుల్ మీద అదే తెల్ల కవర్ .ప్రక్కన మా ఆయన ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ...పద్మ ఇచ్చి ఉంటుంది ఇంకా చదివి ఉండరు ...నాకు చెమటలు పట్టేసాయి ..రాజేష్ నుండేనా ? దేవుడా దేవుడా తనదగ్గర నుండి వచ్చిన లెటర్ కాకుండా చూడు అనుకుంటూ తను చూడకుండా మెల్లగా లెటర్ చేతికి చిక్కిన్చుకుని బెడ్రూం లోకి పరుగులు పెట్టాను ...
వణుకుతున్న చేతులతో ఓపెన్ చేసి చదివాను ..

డియర్ శ్రీ 
 ఇది నేను రాస్తున్న రెండో లెటర్ ..ఇంతకు ముందు ఒక లెటర్ వేసాను అది అందిందో లేదో ? నిన్ను చూడాలని ఉంది ..ఏంటిరా అన్ని మర్చిపోయావా ?దొంగ చాటుగా మనం ఇంట్లో చెప్పకుండా చూసిన సినిమాలు,అల్లరి వేషాలు  అన్నీ  గుర్తున్నాయా? నీకేమో తెలియదు కాని నాకెప్పుడు నువ్వు గుర్తొస్తూనే ఉంటావ్. నా నెంబర్ ఇస్తున్నా ఒకసారి ఫోన్ చేయరా  .
ఎదురుచూస్తూ 
 రాజేష్

మంచం మీద కూలబడిపోయాను అలా.. ఏం చేయాలి ఇప్పుడు ? వదిలేలా లేడు..ఇంటి కోచ్చేస్తాడా  కొంపదీసి. పాత స్నేహం కొద్ది రాస్తున్నాడా? లేక కక్ష కొద్ది ఏడిపించడానికా  ? దేవుడా ఏమిటి నాకీ పరిక్షా..అప్పట్లో చిన్నతనం ..తెలియదు ...పైగా ఎంత మంచిగా ఉండేవాడు ...ఎంత తెలివైనవాడు.. అతనికి అర్ధం కాదా ? నాకు పెళ్లైంది ...ఇటువంటి పనులు కాపురంలో చిచ్చుపెడతాయని తెలియదా ? లేక కావాలని ఉక్రోషంతో చేస్తున్నాడా ?తలపట్టుకుని కూర్చున్నా.."నిధి ఎంత సేపు? ..లోపలేం  చేస్తున్నావ్ .నిద్రపోతున్నావా "వాసు అరుపులకు ఈ లోకం లోకి వచ్చాను . 

నా రెండవ కధ

మొన్నరాసిన కధకు వచ్చిన ప్రోత్సాహం ఎక్కువ అయిపోయీ ఇంకో కధ  రాసేసాను .కాని పేరెం పెట్టాలో తెలియలేదు :)


*****************************************
ఇది నిజమేనా ? ఏం వింటున్నాను ?కల కాదు కదా ఆ అయిదు నిమిషాల్లో ఈ మాట ఎన్ని సార్లు అనుకున్నానో లెక్కలేదు . "ఇవి పోలిక్ ఆసిడ్  టేబ్లేట్లు .ఇవి ఐరన్ రోజుకి రెండుసార్లు వేసుకోండి " డాక్టర్ మాటలు ఇంకా నమ్మకం కలగడం లేదు .అవునుమరి ఒకటా రెండా దాదాపు అయిదేళ్ళ నుండి  ఈ సందర్భం కోసం ఎదురు చూసాను .పెళ్ళయిన క్రొత్తల్లో ప్రెగ్నెన్సీ రాకపోతే  ఒక సంవత్సరం వరకూ ఎవరూ ఏమీ అనలేదు .రెండో ఏట అత్తగారు మొదలు పెట్టారు ఫలానా వాళ్ళ కోడలికి బాబు పుట్టాడట ఇంకెవరికో శ్రీమంతం అంట అని .ఆ తరువాత వరుసగా బంధువుల సలహాలు మొదలయ్యాయి .అక్కడెక్కడో ఎవరో డాక్టర్ ఎలాంటి ప్రాబ్లం అయినా ఇట్టే తెలుసుకుని ట్రీట్మెంట్ చేసేస్తాడట.ఇంకెవరో డాక్టర్ హస్తవాసి మంచిదట ఆమె దగ్గరకు వెళితే అందరూ కవలలే పుడతారట ..ఇలాంటివి విని మొదట్లో  ఆత్రుతగా పరిగెట్టడం ,అడ్డమైన టెస్ట్‌లు చేయించుకుని మందులు వాడటం .చివరకు ఫలితం సున్నా ... బోలెడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆరోగ్యం నాశనం అవ్వడంతో చిరాకొచ్చి గత ఆరునెలలుగా ఏదైతే ఏమైన్దిలే అని ఈ విషయం ఆలోచించడం పూర్తిగా మానేసాను .

ఇప్పుడు డాక్టర్ ఉన్నట్లు ఉండి నీకు రెండోనెల అంటుంటే అసలు ఎలా స్పందించాలో తెలియక  అయోమయంగా ఉంది.ఆనందం కంటే  ముందు అనుమానం . డాక్టర్ పొరబడటం లేదుకదా ?ఉన్నట్లు ఉండి సారి అండి ఇంకెవరిదో రిపోర్ట్ మీదనుకున్నాను అంటుందేమో అని భయం. అప్పటికీ సంధ్యను నాలుగు సార్లు అడిగాను ఇంకోసారి టెస్ట్ చేయిన్చుకోనా  అని . తను కూడా అన్నే సార్లు నోరు మూసుకుంటావా డాక్టరే కదా  స్కానింగ్ తీసింది .పిచ్చి అనుమానాలు పెట్టుకోకు అని కసిరింది . సంధ్యకు చెప్పి ఆటో ఎక్కి వస్తుంటే దారంతా ఆలోచనలు. ఈ విషయం వింటే ఎవరెవరు ఎలా ఆనందపడతారో  అని ఊహలు.ముఖ్యం గా వాసు కి తెలిస్తే  ? ఏం చేస్తాడు ?తెలుగు సినిమా హీరోలా ఎత్తుకుని గిర గిర ....నా ఊహ మధ్యలోనే ఆగిపోయింది  నాకు వాసుకి గొడవ జరిగి దాదాపు పది రోజుల నుండి సరిగా మాటలు లేవని గుర్తొచ్చి..


అది తల్చుకోగానే అంతటి  ఆనందం ప్లేస్లోనే కోపం ... ఎంత పంతం తనకు. ఈ పదిరోజుల్లో ఒక్కసారి కూడా 'సారి' చెప్పాలనిపించలేదు తనకి .ఎప్పడూ నేనే తగ్గాలి .తప్పు తను చేసినా సరే , నేను చేసినా సరే .అంతా బాగానే ఉంటాడు కాని తనకు నచ్చినట్లు ఉన్నంత వరకే ...తేడా వస్తే తనకంటే మొండివాడు ఇంకెవరూ ఉండరు ..నాకసలే ఎక్కువ సేపు మౌనంగా కూర్చోవడం చిరాకు .ఉన్నది మేమిద్దరమే ఆ ఇంట్లో . ఎంతకాలమని మూతి బిగించుకుని కూర్చోవాలి .అందుకే ఎప్పుడూ నేనే సారి చెప్పేస్తాను ...కాని ఈ సారి  నేనూ తగ్గలేదు .ఎంతకాలం దూరంగా ఉంటాడో చూద్దాం లెమ్మని మాట్లాడటం మానేసాను ...మరి ఆ రోజు జరిగిన సిట్యువేషన్ అటువంటిది ..


పదిరోజుల క్రితం సినిమాకి వెళ్లి వస్తూ దియేటర్ మెట్ల మీదనుండి పొరపాటున కాలు మెలికపడి పడిపోయాను .ఆ పడేదేదో క్రిందపడినా బాగుండేది నాలుగు దెబ్బలు తగిలి అక్కడితో పోయేది .కాని సరిగ్గా వెళ్లి నా ముందు ఉన్న అబ్బాయిమీద పడ్డాను .అతను ఇద్దరం పడిపోకుండా నిలదొక్కుకొని పట్టుకున్నాడు నన్ను. అదిగో అక్కడి నుండి మొదలైంది నస నాకు. సరిగ్గా నడవడం చేతకాదా. ఆ కుచ్చిళ్ళు ఎందుకని కాళ్ళకు అడ్డం పడేలా చీరకడతావు అని ." ఏంటలా మాట్లాడుతావు.పడతానని ముందే తెలిస్తే అసలు పడకుండా జాగ్రత్తగా ఉంటానుగా ..నాకేమన్నా సరదాయా?లేక కావాలని చేసానా ? "అని గొడవేసుకున్నాను ..." నువ్వు కావాలని చేసావ్ అని నేను అన్నానా? ఎవరి పెళ్ళాం అంటే వాడికి పోసేసివ్ నెస్ ఉంటుంది . ఎంత ఒళ్ళు ఉడికిపోయిందో తెలుసా ..అలా గోడవేసుకుంటావే గాని సరేలే ఈసారి నుండి జాగ్రత్త గా ఉంటా అనచ్చుగా ఒక్క మాటతో వదిలిపోయేది అన్నాడు" అడ్డంగా వాదిస్తూ..నాకు విసుగొచ్చేసింది .."అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకోమంటావా కావాలని చేశా అని ..మీరు మాత్రం సినిమాల్లో హీరోయిన్లను, ఎఫ్ టీవిలను కళ్ళు అప్పగించి చూడచ్చెం.. మా విషయం లోకి వచ్చేసరికి మాత్రం నీతులు చెప్తారు" అని ఎదురు వాదించాను.అది చిలికి చిలికి గాలివాన అయ్యింది .ఫలితం పదిరోజుల మౌనవ్రతం .

అందుకే ఈ విషయం చెప్పి ఎలా ఏడిపించాలో అలా ఏడిపించాలి .లేకపోతే నాలుగు రోజుల నుండి ఈ విషయం మూలంగా నలతగా ఉండి నీరసంగా కనిపిస్తున్నానన్ను  పట్టించుకోలేదు .ఆఖరికి ఈ రోజు ఆఫీస్‌లో కళ్ళు తిరుగుతుంటే భయమేసి  పర్మిషన్ తీసుకుని  సంధ్యను తోడుతీసుకుని వెళ్లాను .ఇటువంటి విషయం భర్త ప్రక్కన ఉండగా డాక్టర్ చెప్తే ఎంత బాగుంటుంది .ఏవేవో  ఆలోచనల మధ్య ఇంటికొచ్చేసాను .
ఆటో దిగుతుంటే 'నిధి 'గట్టిగా పిలిచింది ప్రక్కింటి పద్మ .పలకరింపుగా నవ్వాను .ఏమిటి బొత్తిగా   కనిపించడం మానేసావు .నీకు లెటర్ వచ్చి నాలుగు రోజులైంది .ఇద్దామంటే నువ్వు కనబడితే కదా అంది చేత్తో కవర్ ఒకటి పట్టుకొస్తూ. ఇద్దరం ఉద్యోగస్తులం అవ్వడం వల్ల లెటర్స్ ఏమన్నా వస్తే ప్రక్కింట్లో ఇచ్చేసి వెళ్ళిపోతాడు పోస్ట్ మెన్ .ఆవిడ ఎప్పుడూ మర్చిపోయి ఇలా వారం పదిరోజులయ్యాకా ఇస్తూ ఉంటుంది .పైగా నేను కనబడలేదంటూ ఒక సాకు .కాని అవసరం మాది కదా అందుకే పర్వాలేదండి అని నవ్వుతూ తీసుకుని ఇంట్లోకి వచ్చాను .


