Tuesday, 1 March 2011

నా మొదటి కధ(పెళ్లి చూపులు )

పరుగులు పెట్టి వచ్చానేమో ఆయాసం తో కొద్దిగా వగర్పు వస్తుంది.లాస్ట్ మినిట్లో టికెట్ బుక్ చేయడం వల్ల RAC దొరికింది లేకపోతే అదీ లేదు .అసలు అమ్మను అనాలి. ఇప్పటికిప్పుడు వచ్చేయ్ అని ఆర్డర్ వేసేస్తే దొరికేయడానికి అవేమన్నా ట్రైన్ టిక్కెట్లా ?షాప్ లో చాక్లెట్లా? ఇంకా నయం ట్రైన్ వెళ్ళిపోలేదు .పైగా ఈ దాహం ఒకటి..

 మంచి నీళ్ళ బాటిల్ కోసం అటు ఇటు చూస్తూ ఉన్న నా చూపులు ఎదురుగా నా వైపే రెప్ప ఆర్పకుండా చూస్తున్న అబ్బాయి మీద నిలిచిపోయాయి..   "వేణు" అప్రయత్నంగా నా నోటినుండి అతని పేరు బయటకు వచ్చింది."అతనేనా? అతనేంటి  ఇక్కడ? "  అతనూ నన్నే గమనిస్తున్నాడన్న విషయం గ్రహించి చూపు తిప్పుకునేలోపు ట్రైన్ ప్లాట్ఫాం దగ్గరకు వచ్చి నిలుచుంది .జనాలు పరుగులు పెట్టి ఎక్కుతున్నారు .నేనూ వాళ్ళతో పాటే ఎక్కి నా సీట్ నెంబర్ చూసుకుని కూర్చున్నాను.కాని మనసు మనసులో లేదు.

వేణూ యే కదా తను ?గుర్తు పట్టాడా నన్ను ? మర్చిపోయాడా? ఒకటా రెండా దాదాపు 8 నెలలు పైనే అయ్యింది.అతను ఇంకా  అక్కడే ఉన్నాడా ?వెళ్ళిపోయాడా?ఈ పాటికి పెళ్ళయిపోయి ఉంటుంది .మరి తన భార్య ?ఇందాక సరిగ్గా గమనించలేదు అతని ప్రక్కన ఎవరైనా ఉన్నారో లేదో ?. ఒక్కసారి చూస్తే? మనసు వద్దని వారిస్తున్నా కిటికీ నుండి మెల్లగా బయటకు తొంగి చూసాను .

ఎవరూ లేరు.కొద్దిగా నిరాశ.ఇక్కడికెందుకు వచ్చాడు ?బహుసా అత్తగారి ఊరేమో?కొంపదీసి ఇదే ట్రైన్ ఎక్కడం లేదు కదా?  అంతంలేని ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎక్స్యూజ్ మీ అన్న మాటలకు ఇటు తిరిగిన నేను ,అతను ఒక్కసారిగా షాక్ తిన్నాం. "వేణు" నా కళ్ళెదురుగా .... అదీ నా సీట్ నే షేర్ చేసుకుంటూ.. భగవంతుడా ఎందుకు నాకీ పరిక్షా .ఇప్పుడు ఇతనితో ఈ రాత్రంతా జర్నీ చేయాలి.ఇంతకన్నా ఇబ్బంది కరమైన సన్నివేశం ఎవరికన్నా ఎదురవుతుందా?అసలిదంతా నిజమేనా?  సర్ధుకుని కూర్చుని మొహం కిటికీ వైపుకు త్రిప్పుకుని గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాను.అంతా చేస్తే అతనితో నా పరిచయం పదిహేను నిమిషాలే కాని ప్రతి నిమిషం తనే నేనైపోయాను.రైలుతో పోటీ పడుతూ  నా ఆలోచనలు గతంలోకి పరుగులు పెట్టాయి .

