Tuesday, 22 February 2011

ఈ రోజంతా నీ ఆలోచనలే .......

ఈ రోజంతా  నీ ఆలోచనలే ...

అప్పట్లో నీ సానిహిత్యంలో ఎంతటి ఆనందాన్ని చవిచూసేదాన్నో.ఒక్కోసారి నీ ఒడిలో నేను, మరోసారి నా ఒడిలో నీవు .ఎంత అపురూపమైన రోజులవి ?

ఎంతసేపూ నీ చెంతనే ఉండాలని తెగ ఆరాటపడేదాన్ని.నీనుండి వచ్చే గమ్మత్తైన పరిమళాన్ని ఆస్వాదించాలనుకునేదాన్ని .నువ్వు నాకే సొంతం అనుకునేదాన్ని..ఇంకెవరన్నా నీ గురించి మాట్లాడినా ,నిను తాకినా ఒప్పుకునేదాన్నే కాదు. నా స్నేహితులు ఎంత కుళ్ళుకునేవారు అనుకున్నావ్ నిన్ను చూసి.చాలా గర్వంగా ఉండేదిలే .

కాని ఈ పెద్దోళ్ళు ఉన్నారే దేనికీ ఒప్పుకోరు .అన్నీ ఆంక్షలే . ముఖ్యంగా అమ్మ.మనల్ని విడదీయడానికి శతవిధాలా ప్రయత్నించేది తెలుసా? పగలు నీ దగ్గరకొస్తాను అంటే పని పాటాలేదా క్రొత్త బిక్షగాడు పొద్దు ఎరగడని ఎప్పుడూ అక్కడికే  వెళతానంటావు అని కసిరేది.

పోని మధ్యాహ్నం ఒప్పుకుంటుందా అంటే మరీ తిట్టేది.ఎండాకొండా ఏమీ చూసుకోవా ?నాన్నకు చెప్తాను అని బెదిరించేది.ఇక రాత్రి ,....చీకటి పడింది ఒంటరిగా వద్దు .ఆడపిల్లలు చెప్పిన మాట వినాలి అని గదమాయించేది.

ఇవన్నీ నీకేం తెలుసూ?అందరిని తప్పించుకుని నేను రాగానే చల్లగా నవ్వడం తప్ప.ఒక్కసారైనా నీ కోసం పడే ఆరాటం గమనించావా? ఒక్క రోజన్నా నన్ను తల్చుకున్నావా?' పో' నీతో ఇక మాట్లాడనే మాట్లాడను.

కోపం వచ్చిందా ? నీకు చాలా దూరంగా ఉన్నాను అనే బాధ .అంతే గాని నిన్ను తప్పు పట్టాలని కాదు.నిన్న అమ్మ చెప్పింది నువ్వు ఈ మధ్య చాలా దిగాలుగా ఉంటున్నావంట ?మునుపటిలా లేవంట. ఇదంతా బెంగే ?నా మీదే కదూ?

మళ్ళీ నీ చెంతకు వస్తానుగా ,ఈ సారి ఎవరు చెప్పినా వినను .నీతోనే,నిన్ను చూస్తూ ,నీతో కబుర్లు చెపుతూ నీ దగ్గరే  ఉంటాను .అప్పుడు అలా దిగాలుగా ఉండకూడదు మరి . మునుపటిలా నవ్వుతూ,పచ్చగా ,విరబూసిన మల్లె పూలతో పందిరి అంతా అల్లుకుపోయి  పెరట్లో కళ కళ లాడుతూ ఉండాలి.

5 comments:

sai said...

chala bagundi..true feelings

మధురవాణి said...

Sweet! అయితే... ఈ ఊసులన్నీ మీ పెరట్లోని మల్లెపందిరితో చెప్తున్నట్టా? ;)

శిశిర said...

:) Beautiful. చాలా బావున్నాయి మీ ఊసులు.

శిశిర said...
This comment has been removed by the author.
sneha said...

సాయ్ గారు ధన్యవాదాలు
మధురవాణి గారు అవునండి ముమ్మాటికి మల్లె చెట్టు గురించే ధన్య వాదాలు
శిశిరగారు ధన్యవాధాలు