స్నానం చేసి  స్టవ్ మీద అన్నం ,తనకిష్టం అయిన కూర  పెట్టి అలసటగా హాల్ లో కూర్చున్నాను.తను ఇంకా రాలేదేంటి.పని ఎక్కువ ఉందా? క్షణమొక యుగం అంటే ఏంటో తెలుస్తుంది నాకు .అప్పటివరకూ ఈ విషయం చెప్పి  తరువాత అలక కొనసాగించి ఎలా ఏడిపించాలో ఆలోచించిన నాకు అబ్బా పోన్ చేసి విషయం చెప్పేస్తే బాగుంటుందేమో అని ఆరాటం.ఉన్నట్లు ఉండి నా చూపు ప్రక్కిన్టావిడ ఇచ్చిన లెటర్ మీద పడింది. ఎన్నాళ్ళు అయ్యిందో ఈ లెటర్ వచ్చి లాస్ట్ టైం అంతే ఫ్రెండ్ శుభలేఖ పెళ్ళయిన మరుసటి రోజు తెచ్చి ఇచ్చింది ఇప్పుడు ఇదేం ఇంపార్టెంట్ లెటరో   అనుకుని ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాను .
డియర్ శ్రీ ,
ఎలా ఉన్నావు ? గుర్తుపట్టావా ?నేనూ రాజేష్ ని .
ఈ ముక్క చదవగానే గొంతు తడారిపోయింది ."రాజేష్ " గొణుక్కుంటూ అనుకుని మిగిలింది చదవడం మొదలుపెట్టాను . నీకు పెళ్లి అయింది అంటకదరా .నేను గుర్తు రాలేదా? నీ అడ్రెస్స్ కోసం ఎప్పటి నుండి ట్రై చేస్తున్నాను తెలుసా  .అలా ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు .ఎంత ప్రయత్నించినా నీ ఫోన్ నెంబర్ దొరకలేదు .ఇది కూడా కరెక్ట్ అడ్రేస్స్నో కాదో తెలియదు.క్రింద నా ఫోన్ నెంబర్ ఇస్తాను వెంటనే ఫోన్ చేయి.ఎదురుచూస్తూ ఉంటాను .

కళ్ళు తిరిగినట్లు అయ్యి సోఫాలో కూలబడిపోయాను .ఎప్పటి రాజేష్ .నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్ .నా పేరు శ్రీనిధి అయినా నన్ను  'శ్రీ ;అని పిలిచేది తానొక్కడే .నేను పిలిచే పేరుతో ఇంకెవ్వరూ నిన్ను పిలవకూడదు అని అంటున్నపుడు అప్పట్లో చాలా గర్వం గా ఉండేది. తను బాగా చదివేవాడు .క్లాస్ ఫస్ట్ తనే ఆ కారణం చేతనో, మరి బాగుంటాడనో తెలియదుగాని చాలా ఆకర్షణ ఉండేది తనంటే.అటు ఫ్రెండ్స్ ఇటు ఫ్రెండ్స్ ప్రోద్బలం తో ఒక సారి ఐ లవ్ యూ చెప్పేసుకున్నాం.ఆ తరువాత షరా మామూలే ఇంట్లో తెలిసి ఇద్దరికీ బడిత పూజ చేసి గదిలో సెలవలన్ని రోజులూ  కట్టి పడేసారు. నేనూ నాలుగు రోజులు అన్నం తినను అని నిరాహార దీక్ష చేసాను . ఆ తరువాత కాలేజ్ ప్రారంభం అయినపుడు తెలిసింది రాజేష్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే ఊర్లో చదువుకు పంపేసారని .దానితో కధ కంచికి మేము మా ఊర్లకు పరిమితం అయిపోయాం .మొదట్లో ఎక్కువ గుర్తోచ్చేవాడు.తరువాత తరువాత అప్పుడప్పుడు ..పెళ్ళయ్యాక అసలు గుర్తేలేదు .ఇప్పుడు ఉన్నట్లు ఉండి ఇలా ..

ఒకప్పుడు తను ఎక్కడున్నాడో అని తెగ కలవరించిన నేను ఇప్పుడు ఎక్కడ వచ్చేస్తాడో అని భయంతో చెమటలు కక్కుకున్నాను .అసలెందుకు ఇన్నాళ్ళ తరువాత లెటర్ వేసినట్లు? అది కూడా నాకు పెళ్లి అయ్యిందని తెలిసి .అంత అడ్రెస్స్ తెలుసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? .ఈ విషయం వాసుకి తెలిస్తే? అమ్మో ఇంకేమయినా ఉందా? ఎవరినో పొరపాటున తాకితేనే గొడవ చేసాడు.తెలియని వయసులో జరిగిన విషయం వింటే అర్ధం చేసుకోవడం మాట అటుంచి ఏం చేస్తాడో? ఎంత సేపు అలా ఉండిపోయానో తెలియదు ఎవరో తలుపులు దభ దభా బాదుతున్న శబ్దం ..ఉలిక్కిపడి ఈ లోకం లోకి వచ్చాను .చేతిలో లెటర్ ఎప్పుడు పడిపోయిందో క్రింద పడిపోయింది . గభ గభా దాన్ని తీసుకుని బీరువాలో నా చీరల మధ్య పెట్టి   పరుగున తలుపు తీశాను . 

Wednesday, 9 March 2011

బాలాజీ-భక్తుని సరదా సంవాదం

మామూలు సమయాల్లో మర్చిపోయి మనకి కష్టాలు వచ్చినపుడు మాత్రం భగవంతునిని తెగ ధ్యానం చేసి తలుచుకున్టాము కదా . అప్పుడు స్వామీ వారు భక్తులతో ఇలా అంటారట .


భక్తుడు : స్వామీ డబ్బులేదు అప్పుల పాలైపోయాను నువ్వే దిక్కు నా కష్టాలన్నీ తీర్చు
బాలాజీ : నాయనా నేనే పెళ్ళికోసం కుభేరుని వద్ద అప్పు తీసుకుని ఇంకా వడ్డీ కడుతున్నాను.నన్ను అడుగుతున్నావా ?


భక్తుడు :స్వామీ నా భార్య గయ్యాళి .ఈ బాధను భరించలేకున్నాను .ఏదైనా దారి చూపు .
బాలాజీ: నీవు ఒక్క భార్య తోనే తిప్పలు పడుతున్నావు.మరి నాకిద్దరు .నేనెవరికి చెప్పుకోవాలి .

భక్తుడు : స్వామీ పెద్దగా కష్టాలేమీ లేవుగాని ఆఫీసుకి బస్సుల్లో ఆటోల్లో వెళ్ళడం కష్టం గా ఉంది త్వరలో ఒక కారు కొనేలా ఆశీర్వదించు
బాలాజీ.: నేనే నడిరాత్రి అలివేలు ను చూడటానికి కాలి నడకన కొండ దిగుతాను ఇక నిన్నేమి ఆశీర్వదించను?
భక్తుడు : స్వామీ సకల సంపదలు ఉన్నాయి కాని నిద్ర లేమితో బాధ పడుతున్నాను .ఎన్ని మందులు మింగిన పలితం ఉండటం లేదు .నువ్వే దిక్కు
బాలాజీ: నిద్ర సంగతి నన్నేం అడుగుతావులే .అర్ధరాత్రి వరకు నైవేద్యాలు ,అష్టోత్తరాలు,షోడశోపచార పూజలు ,దర్శనాలతో ఒంటికాలి పై నిలబెడుతున్నారు .కాసేపు పడుకుందామని కనులు మూయగానే వెనువెంటనే సుప్రభాతాలు ,మేలుకొలుపులు .నాకెవరు దిక్కు ?


భక్తుడు :స్వామీ చిన్న వయసు అప్పుడే బట్ట తల వచ్చేస్తుంది .జుట్టు ఊడకుండా ఏదైనా ఉపాయం దొరికే మార్గం చూడు
బాలాజీ : నన్నే అడిగావా ! నా జుట్టు కోసమేగా నీల తన నీలాలు నాకర్పించింది .ఆమె నీలాలను తిరిగి మామూలు రూపం తీసుకురావడానికి మీ అందరి తల నీలాలను ఇప్పటికీ తీసుకుంటున్నాను .నేనేమి చేయలేనయ్యా .
(ఎప్పుడోఏదో పుస్తకంలో  చదివాను.)

Monday, 7 March 2011

ఇంకొంచెం ప్రేమించుకుందాం


మన పరిచయపు తోటలో
ఎన్నెన్నో ఆనందపు పూలు
అనుభూతుల ఫలాలు
ఆశల ఆకులు
పూస్తున్నాయి,కాస్తున్నాయి ,పండుతున్నాయి

కాని కాలం గడిచేకొద్దీ  
 అనుమానపు చిగుళ్ళు తొడుగుతున్నాయి
అపార్ధాల ముళ్ళు గుచ్చుకుంటున్నాయి
ఆవేశపు తెగుళ్ళు సోకుతున్నాయి  


మరేం చేద్దాం? 
అహం అనే  కలుపును తొలగించి ,
నమ్మకపు వేళ్ళను పటిష్టంగా ఉంచడానికి
ఇంకొంచెం ప్రేమ పన్నీరును చిలకరిద్దామా???
మాట విను ప్రియా

కనురెప్పల దుప్పటి కప్పి
కంటి పాపను నిద్రపుచ్చుదాం అంటే
కన్నీటి వర్షం భోరున కురుస్తుంది

నీ గుండె గదిలో చోటు ఇచ్చి
మనసు తోడుగా నిద్రపుచ్చి
ప్రేమ పానుపు పై పడుకోనీయవా !