మొదటి సారి తన ఫోటో చూడగానే నచ్చేయడం వల్లనో, చుట్టాలు బందువులు అతని గుణగణాల గురించి తెలిసింది తెలియనిది వర్ణించి చెప్పడం వల్లనో ,ముఖ్యం గా పెళ్ళిళ్ళ పేరయ్య గణపతి గారు అబ్బాయికి అమ్మాయి తెగ నచ్చేసింది ,పెళ్లి చూపులేం వద్దు ఏకంగా పెళ్ళే పెట్టేస్తే బాగుంటుంది అని అన్నాడని ఊరించడం వల్లో ఏమో కారణాలు ఏమైనా గాని అతనంటే తెలియని ఇష్టం వచ్చేసింది .నాన్న లేకపోవడం వల్ల,కోరి చేసుకుంటే నేను సుఖంగా ఉంటా అని అమ్మ కూడా చాలా ఆశలు పెట్టుకుంది ఆ సంబంధం పై..

పెళ్లి చూపులు నామ మాత్రమే..... అబ్బాయికి లీవ్ దొరకగానే వచ్చి చూసుకోవడం ,కుదిరితే ఆ వారంలోనే తాంబూలాలు ,ఆ పైన పెళ్లి  అని నాలో లేని ఆశలు  రేపేసారు.దాంతో పెళ్లి చూపులకు ముందే అతను నావాడు అన్న ఫీలింగ్ బలంగా ఏర్పడిపోయింది .అందుకేనేమో పెళ్లి చూపుల్లో ఆ పదిహేను నిమిషాలు నాకేం క్రొత్తగా అనిపించలేదు .ముందు కాసింత సిగ్గు పడినా ఆ తరువాత చాలా ఫ్రీ అయిపోయాను.తను మాత్రం తక్కువా ? ఆ కొద్ది సేపూ నన్ను ఎంతో అపురూపంగా చూసాడు .మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి అని ఆక్చర్యపోయాం .తన మాటల బట్టే అర్ధం అయిపొయింది నేను తనకు చాలా నచ్చేసానని.వెళ్ళే ముందు తను అన్నమాటలే అందుకు సాక్ష్యం ."పావనీ... ఒకే అభిప్రాయాలు కలసిన వ్యక్తులు పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది .ఆ అరుదైన అవకాసం నాకు దొరికినందుకు చాలా చాలా హేపీగా ఉంది."
ఆ తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు .


ఒక రోజు ..రెండు రోజులు ...నాలుగు  రోజులు..నేను ఊహల్లో తప్ప  నేలపై నడవడం మానేసాను కానీ  అటునుండి సమాధానం రాలేదు .ఐదో రోజున గణపతిగారు చెప్పారు వాళ్లకు అమ్మాయి నచ్చలేదంట .మరుసటి రోజే వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు అని. ఒక్కసారిగా ఎవరో అగాధం లోనికి తోసేసినట్లు అయింది . 

 నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? మరెందుకు అలా మాట్లాడాడు? ఏవేవో జవాబులేని ప్రశ్నలు . అమ్మకు కూడా చాలా బాధ కలిగింది అనుకుంటా .కట్నం నచ్చక పొతే నచ్చలేదని చెప్పాలి ఆస్తులు నచ్చక పొతే ఆస్తి నచ్చలేదని చెప్పాలి అంతేగాని పిల్ల అందానికి లోపం పెడతారా ?వాళ్ళు మనుషులేనటండి తన ఆక్రోశం అంతా గణపతిగారి ముందు చెప్పుకుని తీర్చుకుంటుంది .కాని నా బాధ ఎవరు పట్టించుకుంటారు? ఇంతేనా పెళ్లి చూపులంటే ? ఒక్క మాటలో అయిపోయిందా? ఆ అబ్బాయికి ఏమీ అనిపించలేదా? ఇంకో అమ్మాయిని చూసుకుని ఖాయం చేసేసుకున్నారా?నేను గుర్తు రాలేదా?ఒక్క క్షణం కూడా? కోపం ,ఉక్రోషం,బాధ ,అవమానం ..మనసంతా పిండేసినట్లు అనిపించింది ..