Saturday, 5 March 2011

నా మొదటి కధ (పెళ్లిచూపులు -ఆఖరి బాగం )

చీకట్లు ముసురుకుంటున్నాయి మెల్లగా .చాలా మంది వెంట తెచ్చుకున్న రాత్రి భోజనాలు కానిస్తున్నారు. . మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదేమో బాగా ఆకలి వేస్తుంది.అతను కూడా ఏమీ తెచ్చుకోలేదనుకుంటా కళ్ళు మూసుకుని పడుకున్నాడు  .ట్రైన్లో మీల్స్ వస్తే ఆర్డర్ చేద్దాం అనుకున్నాగాని ఎవరూ రావడం లేదు. ఈ రోజేమయ్యిందో ఏమో అందరూ ఇలా ఏడిపిస్తున్నారు చిరాగ్గా తిట్టుకున్నాను .ఏదో స్టేషన్ వచ్చింది ..అక్కడక్కడా షాపులు ..ప్రాణం లేచోచ్చినట్లు అయ్యింది .కొద్దిగా కోలాహలం గా ఉంది...నేను లేచాను క్రిందకు దిగడానికి .మళ్ళీ ఏమీ దొరకకపోతే కష్టం ."ఎక్కడికి ?"అతను అడిగాడు. ఇతనికి ఎందుకు చెప్పాలి ?అయినా ఏమిటా ప్రశ్న ?విసుగ్గా అనుకుంటూ  సమాధానం చెప్పకుండా ముందుకి కదల బోయాను.ఎవరో అయిదుగురు ఆరుగురు చాలా లగేజ్ తో ఎక్కారు .అవి సర్దడానికి దారికడ్డంగా నించుని కదలడం లేదు . 

తనే మళ్ళీ ...."క్రిందకు వెళ్ళాలా? ఇక్కడ ట్రైన్ ఎక్కువ సేపు ఆగదు "అన్నాడు మెల్లిగా .నా ఎదురుగా ఉన్నవాళ్ళను తప్పించుకుని క్రిందకు వెళ్లి వచ్చేంత సమయం ఉండదని అర్ధం అయి మళ్ళీ  నా సీట్లో కూర్చున్నాను ."ఏం కావాలి చెప్పండి నేను  తెస్తాను" అన్నాడు మృదువుగా ..అతనలా మాట్లాడుతుంటే మనసు లాగేస్తున్నట్లు ఉంది .ఎందుకింత శ్రద్ద చూపిస్తున్నాడు .ఏమీ లేదన్నట్లు మొహం  అడ్డంగా ఊపాను.ఏమనుకున్నాడో తను  వాళ్ళను తప్పించుకుని  బయటకు వెళ్ళాడు . "ఎక్కడికి ?" ఈ సారి నేను అడగాలనుకున్న మాట పెదవి దాటలేదు. కాని ఈ స్టేషన్లో ఎక్కువ సేపు ఆగదు అన్న అతని మాటలు గుర్తొచ్చి  భయం గా అనిపించింది .కిటికీ లో నుండి బయటకు చూసాను  తను కనబడతాడేమో అని .ట్రైన్ మెల్లగా కదలడం మొదలు పెట్టింది.ఎక్కడకు వెళ్ళాడు ? సామాన్లు సర్దుకునేవాళ్ళ హడావుడి తగ్గింది .ట్రైన్ వేగం పుంజుకుంది .అయ్యో ,ఇంకా రాలేదు తన బేగ్ కూడా ఇక్కడే ఉండిపోయింది .పరుగున తలుపు దగ్గరకు వెళ్లాను .ఎప్పుడో ప్లాట్ ఫాం దాటేసింది ట్రైన్ ..చిమ్మ చీకటి ..ఏమీ కనిపించడం లేదు . ఇప్పుడెలా ? చైన్ లాగేస్తే ? ఏమైనా గొడవ అవుతుందా?


కళ్ళకు సన్నటి నీటి పొర అడ్డుపడుతుంది   తెలియకుండానే ...టిక్కెట్ తనదగ్గరే ఉందా? డబ్బులు ఉన్నాయో లేవో ?వెళ్ళద్దని  అప్పుడే చెప్పాల్సింది  .పంతంగా ఆగిపోయాను .నన్ను నేను తిట్టుకున్నాను ...అంతలోనే ఉహుహు  అంత  చనువు మా మధ్యలేదు అందుకే ఆగిపోయాను సర్ది చెప్పుకున్నా ..మరి నేను దిగుతా అన్నపుడు తను అడిగాడుగా ?ఏమిటో అయోమయం .ఇప్పుడేం చేయాలి .? "హలో! ఇక్కడేం చేస్తున్నారు  అక్కడ కనిపించక పోయేసరికి భయం వేసింది కిందకు దిగారేమో అని " అన్నమాటలకు గిరుక్కున వెనక్కుతిరిగాను . అతన్ని చూడగానే ఆ చెంపా ఈ చెంపా వాయిన్చాలన్న కసి వచ్చేసింది .మెల్లిగా కంట్రోల్ చేసుకుంటూ" మీరెక్కడికి వెళ్ళారు నాకు వెళ్ళద్దని  చెప్పి "అన్నాను కోపంగా నా సీట్లో కొచ్చి కూర్చుంటూ ."అంటే ...టైం అయ్యింది.. మీకు ఆకలి వేస్తుందేమో అని" అన్నాడు చేతిలో ఏవో పెకేట్స్ వాటర్ బాటల్స్ చూప్తూ .నేనేం మిమ్మల్ని అడగలేదే విసురుగా అన్నాను.తనేం మాట్లాడలేదు .ఇద్దరం పావుగంట కిటికీ నుండి బయటకు చూస్తూ కూర్చున్నాం.


ఏవేవో ఆలోచనలు.ఎందుకని అతని పై అంత కోపం అంత ఉక్రోషం వస్తుంది? .మాట్లాడాలని అనిపిస్తుంది .వద్దని అనిపిస్తుంది .ఇంకా అతనిని ఇష్టపడుతున్నానా? తప్పు కదా ?అతనికి పెళ్లి కుదిరిపోయి ఉంటుంది ...ఒక వేళ కాకపొతే ? అయినా సరే ఎలా ఇష్టపడతాను ? ఒక సారి ఛీ అన్నాకా? ఒక వేళ తల్లిదండ్రుల బలవంతం మీద వద్దన్నాడేమో ? అంత భయపడేవాడు మళ్ళీ ఎందుకు ఈ నాటకాలు ?అంత శ్రద్ద చూపడాలు?ఒకవేళ నా ప్లేసులో ఇంకో అమ్మాయి ఉంటే ఇలాగే చేస్తాడా?అతని సంగతి సరే ..మరి ఇంత ఇష్టపడిన నేను చేసిన పనేమిటి?తను క్రింద ఉండిపోతే చైన్ లాగడానికి కూడా  భయ పడ్డాను ...ఆలోచించాను.. ఇదే నేనే క్రింద ఉండి పోతే తనేం చేసి ఉండేవాడు ? ఇవన్నీ సరే ...నిజంగా నాకు అతని పై కోపం ఉందా?నిజంగా మాట్లాడాలని లేదా ? మరెందుకని  ఇంత పంతం  ?  కాసేపు మాట్లాడుకోవడానికి కూడా ఎందుకు ఇంత ఆలోచన ? ఏదో తప్పు చేసినట్లు? అన్ని కోల్పోయినట్లు ఇలా మౌనంగా ?నన్ను నేను మోసం చేసుకుంటూ..కొద్ది సేపు కూడా నాకు నచ్చినట్లుగా ఉండలేనా? ఇంకేం ఆలోచించ బుద్ధి వేయలేదు .


"ఆకలి వేస్తుంది తిందామా? "నా ప్రశ్నకు ఉలిక్కిపడి లేచాడు తను .."ఏం తెచ్చారు?" చొరవగా తన దగ్గర పెకేట్స్ ఓపెన్ చేసి చూసాను ...ఇడ్లీ ..వేడిగానే ఉన్నాయే ..."ఎక్కడ తెచ్చారు ?మరి నాకు కనబడలేదు ఇందాక చూసినపుడు ."నేను ఉన్నట్లు ఉండి గలగలా మాట్లాడేస్తుంటే  అయోమయంగా చూడటం తన వంతైంది ...మాటలలో పడటం వల్లనేమో ఇందాకటి కోపం చిరాకు అన్ని పోయాయి .ఏదో స్నేహితునితో మాట్లాడుతున్నట్లు మళ్ళీ మునుపటి పావనిని అయిపోయాను .మీరు చెప్పిన పుస్తకం కొద్దిగా  చదివాను బాగుంది అన్నాను ..చిన్నగా నవ్వాడు.."వెన్నెల్లో గోదావరి అంత బాగుంటుందా? "అన్నాను ."చాలా  బాగుంటుంది  ..ఓ సారి ఫ్రెండ్ తో"... తను ఇంకేదో చెపుతుంటే ఆపుచేసి .." ఏం వెన్నెల్లో కృష్ణ ,వెన్నెల్లో యమునా,వెన్నెల్లో తుంగబధ్ర బాగోవా " అన్నాను . "అబ్బా అర్ధం అయ్యింది  వదిలేయండి ప్లీజ్ .." అని
నవ్వాడు.ఎందుకనో అతనిని అలా ఏడిపించడం సరదాగా అనిపించింది . సాహిత్యం, రాజకీయాలు ,ఉద్యోగం ఇలా  మా కబుర్లు చాలా సేపు సాగాయి. టైమవుతున్న కొద్ది జనాలు లైట్లు ఆపు చేసి నిద్రపోవడానికి రెడీ అవుతున్నారు . అంతకు  ముందు టీసి వచ్చినపుడు వేరే సీట్ దొరుకుతుందేమో అని అడిగి చూసాం .కాని లేవు.

అలసిపోయి ఉన్నానేమో నిద్ర వచ్చేస్తుంది.నా ఆవలింతలు గమనించగానే నేను మధ్యాహ్నం పడుకున్నాను .మీరు పడుకోండి కాసేపు .అతను లేచాడు ."లేదు పర్వాలేదు ..నాకు కూర్చుని నిద్రపోవడం అలవాటే "అన్నాను మొహమాటంగా .కానీ  కూర్చుని ఎలా పడుకోవాలో తెలియడం లేదు అలా అని అతన్ని ఇబ్బంది పెట్టడమూ ఇష్టం లేదు . అతను చిన్నగా నవ్వుతూ "మీరు పడుకోండి .నేను డోర్ దగ్గర కాసేపు ఉండి వస్తాను" అన్నాడు .అలాక్కాదు ."కాసేపు ఆగి మీరు నన్ను నిద్రలేపండి ప్లీజ్" అన్నాను నాకేందోకో చాలా మొహమాటంగా అనిపించింది .'సరే' అని తను వెళ్ళిపోయాడు .బేగ్ క్రిందకు దించి దుప్పటి తీశాను .

మంత్రమేసినట్లు ఎలా నిద్రపోయానో మధ్యలో ఓ సారి మగతగా మెలుకువ వచ్చింది . తను నా కాళ్ళ దగ్గర తగలకుండా కూర్చున్నాడు. ఇందాక నేను ప్రక్కన పెట్టి వదిలేసిన పుస్తకం తన చేతిలో .గాలి ఎక్కువ వస్తున్నట్లు ఉంది కిటికీ తలుపులు వేసేసాడు. చాన్స్ దొరికితే తాకాలని చూసే ఈ రోజుల్లో అతని ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా అనిపించింది.మళ్ళీ ఎలా నిద్ర పట్టేసిందో రివ్వున చల్లగాలి మొహానికి కొడితే మెలుకువ వచ్చింది .కళ్ళు తెరవగానే ఎదురుగా  అతను నా మొహం వైపే చూస్తూ.."క్షమించండి  ..ఎలా లేపాలో తెలియక కిటికీ తలుపు తెరిచాను "అన్నాడు. "సారీ బాగా మొద్దు నిద్ర చేసాను కదూ ...మీరు పడుకోండి అన్నాను లేచి  కూర్చుంటూ ".. "పడుకోవడమా?తెల్లవారిపోతుందండి ...ఇంకొక గంటలో మీ ఊరు వచ్చేస్తుంది "అన్నాడు నవ్వుతూ.మనసంతా దిగాలుగా అయిపొయింది.ఇంకొక గంటలో అతనెవరో నేనెవరో .పిచ్చా నీకు మనసు ఒక ప్రక్క తిడుతుంది.

మా మాటలకు పడుకున్న వాళ్ళెవరో కొద్దిగా ఇబ్బందిగా కదిలారు."హే మర్చిపోయాను డోర్ దగ్గర మాట్లాడుకుందామా? మీకొకటి చూపించాలి "అన్నాడు .సరే అని లేచాను .."ఈ చీకటిలో ఏమి చూపిస్తారు" చలికి చున్ని వొళ్ళంతా కప్పుకుంటూ అన్నాను ."అలా చూస్తూ ఉండండి మరి అన్నాడు " బయటకు చూస్తూ  .ట్రైన్ శబ్దంలో ఏదో మార్పు .ఏదో బ్రిడ్జ్ మీదనుండి వెళ్ళుతున్నట్లుగా   లైట్ల కాంతిలో కనబడుతుంది. గాలి మరింత చల్లగా ,ఒక రక మైన నీటి హోరు .గోదావరి నది .మనసంతా తీయగా, తనువంతా హాయిగా నిండైన  గోదావరి. అప్రయత్నంగా ముందుకి వచ్చాను .ఉన్నట్లు ఉండి ఏదో గుర్తువచ్చి "మీ దగ్గర డబ్బులున్నాయా? "అన్నాను ..."ఏం? ఎంత? "అన్నాడు అయోమయంగా చూస్తూ .."ప్లీజ్ కోయిన్ ఇవ్వండి "అన్నాను చిన్నపిల్లలా గెంతుతూ ..అతనికి అర్ధం అయినట్లు ఉంది తీసి చేతికి ఇచ్చాడు .గోదావరిలో విసిరి  దణ్ణం పెట్టుకున్నాను ."చిన్నపుడు అమ్మమ్మ తో వెళ్ళినపుడు ఇలానే చేయించేది ,బోలెడు పుణ్యం అంట" అన్నాను నవ్వుతూ ."ఇది మరీ బాగుంది డబ్బులు నావి పుణ్యం మీదీనా "అన్నాడు తనూ నవ్వుతూ  . "వెన్నెల్లో గోదావరి చూపించమంటే చీకట్లో గోదావరి చూపించేవాళ్లకు  అంతే మరి " అన్నాను ఉడికిస్తూ . ఇద్దరం గట్టిగా నవ్వుకున్నాం అయిదు నిమిషాలు .


"ఇంకో అరగంటలో మీ ఊరు వచ్చేస్తుంది సామాను సర్దుకోవాలేమో మీరు" అన్నాడు మెల్లగా ."ఊ సర్దుతా" అన్నాను పొడిగా ..మనసంతా బాధ.అతనికేమి అనిపించడం లేదా? ఇంకా నచ్చలేదా నేను ? తన వైపు చూసాను .సీరియస్ గా బయటకు చూస్తున్నాడు."ఒక విషయం అడగచ్చా? "అన్నాను సంశయిస్తూనే . చెప్పండి అన్నాడు." మీరు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు ? "అన్నాను తడబడుతూ .. అతను చురుగ్గా నా కళ్ళల్లో చూసాడు ."అంటే,అలాక్కాదు మీకు పెళ్లి కుదిరింది అని అన్నారు గణపతి గారు అప్పట్లో ఇంకా ఎందుకు చేసుకోలేదా అని" ప్రశ్న పూర్తికాగానే గుండెల్లో దడ దడ మంది ... నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానా? మనసులో పదే పదే అనుకున్నాను.."ఆ ప్రశ్న నేనూ అడగాలేమో ...మీకు ఎవరితోనో పెళ్లి కుదిరింది ఇంకేదో సంబంధం ఉంది చూడమని బలవంతం చేసాడు కాని  ఇంకెవరినీ చూడాలనిపించలేదు... "అన్నాడు నెమ్మదిగా ...


నాకు అయోమయంగా అనిపించింది.అర్ధం అయ్యి కానట్లు... అంటే మధ్యలో ఎవరో ఏదో చేసారు .. "లేదు మేము అలా అనలేదు తేరుకుంటూ" అన్నాను కంగారుగా.. "సరేలెండి ఇప్పుడు  కుదిరిపోయిందిగా..అడ్వాన్స్డ్  కంగ్రాట్స్ " ... ఇక బయలుదేరండి ఇంకో పదినిమిషాలు ఉంది అంతే అంటూ మా సీట్ దగ్గరకు నడిచాడు. ఏడుపొచ్చేసింది..ఇందాక కోపం లో పెళ్లి కుదిరిపోయింది అని చెప్పిన మాటలు నిజమని నమ్మేసాడు. ఏం చేయాలి? కాదు అని చెప్తే ? ఏమనుకుంటాడు ?చులకన అయిపోతానా?  మెల్లిగా కళ్ళు తుడుచుకుని బేగ్లో దుప్పటి సర్దుకుని కూర్చున్నాను . చెప్పాలనిపిస్తుంది మళ్లీ చెప్తే ఎలా స్పందిస్తాడో తెలియక భయం వేస్తుంది .


ఆసరికే ట్రైన్ లో అందరూ హడావుడిగా లేచి అటు ఇటు తిరుగుతున్నారు. చెప్పేస్తే? "అది మరి" ..ఏదో చెప్పబోయాను  .."ఒక్కరే వెళ్ళాలా? ఎవరైనా వస్తున్నారా మీ కోసం" అతను అడిగాడు.."లేదు నేనే వెళ్ళాలి "..."కాని"... నా మాట పూర్తి కాకుండానే "ఇంకా కొద్దిగా చీకటిగానే ఉంది.పరవాలేదా ?అయినా ఇంకో పది నిమిషాల్లో తెల్లవారిపోతుంది అనుకోండి "అన్నాడు బయటకు చూస్తూ.. ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో తెలియడం లేదు ..ట్రైన్ కూత వినబడుతుంది స్టేషన్ లోకి వచ్చేసినట్లు .రండి అంటూ నా బేగ్ పట్టుకుని డోర్ దగ్గరకు వెళ్ళాడు .చాలా మంది దిగుతున్నారు.మెల్లిగా అతని వెనుకనే నడిచాను. క్రిందకు దిగాకా' ధేన్క్స్ ' అన్నాను ఏం అనాలో తెలియక ..మనసు చెప్పెయమని తొందర చేస్తుంది.ఏదో బెరుకు అడ్డం వచ్చేస్తుంది .అతను సారీ నాకు ఇష్టం లేదు అంటాడేమో అని.


"వెళ్తాను" ..చెప్పి వెనుకకు తిరిగాను .అప్పటివరకు అదిమిపెట్టుకున్న కన్నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి ..అయిపొయింది.వెళ్ళిపోతున్నాడు .ఇక మళ్లీ కలవము ..ఇంతే ఇక ..ఈ మాత్రందానికి ఎందుకు మళ్ళీ కలిపాడు దేవుడు ..ట్రైన్ కదులుతున్న  శబ్దం ....వెళ్ళిపోతుంది ట్రైన్  .... తప్పు చేసానా? మనసులో మాట చెప్పకుండా తప్పు చేసానా ? లాస్ట్ వరకూ తనే చెప్తాడని ఎదురు చూస్తూ తప్పు చేసానా? ఒక వేళ చెప్పి మళ్ళీ ఇష్టం లేదని అనిపించుకుంటే తట్టుకోగాలిగేదాన్నా? చెప్పకుండా మాత్రం ఉద్దరించింది ఏముంది .మళ్ళీ ఎన్నాళ్ళు మధనపడాలో.. ఎందుకురా నా జీవితంలోకి వచ్చావ్? నేనేం తప్పు చేసాను?ఎందుకిలా జరుగుతుంది నాకే   నడుస్తున్న కొద్ది ఏదో నీరసం.. కాళ్ళల్లో సత్తువ లేనట్లు పడిపోతానేమో అనిపిస్తుంది . 

ఇంకా నన్ను చూస్తున్నాడా?చూస్తే గనుక  ఇంకొక్క చాన్సే ఉంది .వెనక్కి పరిగెత్తి అతనికి చెప్పేస్తే? చెప్పేయి పావని ఆలోచించే టైం లేదు, ఎవరో హెచ్చరిస్తున్నట్లు."వేణూ" అరుస్తూ వెనక్కి త్రిగాను ...ట్రైన్ ఎప్పుడో ఫ్లాట్ ఫాం దాటేసింది .అయినా పిచ్చిదానిలా పెరిగేట్టాను ట్రైన్ కోసం  .కళ్ళు తిరుగుతున్నాయి ఎవరినో బలం గా గుద్దాను.పడిపోయానా? లేదు ఎవరి చేతుల్లోనో పదిలంగా.మెల్లగా ఈ లోకంలో .ఎదురుగా వేణు.కలా ?నిజమా?"పావనీ " ఆదుర్ధాగా నా మొహంవంకే చూస్తూ కుదుపుతున్నాడు. 


నేను చూడగానే ...నా కళ్ళలోకి చూస్తూ  "పావనీ నువ్వంటే ప్రాణం నాకు .ఆ పెళ్లి వద్దని చెప్పెయవా !ప్లీజ్ రా  నువ్వులేకపోతే నేను ఉండలేను. పెళ్లి చూపులకు ముందే నువ్వు నాకే సొంతం అనేసుకున్నా. మీరు వేరే సంబంధం కుదుర్చుకున్నారని చెప్పినపుడు ఎంత ఏడ్చానో తెలుసా.నా పావని ఇంకెవరికో సొంతం అయిపోతుంది అంటే తట్టుకోలేకపోయాను .ఇక నావల్లకాదురా బంగారం.ఇది తప్పయినా సరే .ఆ పెళ్లి వద్దని చెప్పెసేయి " .నేను ఇన్నాళ్ళు పడ్డ వేదన అంత తన మాటల్లో  ....నా మనసును కాపీ కొట్టేసినట్లు అచ్చంగా అలాగే . ..తను ఇంకా ఏదో చెప్తున్నాడు  . నేను అడ్డు చెప్పలేదు వింటూనే  ఉన్నాను  మరింత దగ్గరకు చేరి  అతని యదసవ్వడి తో పాటుగా ... మెల్లగా నా తల ఎత్తి "ఇదేమిటి కన్నులో గోదావరా" అన్నాడు కన్నీరు తుడుస్తూ నవ్వుతూ.తన మాటలకు నవ్వుతూ అవును "ఆనంద గోదావరి" అన్నాను  .

Wednesday, 2 March 2011

మొదటి కధ (పెళ్లి చూపులు రెండో భాగం )

 అతని మొహం అలా చూస్తున్న కొద్ది  బాధ,కోపం,ఆశ్చర్యం  కలగలిపి వస్తున్నాయి.నన్ను అంత బాధ పెట్టి ప్రశాంతంగా ఏమీ తెలియనట్లు ఎలా పడుకున్నాడు ?కొంచెం కూడా గిల్టీ  ఫీలింగ్ లేదా? లేదా గుర్తుపట్టనట్లు నటిస్తున్నాడా ?ఛా  ఇలాంటి వ్యక్తి గురించా ఇన్ని రోజులూ ఆలోచించింది??? .. ఉక్రోషంగా చూస్తుంటే హఠాత్తుగా కళ్ళు తెరిచాడు .నేను తత్తర పడి గబుక్కున బేగ్ లో పుస్తకం తీసి అందులో తలదూర్చాను.అయ్యయ్యో నాకస్సలు  బుద్ధి లేదు .. ఎందుకలా చూసాను?ఏమనుకున్నాడో ?ఒక ప్రక్క నాలుక తడి ఆరిపోయి దాహం .మంచి నీళ్ళు బాటిల్ కొనలేదు ఇందాక హడావుడిలో . ఎందుకో అనుమానం వచ్చి ఓరగా తన వైపు చూసాను . నా చేతిలో పుస్తకం వైపే సంబ్రమంగా చూస్తున్నాడు. 


వంశీ మా పసలపూడి  కధలు .పెళ్లి చూపుల రోజున మా ఇద్దరి మధ్య జరిగిన మొదటి సంభాషణ పుస్తకాల గురించే ."మీరు మా పసలపూడి   కధలు చదివారా?" అన్నపుడు లేదని బదులిచ్చాను .చాలా బాగుంటాయి .ముఖ్యంగా పల్లె వాతావరణం..ప్రకృతివర్ణన  ,అమాయక ప్రజల మనస్థత్వాలు ...అవి  చదువుతున్నపుడు వెన్నెల్లో గోదావరి ఒడ్డున కూర్చున్నంత హాయిగా అనిపిస్తుంది  .ప్రతి కధ ఒక రకమైన అనుభూతిని సొంతం చేస్తుంది ." ఆ మాటలు చెపుతున్నపుడు  నా చేతకూడా చదివించాలన్న  ఆరాటం కనిపించి భలే నవ్వొచ్చింది  .నిజానికి నాకు ఈ కధలు అవి చదవడం అంత ఇంటరెస్ట్  ఉండదు.ఎప్పుడన్నా కాలక్షేపానికి తప్పా.మొన్న ఏదో పని మీద బుక్ స్టాల్ కి వెళ్ళినపుడు ఆ మాటలు గుర్తు వచ్చి ఈ పుస్తకం కొన్నాను  .ఇప్పుడు ఇది చూసి ఏమనుకున్నాడో ఏమో ఖర్మ ..విసుగ్గా బుక్ బేగ్ లో పెట్టేసాను.

ట్రైన్ ఏదో స్టాప్ లో ఆగింది . దాహం రెండింతలు అయ్యింది .కిటికీ నుండి బయటకు చూసాను .ప్లాట్ ఫాం మీద ఎవరూ లేరు .ఏడుపొస్తుంది . టీ,కాఫీ అంటూ ఒక అబ్బాయి కాస్త దూరం లో .."హే బాబు" పిలిచాను. పరిగెత్తుకుని వచ్చాడు నా పిలుపు విని .టీ మేడం కాఫీ అన్నాడు ప్లాస్టిక్  గ్లాస్ పట్టుకుని."అహా ..మంచి నీళ్ళ బాటిల్ ఏమన్నా దొరుకుతుందా???"అన్నాను  .ఆ అబ్బాయి విసుగ్గా ఒక చూపు చూసి ఇక్కడ దొరకవు అని ముందుకి వెళ్ళిపోయాడు .కాస్త  దూరంగా మంచి నీళ్ళ కుళాయి .కాని దిగాలంటే భయం ట్రైన్ కదిలిపోతుందేమో అని.అయినా తప్పదు లేచాను ..ట్రైన్ మెల్లగా బయలుదేరింది .చేసేది లేక నా సీట్లోనే కూలబడ్డాను నీరసంగా  . ఆ అబ్బాయి ఏమనుకున్నాడో ..తన బేగ్ నుండి మంచి నీళ్ళ బాటిల్ తీసి తీసుకోండి అన్నాడు .అదనుకోసం చూస్తున్న నా కోపం "నాకొద్దు " అంటూ  విసురుగా బయటకు వచ్చింది."నెక్స్ట్ స్టాప్ లో కూడా దొరకవు " అతని మాటలు బెదిరిస్తున్నట్లుగా అనిపించి మొహం తిప్పుకున్నాను సీరియస్సుగా.

అసలెలా మాట్లాడుతున్నాడు సిగ్గులేకుండా .నాకెందుకో చాలా కోపం వచ్చేస్తుంది  .. .అతను తప్పు చేసి కూడా పశ్చాత్తాపం పడిన ఫీలింగ్స్ ఏమి లేకుండా అలా మామూలుగా ఉండటం    అసలు నచ్చడం లేదు .మనసు మళ్ళించడానికి కనీసం పుస్తకం చదవడానికి కూడా లేదు .కిటికీ నుండి బయటకు విసుగ్గా చూస్తూ కూర్చున్నాను.

కాసేపటికి తను బాత్రూం కి అనుకుంటా అక్కడి నుండి లేచి వెళ్ళాడు .ఎదురుగా మంచినీళ్ళ బాటిల్ .చూస్తున్న కొద్దీ దాహం పెరుగిపోతుంది .తాగితే ? అతను లేడు కదా? కళ్ళ ముందు గభ గభా వాటర్ తాగేసినట్లు  పిచ్చి ఊహలు .ఉహుహు  చూపు త్రిప్పుకుని బింకంగా  కూర్చున్నాను  .మళ్ళీ నెక్స్ట్ స్టాప్ . అతను అన్నట్లు ఎవరూ లేరు .కనీసం మంచినీళ్ళ పంపు కూడా కనిపించడం లేదు.ఏం చెయ్యాలి ? అతనికి నా అవస్థ అర్ధం అయినట్లుంది .ప్లీజ్ తీసుకోండి అని  మళ్ళీ నాకు బాటిల్ అందించాడు . " వద్దని చెపుతున్నానుగా "ఈ సారి కొంచెం కోపంగా  అరిచాను . ఎదురు సీట్ల వాళ్ళు ఇద్దరు ముగ్గురు మా వైపు చూసారు .

ఆడపిల్ల కనిపిస్తే చాలు వెధవలకి  ఒళ్ళు తెలియదు .ఇందాక నుండి గమనిస్తున్నా తెగ ఇబ్బంది పెడుతున్నాడు ఆ పిల్లను ఎవరో కొద్దిగా గట్టిగానే అన్నారు.ఇంకో ఇద్దరు ఇలాంటివే  ఇంకేవో సంఘటనలు నెమరువేస్తున్నారు సమయం దొరికిందని . అతను చిన్నబుచ్చుకున్నట్లు ఉన్నాడు బాటిల్ పట్టుకున్న చేతిని వెనక్కు తీసుకున్నాడు .నాకు బాధ అనిపించింది.అందరి దృష్టిలో చులకన చేసేసాను. వాళ్ళ మాటలు ఎలా ఆపాలో అర్ధం కాలేదు."మంచి నీళ్ళు" అంటూ  తన చేతిలో బాటిల్ తీసుకుని గడ గడా సగం  బాటిల్ తాగేశాను.చల్లగా ఉన్నాయేమో  ప్రాణం లేచివచ్చినట్లు అయ్యింది .దాహంతో పాటు ఎదుటివాళ్ళ మాటలు ఆగిపోయాయి.

సారీ ..ధేంక్స్  అన్నాను ...ఏది ముందు ఏది తరువాత చెప్పాలో తెలియకా   తికమక పడుతూ .అతను చిన్నగా నవ్వాడు.మళ్లీ కాసేపటి వరకూ మౌనం .ఇందాక ఉన్న కోపం కాస్త తగ్గినట్లు అనిపించింది నాకు .అలా ఏదో కోల్పోయినట్లు ఇద్దరం నిశ్శబ్దంగా ఉండటం అంతగా నచ్చలేదు .ఏదైనా మాట్లాడితే బాగుండును అప్పటికి ఎన్ని సార్లు అనుకున్నానో.అతని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి సగం. మెల్లిగా చీకట్లు ముసురుతున్నాయి .ఇక నావల్ల కాలేదు. మీరేంటి ఇక్కడా ? ఏదైనా పని మీద వచ్చారా అన్నాను  మెల్లగా . "ఫ్రెండ్ పెళ్లి "అన్నాడు పొడిగా .కాని నా పలకరింపుతో అతని కళ్ళల్లో మెదలిన సంతోషం నా చూపు దాటిపోలేదు..మరి మీ భార్యను తీసుకు.. ?? సగంలోనే నా మాటలు ఆపేసాను.అనేసాకాగాని ఎందుకలా అడిగానా అని తిట్టుకున్నా . వద్దు వద్దు అని ఎంత వారించినా అతని భార్య గురించి తెలుసుకోవాలన్న ఆరాటం నిలువనివ్వలేదు...

అతను  నావైపు ఒక సారి చూసి నాకింకా పెళ్ళికాలేదు అన్నాడు చేతి గోళ్ళు చూసుకుంటూ .కొద్దిగా అదో మాదిరి సంతోషం .అంతలోనే సందిగ్ధం .మరి ఆ రోజు వేరే పెళ్లి కుదిరిపోయింది అని ఎందుకు చెప్పారు? ఏదో రకంగా నా సంబంధం వదుల్చుకోవాలనా? లేక  కుదుర్చుకుని పెళ్లి వాయిదా వేసుకున్నారా? మళ్ళీ ఉక్రోషం .

 "మరి మీరేంటి ఇక్కడ ? "ఈసారి తన నుండి ప్రశ్న ." ఇక్కడ జాబ్ చేస్తున్నా.పెళ్లి కుదిరింది .తను NRI   .ఈ వారం లో తాంబూలాలు. సగం నిజం సగం అబద్దం. " ఎందుకలా చెప్పాను ??? ఏదో ఒక రక మయిన కసి.నువ్వు కాకపొతే నీకంటే గొప్పవాళ్ళు నాకు రారనుకున్నావా అని చెప్పాలన్న తాపత్రయం. అంతలోనే నా ప్రవర్తనకు నా పైనే సిగ్గు .  ఏమైంది ఈ రోజు??.దేవుడా ప్లీజ్ ఈ అబ్బాయి నెక్స్ట్ స్టాప్‌లో దిగిపోయేలా చూడు ప్లీజ్ దిగాలుగా అనుకున్నాను . 
(ఇంకా ఉంది)

Tuesday, 1 March 2011

నా మొదటి కధ(పెళ్లి చూపులు )

పరుగులు పెట్టి వచ్చానేమో ఆయాసం తో కొద్దిగా వగర్పు వస్తుంది.లాస్ట్ మినిట్‌లో టికెట్ బుక్ చేయడం వల్ల RAC దొరికింది లేకపోతే అదీ లేదు .అసలు అమ్మను అనాలి. ఇప్పటికిప్పుడు వచ్చేయ్ అని ఆర్డర్ వేసేస్తే దొరికేయడానికి అవేమన్నా ట్రైన్ టిక్కెట్లా ?షాప్ లో చాక్లెట్లా? ఇంకా నయం ట్రైన్ వెళ్ళిపోలేదు .పైగా ఈ దాహం ఒకటి..

 మంచి నీళ్ళ బాటిల్ కోసం అటు ఇటు చూస్తూ ఉన్న నా చూపులు ఎదురుగా నా వైపే రెప్ప ఆర్పకుండా చూస్తున్న అబ్బాయి మీద నిలిచిపోయాయి..   "వేణు" అప్రయత్నంగా నా నోటినుండి అతని పేరు బయటకు వచ్చింది."అతనేనా? అతనేంటి  ఇక్కడ? "  అతనూ నన్నే గమనిస్తున్నాడన్న విషయం గ్రహించి చూపు తిప్పుకునేలోపు ట్రైన్ ప్లాట్‌ఫాం దగ్గరకు వచ్చి నిలుచుంది .జనాలు పరుగులు పెట్టి ఎక్కుతున్నారు .నేనూ వాళ్ళతో పాటే ఎక్కి నా సీట్ నెంబర్ చూసుకుని కూర్చున్నాను.కాని మనసు మనసులో లేదు.

వేణూ యే కదా తను ?గుర్తు పట్టాడా నన్ను ? మర్చిపోయాడా? ఒకటా రెండా దాదాపు 8 నెలలు పైనే అయ్యింది.అతను ఇంకా  అక్కడే ఉన్నాడా ?వెళ్ళిపోయాడా?ఈ పాటికి పెళ్ళయిపోయి ఉంటుంది .మరి తన భార్య ?ఇందాక సరిగ్గా గమనించలేదు అతని ప్రక్కన ఎవరైనా ఉన్నారో లేదో ?. ఒక్కసారి చూస్తే? మనసు వద్దని వారిస్తున్నా కిటికీ నుండి మెల్లగా బయటకు తొంగి చూసాను .

ఎవరూ లేరు.కొద్దిగా నిరాశ.ఇక్కడికెందుకు వచ్చాడు ?బహుసా అత్తగారి ఊరేమో?కొంపదీసి ఇదే ట్రైన్ ఎక్కడం లేదు కదా?  అంతంలేని ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎక్స్యూజ్ మీ అన్న మాటలకు ఇటు తిరిగిన నేను ,అతను ఒక్కసారిగా షాక్ తిన్నాం. "వేణు" నా కళ్ళెదురుగా .... అదీ నా సీట్ నే షేర్ చేసుకుంటూ.. భగవంతుడా ఎందుకు నాకీ పరిక్షా .ఇప్పుడు ఇతనితో ఈ రాత్రంతా జర్నీ చేయాలి.ఇంతకన్నా ఇబ్బంది కరమైన సన్నివేశం ఎవరికన్నా ఎదురవుతుందా?అసలిదంతా నిజమేనా?  సర్ధుకుని కూర్చుని మొహం కిటికీ వైపుకు త్రిప్పుకుని గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాను.అంతా చేస్తే అతనితో నా పరిచయం పదిహేను నిమిషాలే కాని ప్రతి నిమిషం తనే నేనైపోయాను.రైలుతో పోటీ పడుతూ  నా ఆలోచనలు గతంలోకి పరుగులు పెట్టాయి .

మొదటి సారి తన ఫోటో చూడగానే నచ్చేయడం వల్లనో, చుట్టాలు బందువులు అతని గుణగణాల గురించి తెలిసింది తెలియనిది వర్ణించి చెప్పడం వల్లనో ,ముఖ్యం గా పెళ్ళిళ్ళ పేరయ్య గణపతి గారు అబ్బాయికి అమ్మాయి తెగ నచ్చేసింది ,పెళ్లి చూపులేం వద్దు ఏకంగా పెళ్ళే పెట్టేస్తే బాగుంటుంది అని అన్నాడని ఊరించడం వల్లో ఏమో కారణాలు ఏమైనా గాని అతనంటే తెలియని ఇష్టం వచ్చేసింది .నాన్న లేకపోవడం వల్ల,కోరి చేసుకుంటే నేను సుఖంగా ఉంటా అని అమ్మ కూడా చాలా ఆశలు పెట్టుకుంది ఆ సంబంధం పై..

పెళ్లి చూపులు నామ మాత్రమే..... అబ్బాయికి లీవ్ దొరకగానే వచ్చి చూసుకోవడం ,కుదిరితే ఆ వారంలోనే తాంబూలాలు ,ఆ పైన పెళ్లి  అని నాలో లేని ఆశలు  రేపేసారు.దాంతో పెళ్లి చూపులకు ముందే అతను నావాడు అన్న ఫీలింగ్ బలంగా ఏర్పడిపోయింది .అందుకేనేమో పెళ్లి చూపుల్లో ఆ పదిహేను నిమిషాలు నాకేం క్రొత్తగా అనిపించలేదు .ముందు కాసింత సిగ్గు పడినా ఆ తరువాత చాలా ఫ్రీ అయిపోయాను.తను మాత్రం తక్కువా ? ఆ కొద్ది సేపూ నన్ను ఎంతో అపురూపంగా చూసాడు .మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి అని ఆక్చర్యపోయాం .తన మాటల బట్టే అర్ధం అయిపొయింది నేను తనకు చాలా నచ్చేసానని.వెళ్ళే ముందు తను అన్నమాటలే అందుకు సాక్ష్యం ."పావనీ... ఒకే అభిప్రాయాలు కలసిన వ్యక్తులు పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది .ఆ అరుదైన అవకాసం నాకు దొరికినందుకు చాలా చాలా హేపీగా ఉంది."
ఆ తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు .


ఒక రోజు ..రెండు రోజులు ...నాలుగు  రోజులు..నేను ఊహల్లో తప్ప  నేలపై నడవడం మానేసాను కానీ  అటునుండి సమాధానం రాలేదు .ఐదో రోజున గణపతిగారు చెప్పారు వాళ్లకు అమ్మాయి నచ్చలేదంట .మరుసటి రోజే వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు అని. ఒక్కసారిగా ఎవరో అగాధం లోనికి తోసేసినట్లు అయింది . 

 నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? మరెందుకు అలా మాట్లాడాడు? ఏవేవో జవాబులేని ప్రశ్నలు . అమ్మకు కూడా చాలా బాధ కలిగింది అనుకుంటా .కట్నం నచ్చక పొతే నచ్చలేదని చెప్పాలి ఆస్తులు నచ్చక పొతే ఆస్తి నచ్చలేదని చెప్పాలి అంతేగాని పిల్ల అందానికి లోపం పెడతారా ?వాళ్ళు మనుషులేనటండి తన ఆక్రోశం అంతా గణపతిగారి ముందు చెప్పుకుని తీర్చుకుంటుంది .కాని నా బాధ ఎవరు పట్టించుకుంటారు? ఇంతేనా పెళ్లి చూపులంటే ? ఒక్క మాటలో అయిపోయిందా? ఆ అబ్బాయికి ఏమీ అనిపించలేదా? ఇంకో అమ్మాయిని చూసుకుని ఖాయం చేసేసుకున్నారా?నేను గుర్తు రాలేదా?ఒక్క క్షణం కూడా? కోపం ,ఉక్రోషం,బాధ ,అవమానం ..మనసంతా పిండేసినట్లు అనిపించింది ..

బాత్రూం లోకి వెళ్లి ఎవరూ చూడకుండా వెక్కి వెక్కి ఏడ్చాను .ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు.తప్పు నాది .ఇదొక వ్యాపారం లాంటిది .మంచి వస్తువు కొనేటప్పుడు ఎలా ఆలోచించి ఎంపిక చేసుకుంటామో  అలాగే ఇదీ కూడా .అయినా ఎందుకని పిచ్చి మనసు ఒప్పుకోదు.ప్రపంచం లో అందరూ నాలాగే బాధ పడతారా? లేక నేనే ఇలా ఆలోచిస్తున్నానా? నాతో అలా మాట్లాడి కూడా ఇంకో అమ్మాయిని ఎలా చూడబుద్దేసింది ? ఇలాంటి విషయాలు ఎవరితోనూ పంచుకోలేము . ఒక వేళ చెప్పినా నవ్వేసి తీసిపడేస్తారు తప్ప అర్ధం చేసుకోరు .ఆ బాధ  నుండి తేరుకోవడానికి  నాకు వారం పైనే పట్టింది .అలా అనుకుని మభ్య పెట్టుకున్నానేగాని అతనిని మనస్పూర్తిగా మర్చిపోలేదు .ఏదో ఒక విషయం లో ఏదో రూపం లో గుర్తుకొస్తూనే ఉన్నాడు .మొదటి ప్రేమ మర్చిపోలేము అంటే ఇదేనేమో .

ఆ తరువాత రెండుసార్లు పెళ్లి చూపులు జరిగాయి. నాకు అసలు పెళ్లి మీదే విరక్తి వచ్చేసింది .అమ్మ కోసం ఒప్పుకోక తప్పలేదు.ఏదో కారణం వల్ల అవి కుదరలేదు .నాకు ఏమీ అనిపించనూ లేదు. అనుకోకుండా ఈ ఊళ్ళో జాబ్ రావడం .నాలుగు నెలలుగా ఇంటికి దూరం అయ్యాను .ఉన్నట్లు ఉండి అమ్మ ఫోన్ ...ఎవరో అబ్బాయి చూసుకోవడానికి వస్తున్నాడట.నేను బాగా నచ్చేసానట . వెంటనే వస్తావా చస్తావా  అని బెదిరింపులు .బయలుదేరక తప్పలేదు .

మెల్లగా తల త్రిప్పి అతని వైపు చూసాను .కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నాడు .కిటికీ నుండి వస్తున్న గాలికి జుట్టు మొహం పై పడుతూ  అదోరకమైన అందం .ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉంటుంది .భార్య రాలేదు ఎందుకనో ? అందంగా ఉంటుందా ఆమె ? నాకంటేనా? ఎక్కడో ఉక్రోషం .ఆ అమ్మాయి అస్సలు బాగో కూడదని .ఛీ ఈ మనసుకు బుద్దిలేదు .అతనెలాపోతే నాకేం ? ఇప్పుడు అతనెవరో నేనెవరో ?
(ఇంకా ఉంది )

Sunday, 27 February 2011

నీ ప్రేమే గొప్పది

నువ్వు అబద్దం చెప్పే ప్రతిసారి నిజమని  నమ్ముతాను
నే నిజం చెప్పే ప్రతిసారి నువ్వు అపనమ్మకంగా చూస్తావు 

అయినా నీ ప్రేమే గొప్పది

నీ ప్రేమ నాలో నమ్మకాన్ని పెంచితే
నా ప్రేమ నీ లోని అపనమ్మకాన్ని త్రుంచలేకపోతుంది .
  

Saturday, 26 February 2011

ఆ రోజు

హఠాత్తుగా మెలుకువ వచ్చింది.కిటికీ నుండి బయటకు చూసాను.చీకట్లు అప్పుడే తొలగుతున్నాయి.కంగారుగా  టైం చూసాను .పావుతక్కువ ఆరు.ఒక్కసారిగా నిద్ర మత్తు విడిపోయింది . ఈ రోజు ప్రొద్దున్న 7.30 కు ఫ్రెండ్ పెళ్ళి . వెళ్ళడానికే అరగంట పైనే  పడుతుంది .
అంత మొద్దు నిద్రకు తిట్టుకుంటూ బ్రెష్ తీసుకుని పరుగులు పెట్టాను .అమ్మ పంపు దగ్గర నీళ్ళు పడుతుంది . బ్రెష్ చేస్తున్న నన్ను విచిత్రంగా చూసింది.చూడదూ మరి! ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనిమిదికి ముందు ఏ రోజూ నాకు తెల్లారదు .రెండే నిమిషాల్లో ముగించి స్నానానికి బాత్ రూం లో దూరాను.చలిగాలిలో చల్ల నీళ్ళేంటీ అమ్మ తిట్లు వినబడుతున్నాయి.నాకూ ఏడుపొస్తుంది కాని టైం లేదే ?దేవుడా దేవుడా అనుకుంటూ ముగించి అంతకు ముందు ఐరెన్ చేయించి పెట్టుకున్న చీర తీసాను .
ఇప్పుడు అదెందుకూ ????అమ్మ ప్రశ్నలు మళ్ళీ మొదలు. ఎన్ని సార్లు చెప్పినా అదే పాట పాడుతుంది.ఎక్కడికీ పంపదు.సమాధానం చెప్పకుండానే తయారయిపోయాను అయిదు నిమిషాల్లో .గభ గభా చెప్పుల స్టాండ్  దగ్గరకు వెళుతూ అమ్మా వెళ్ళొస్తా అన్నాను.ఎన్ని సార్లు అడిగినా సమాధానం చెప్పవేంటీ ఎక్కడికీ ???అమ్మ రెట్టించింది.
ఎన్ని సార్లు చెప్పాలి ఫ్రెండ్ పెళ్ళి అని.మొన్నటి నుండి చెప్తునే ఉన్నానుగా లేట్ అయిన కోపం అమ్మ మీద చూపిస్తూ అరిచాను.రేపన్నావు ?అమ్మ అనుమానంగా చూసింది.ష్ దేవుడా గొణుక్కుని ఈ రోజే అమ్మా అన్నాను విసుగ్గా .ప్రొద్దున్న అన్నావ్ అమ్మ మళ్ళీ అడిగింది . అవును ప్రొద్దున్నే .సమయం ఏడుగంటల ముప్పై నిమిషాలకి ఇంకో అరగంట ఇలాగే ప్రశ్నలు వేస్తే పెళ్ళి అయిపోతుంది అన్నాను కోపం గా .
అప్పటికి అమ్మకు విషయం అర్ధం అయింది .ఇప్పుడు టైమెంతో తెలుసా అంది నవ్వుతూ .ఆరున్నర అన్నాను .అవును ఆరున్నరే కాని పగలు కాదు రాత్రి .నువ్వు మధ్యహ్నం నిద్ర చేసావ్ అంది .
ఈ రోజు ఆ ఫ్రెండ్ పెళ్ళిరోజు .పాత విషయాలు తవ్వుకున్నాం . 

Friday, 25 February 2011

పోకిరీ మగవాళ్ళు

మొదటి సారి  సినిమాహాలు దగ్గర నన్ను చూసి నవ్వినపుడు  పరాకులో పట్టించుకోలేదు 

మొన్న బస్ లో  నే దిగే స్టాపువరకూ  వెంటపడి వచ్చినపుడు  చిరాకుగా చూసాను

నిన్న గుడిలో నా వెనుకనే  ప్రదక్షిణాలు చేసినపుడు అక్క చెల్లెళ్ళు లేరా నీకని  గొణుక్కున్నా

 ఈ రోజు ఇంకా రాలేదెందుకనో  ???ఉఫ్.. .....ఓ పద్దతి పాడు తెలియని పోకిరీ మగవాళ్ళు

నిద్రొచ్చేస్తుంది ప్రియా నీ సమక్షం లో

నీ ఒడే ఊయలగా
నీ ఊపిరి వింజామరగా
యద సవ్వడి జోల పాటగా
బిగి కౌగిలి నులి వెచ్చగా
నీ ప్రేమ లో నిచ్చింతగా
నిద్రొచ్చేస్తుంది    ప్రియా నీ సమక్షం లో

Thursday, 24 February 2011

పత్ర విలాపం

ఆకలేసే వేళ అరటి ఆకును
తాంబూల సేవనలో తమలపాకును

ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూరను
మండుటెండను మరిపించే విసనకర్రను

పూజ చేయి వేళ బిల్వ ఆకును
పూజలందుకునే వేళ తులసి ఆకును

తలదాచుకోనేందుకు తాటి ఆకును
పవళించే వేళ   కొబ్బరాకును

ఔషధాలలో పనికొచ్చే వేప ఆకును
పరిమళానికి సాటి లేని మరువపాకును

పండగ కళ  తెచ్చే మామిడాకును
పండిన చేతులకు గోరింటాకును

రంగులో ,రూపం లో ,సొగసులో,హొయలు లో
నా వెనుక పుట్టిన పూబాలల   కన్నా
ఎందులో తక్కువ? నేనే కదా మిన్న?

ఇంతులకు   నేనంటే ఎందుకంత   చిన్న చూపు 
పుష్పాల పై నేమో తరగని వింత కైపు

Wednesday, 23 February 2011

ఎలా నమ్మేది ?

"నాకు చదువంటే చాలా ఇష్టం అండి,బాగా చదువుతాను కూడా .కానీ కానీ నా పేదరికం నాకో  శాపం"  అతను అటు తిరిగాడు  కళ్ళ లో నీరు కనబడకుండా . మా క్లాస్ రూం లో సూది వేస్తే వినిబడేఅంత నిశ్శబ్దం.అందరం జాలిగా చూసాం. ఈ సంవత్సరం తో చదువు పూర్తి అవుతుంది.అన్ని దానాల లో కంటే విధ్యా  దానం గొప్పది  మీరు పెద్ద మనసు చేసుకుంటే!!!! అతను అడగడానికి సిగ్గు పడుతూ ఆగాడు.మాట పూర్తి కాక మునుపే అందరం అపర దాన కర్ణికల్లా  విరివిగా దానం చేసాము.

ఆ తరువాత మూడేళ్ళ తరువాత ఫ్రెండ్ చెల్లెను కలవడానికని వెళ్లి తన క్లాస్ రూం లోనే వెనుక బెంచ్‌లో కూర్చుంటే అదే వ్యక్తి   చెప్పడం మొదలుపెట్టాడు.
"నాకు చదువంటే చాలా ఇష్టం అండి,బాగా చదువుతాను కూడా .కానీ కానీ నా పేదరికం నాకో  శాపం"  అతను అటు తిరిగాడు  కళ్ళ లో నీరు కనబడకుండా . ఆ  క్లాస్ రూం లో సూది వేస్తే వినిబడేఅంత నిశ్శబ్దం.అందరూ  జాలిగా చూసారు . ఈ సంవత్సరం తో చదువు పూర్తి అవుతుంది.అన్ని దానాల లో కంటే విధ్యా  దానం గొప్పది  మీరు పెద్ద మనసు చేసుకుంటే!!!! అతను అడగడానికి సిగ్గు పడుతూ ఆగాడు.

అప్పట్లో అతను వెళ్ళిపోగానే రెండు రోజులు తీవ్రంగా బాధ పడ్డాను ,పాపం ఇలాంటి వాళ్ళను దేవుడు ఎందుకు కష్టపెడతాడు ?అని .ఇలా మోసం చేస్తున్నాడు అని తెలియగానే బాధగా  అనిపించింది .

ఆ తరువాతోసారి గుడి దగ్గర ఒక ఆమె పెద్దగా ఏడుస్తుంది. ఎవరో బస్ లో మత్తు కలిపిన ఫ్రూటి ఇచ్చి  ఆమె పర్స్,బేగ్,చేతి గాజులు  దొంగిలించారట .ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు .ఆకలేస్తుంది సహాయం చేయండి అని అర్ధిస్తుంది.అందరూ వింటున్నారుగాని ఎవరూ సహాయానికి ముందుకు రావడం లేదు.నాకూ అర్జెంట్  పని ఉంది .అందులోనూ ఇలాంటి వారు నిజమో అబద్దమో తెలియదు . సహాయం చేయగలిగే శక్తి ఉండి కూడా ఏదైనా తినమని పది రూపాయలు చేతిలో పెట్టి వచ్చేసాను. అప్పటి నుండి ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్లినపుడల్లా  ఆమె గుర్తు వస్తుంది.ఒకవేళ ఆమె చెప్పేది నిజమైతే ?? ఎంత ఘోరమైన పరిస్థితిలో ఆమెను వదిలేసాను అనిపిస్తుంది ..

ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులు .  

Tuesday, 22 February 2011

ఈ రోజంతా నీ ఆలోచనలే .......

ఈ రోజంతా  నీ ఆలోచనలే ...

అప్పట్లో నీ సానిహిత్యంలో ఎంతటి ఆనందాన్ని చవిచూసేదాన్నో.ఒక్కోసారి నీ ఒడిలో నేను, మరోసారి నా ఒడిలో నీవు .ఎంత అపురూపమైన రోజులవి ?

ఎంతసేపూ నీ చెంతనే ఉండాలని తెగ ఆరాటపడేదాన్ని.నీనుండి వచ్చే గమ్మత్తైన పరిమళాన్ని ఆస్వాదించాలనుకునేదాన్ని .నువ్వు నాకే సొంతం అనుకునేదాన్ని..ఇంకెవరన్నా నీ గురించి మాట్లాడినా ,నిను తాకినా ఒప్పుకునేదాన్నే కాదు. నా స్నేహితులు ఎంత కుళ్ళుకునేవారు అనుకున్నావ్ నిన్ను చూసి.చాలా గర్వంగా ఉండేదిలే .

కాని ఈ పెద్దోళ్ళు ఉన్నారే దేనికీ ఒప్పుకోరు .అన్నీ ఆంక్షలే . ముఖ్యంగా అమ్మ.మనల్ని విడదీయడానికి శతవిధాలా ప్రయత్నించేది తెలుసా? పగలు నీ దగ్గరకొస్తాను అంటే పని పాటాలేదా క్రొత్త బిక్షగాడు పొద్దు ఎరగడని ఎప్పుడూ అక్కడికే  వెళతానంటావు అని కసిరేది.

పోని మధ్యాహ్నం ఒప్పుకుంటుందా అంటే మరీ తిట్టేది.ఎండాకొండా ఏమీ చూసుకోవా ?నాన్నకు చెప్తాను అని బెదిరించేది.ఇక రాత్రి ,....చీకటి పడింది ఒంటరిగా వద్దు .ఆడపిల్లలు చెప్పిన మాట వినాలి అని గదమాయించేది.

ఇవన్నీ నీకేం తెలుసూ?అందరిని తప్పించుకుని నేను రాగానే చల్లగా నవ్వడం తప్ప.ఒక్కసారైనా నీ కోసం పడే ఆరాటం గమనించావా? ఒక్క రోజన్నా నన్ను తల్చుకున్నావా?' పో' నీతో ఇక మాట్లాడనే మాట్లాడను.

కోపం వచ్చిందా ? నీకు చాలా దూరంగా ఉన్నాను అనే బాధ .అంతే గాని నిన్ను తప్పు పట్టాలని కాదు.నిన్న అమ్మ చెప్పింది నువ్వు ఈ మధ్య చాలా దిగాలుగా ఉంటున్నావంట ?మునుపటిలా లేవంట. ఇదంతా బెంగే ?నా మీదే కదూ?

మళ్ళీ నీ చెంతకు వస్తానుగా ,ఈ సారి ఎవరు చెప్పినా వినను .నీతోనే,నిన్ను చూస్తూ ,నీతో కబుర్లు చెపుతూ నీ దగ్గరే  ఉంటాను .అప్పుడు అలా దిగాలుగా ఉండకూడదు మరి . మునుపటిలా నవ్వుతూ,పచ్చగా ,విరబూసిన మల్లె పూలతో పందిరి అంతా అల్లుకుపోయి  పెరట్లో కళ కళ లాడుతూ ఉండాలి.

ఎవరు కరెక్ట్ ?

ఒకసారి ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్లాను.అరగంట చూసాకా నాకో డ్రెస్ నచ్చింది పేక్ చేయించుకుని బిల్లు కట్టేసి వచ్చాను.తనది ఇంకా సెలెక్షన్ అవ్వలేదు.మరో పావుగంటకు సేల్స్ గర్లుకు విసుగొచ్చినట్లు ఉంది.అన్నీ అవే కలర్లు అండి .క్రొత్తవేమీ లేవు అనేసింది.  ఇంకో గంటకు షాప్ మొత్తం తిరగేసి మరగేసి మొత్తానికి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసింది .

బిల్లు కట్టే సమయానికి తన చూపులు షోకేస్ లో ఒక మూలకున్న డ్రెస్ మీద పడింది .బిల్ ఆపు చేసి ఆ డ్రెస్సులు తీయించింది.షాపువాడు ,సేల్స్ గళ్  కాస్త విస్క్కున్నారు .అరగంటకు ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది .నాకు షాపువాడి చిరాకుకు ఇబ్బందిగా అనిపించింది.కాని డ్రెస్ బాగుంది .

మళ్ళీ బిల్లు కట్టే సమయానికి ప్రక్కన మరొక ఆమె సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ మీద పడ్డాయి ఫ్రెండ్  చూపులు .బిల్లు ఆపి అటువంటి డ్రేస్స్లు ఉన్న చోటికి వెళ్లి అక్కడో పావుగంట చేసి ఒకటి సెలెక్ట్ చేసుకుంది .కొనే బెరమేనా షాపు వాడు మొహం మీద అన్నాడు.నాకు సిగ్గుతో తల కొట్టినట్లు అనిపించి కొద్దిగా దూరంగా నించున్నాను."ఏంటండీ మీరు ,కొనేటప్పుడు అన్ని చూసి కొనాలి కదా ,ఊరికే ఇవ్వట్లేదుగా!"  ఫ్రెండ్ పట్టించుకోకుండా డ్రెస్ కు బిల్ వేయమంది .ఇదైనా కొంటారా లేక మళ్ళీ మారుస్తారా   వెటకారంగా అన్నాడు షాప్ అతను.ఇద్దరు ముగ్గురు నవ్వారు..నాకు తలకోట్టేసినట్లు అనిపించింది .నా ఫ్రెండ్ పట్టించుకోకుండా బిల్లు కట్టి వచ్చేసింది.

ఎందుకన్ని మార్చడం విసుగ్గా అన్నాను.బోలెడు డబ్బులు పోసి కొన్నపుడు అలా అన్నీ పట్టించుకుంటే తరువాత బాధ పడాలి అంది .తన డ్రెస్ తో పోలిస్తే నా డ్రెస్ ఖరీదు ఎక్కువ ,అంత గొప్పగా అనిపించలేదు .అలా అని షాపులో అలా మాటలు అనిపించుకోవడమూ నచ్చలేదు .వెదవ మొహమాటానికి  పోకుండా ఉంటే నేనూ నచ్చినది కొనుక్కునేదాన్నేమో? కాని అలా ఎప్పటికీ  చేయలేనేమో ?

ఇంతకూ   తను కరెక్టా నేను కరెక్టా?

  

Monday, 21 February 2011

కుచ్చిళ్ళు

చిన్నతనాన  అమ్మ చేతిలో అలోవొకగా ఒదిగిపోతూ ఆక్చర్యాన్ని కలిగించేవి ఈ కుచ్చిళ్ళు

వయసుకొచ్చాకా "అబ్బా ఇంకెలా అత్తా" అని గారాలు ఒలికిస్తూ విసుక్కునేలా చేసేవి ఈ కుచ్చిళ్ళు

పెళ్ళాయ్యాక నునులేత సిగ్గుతో భర్తను వారిస్తూ మైమరపించి  మురిపించేవి  ఈ కుచ్చిళ్ళు

బుడి బుడి నడకలు నేర్చుకుంటున్న బుజ్జిపాపాయి పడిపోకుండా భరోసాను ఇచ్చేవి ఈ కుచ్చిళ్ళు

 అమ్మమ్మ  గంజి పెట్టిన నేత చీరను బుజ్జగింపుల మధ్య మనవరాలితో  సవరించుకునేలా చేసేవి ఈ కుచ్చిళ్ళు

పాదాలను సైతం కనిపించనీయకుండా పడతి అందాన్ని పదిరెట్లు పెంచేవి ఈ కుచ్చిళ్ళు 

Sunday, 20 February 2011

ఏం తినేటట్లు లేవు

ఇంతక ముందోసారి  ఫ్రెండ్ మామిడి తోటకు వెళ్తే మామిడికాయలు  రాసులుగా పోసి ఉన్నాయి.పనివాళ్ళు వాటి పై ఏదో రసాయనాలు పోస్తున్నారు.ఏమిటవి? అని అడగ గానే  కాయలు వెంటనే పండి రసాలుగా తయారవ్వడానికి అట.మేము చూస్తుండగానే పసుపురంగులో మారి పోయి నిగ నిగలాడాయి.

మొన్న ఏదో టివి చానెల్ చూస్తుంటే పచ్చని అరటి పళ్ళపై ఇదే రసానియాన్ని జల్లుతున్నారు వెంటనే మగ్గిపోవడానికి . అలాంటి రసానియాలు జల్లిన పళ్ళు తింటే చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉందిట .

డాక్టర్ సలహా మేరకు ఐరన్ బాగా పట్టడానికి అమ్మ రెండు రకాలా ఆకు కూరలు తెచ్చి వండగానే ఇంట్లో వాళ్లకు వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి . ఫుడ్ పాయిజన్ అయిందేమో అని మళ్ళీ డాక్టర్ 
 దగ్గరకు పరుగులు పెడితే , ఆకు కూరల పై జల్లిన రసానియాలే కారణం  బాగా ఉప్పు నీటిలో కడిగి తినండి అన్నారు.

పై పై పూతలు అయితే కడిగేస్తాం .నిరంతరం వాటినే పీల్చుకుని ఉన్న వాటిని ఎలా కడిగేది? ఎలా  తినేది?

Saturday, 19 February 2011

నువ్వంటే చిరాకు

చెప్పేది వినడమే కాదు మాట్లాడటం కూడా  చేతకాని నువ్వంటే చిరాకు
నవ్వించడమే కాదు నవ్వడం కూడా రాని నువ్వంటే చిరాకు

వెక్కిరించడమే తప్ప ఓదార్చడం అంటే తెలియని  నువ్వంటే నిజంగా చిరాకు
నువ్వేంటో అర్ధం కావు ఎవరినీ  అర్ధం చేసుకోవు అందుకే మరీ చిరాకు

నీ పొగరు,కోపం,నిర్లక్ష్యం  అన్నీ నాకు చిరాకు చిరాకు చిరాకు

నీ మీద ఇష్టాన్ని చంపుకోవడానికి  ఎన్ని కారణాలు వెతుక్కున్నా
మరింతగా పెరిగిపోతున్న నీ ఆలోచనలు అంటే నాకు చిరాకు పరమ చిరాకునా బాల్యం మళ్ళీ తిరిగి వచ్చినట్లు అయింది

మధ్యాహ్నం అంతా నిద్రపోయి చీకట్లు ముసురుతున్నపుడు మెలుకువ వచ్చి,
అది తెల్లవారు జామో లేక సాయం సంధ్యో తెలియని అయోమయం లో బద్దకం గా మరో అరగంట అలాగే పడుకుని,
అమ్మ పెట్టిన వేడి వేడి నీళ్ళు ,పియర్స్ సోప్ ( చిన్నప్పుడు దానితో స్నానం) తో కరువుదీరా స్నానం చేసి..
వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించి ,
మేడ మీద చీకట్లో అలా అలా పచార్లు చేస్తుంటే
మళ్ళీ బాల్యం లోకి వెళ్ళిపోయిన అనుభూతి.
ప్రపంచం లో ఆనందం అంతా గుప్పెటలో మూసేసుకున్నట్లు అయ్యింది .
నా భాల్యం మళ్ళీ తిరిగి వచ్చినట్లు అయింది ఆ కొద్ది సేపూ

Friday, 18 February 2011

అలనాటి ఆణిముత్యపు పాటలు

నాన్నమ్మ నేర్పిన ఆణిముత్యపు అలనాటి పాటలు
ఈ పాట ఎవరికైనా తెలిసినట్లు అయితే మిగిలిన పాట తెలుప గలరు

ఎంతా పేదావాడమ్మా గోపాలుడు
ఎంతా పేదా వాడమ్మా
ఎంతా పేదాగాకున్నా అలనాడు కుచేలునిని అటుకులకై చెయ్యి చాపెనే
గోపాలుడు అటుకులకై చెయ్యి చాపెనే " ఎంతా "

కట్టా వస్త్రము లేదు కౌసల్యా కొమరునికి
కట్టా వస్త్రము లేదు కౌసల్యా కొమరునికి

నారా చీరలు కట్టేనే గోపాలుడు
నారా చీరలు కట్టేనే గోపాలుడు "ఎంతా"

పండా పానుపు లేదు యశోదా తనయునికి
పండా పానుపు లేదు యశోదా తనయునికి

పామూ పై పవళించేనే గోపాలుడు "ఎంతా"