బాత్రూం లోకి వెళ్లి ఎవరూ చూడకుండా వెక్కి వెక్కి ఏడ్చాను .ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు.తప్పు నాది .ఇదొక వ్యాపారం లాంటిది .మంచి వస్తువు కొనేటప్పుడు ఎలా ఆలోచించి ఎంపిక చేసుకుంటామో  అలాగే ఇదీ కూడా .అయినా ఎందుకని పిచ్చి మనసు ఒప్పుకోదు.ప్రపంచం లో అందరూ నాలాగే బాధ పడతారా? లేక నేనే ఇలా ఆలోచిస్తున్నానా? నాతో అలా మాట్లాడి కూడా ఇంకో అమ్మాయిని ఎలా చూడబుద్దేసింది ? ఇలాంటి విషయాలు ఎవరితోనూ పంచుకోలేము . ఒక వేళ చెప్పినా నవ్వేసి తీసిపడేస్తారు తప్ప అర్ధం చేసుకోరు .ఆ బాధ  నుండి తేరుకోవడానికి  నాకు వారం పైనే పట్టింది .అలా అనుకుని మభ్య పెట్టుకున్నానేగాని అతనిని మనస్పూర్తిగా మర్చిపోలేదు .ఏదో ఒక విషయం లో ఏదో రూపం లో గుర్తుకొస్తూనే ఉన్నాడు .మొదటి ప్రేమ మర్చిపోలేము అంటే ఇదేనేమో .

ఆ తరువాత రెండుసార్లు పెళ్లి చూపులు జరిగాయి. నాకు అసలు పెళ్లి మీదే విరక్తి వచ్చేసింది .అమ్మ కోసం ఒప్పుకోక తప్పలేదు.ఏదో కారణం వల్ల అవి కుదరలేదు .నాకు ఏమీ అనిపించనూ లేదు. అనుకోకుండా ఈ ఊళ్ళో జాబ్ రావడం .నాలుగు నెలలుగా ఇంటికి దూరం అయ్యాను .ఉన్నట్లు ఉండి అమ్మ ఫోన్ ...ఎవరో అబ్బాయి చూసుకోవడానికి వస్తున్నాడట.నేను బాగా నచ్చేసానట . వెంటనే వస్తావా చస్తావా  అని బెదిరింపులు .బయలుదేరక తప్పలేదు .

మెల్లగా తల త్రిప్పి అతని వైపు చూసాను .కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నాడు .కిటికీ నుండి వస్తున్న గాలికి జుట్టు మొహం పై పడుతూ  అదోరకమైన అందం .ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉంటుంది .భార్య రాలేదు ఎందుకనో ? అందంగా ఉంటుందా ఆమె ? నాకంటేనా? ఎక్కడో ఉక్రోషం .ఆ అమ్మాయి అస్సలు బాగో కూడదని .ఛీ ఈ మనసుకు బుద్దిలేదు .అతనెలాపోతే నాకేం ? ఇప్పుడు అతనెవరో నేనెవరో ?
(ఇంకా ఉంది )

21 comments:

మనసు పలికే said...

వావ్.. స్నేహ గారు భలే ఉంది కథ. చాలా చాలా నచ్చింది:))) నెక్స్ట్ పార్ట్ ప్లీజ్...

చెప్పాలంటే...... said...

స్నేహ భలే ఉంది కథ. చాలా చాలా నచ్చింది.... నెక్స్ట్ పార్ట్ ప్లీజ్...

కొత్త పాళీ said...

అద్భుతంగా రాస్తున్నారు (రాశారు?)
మనసులో రేగుతున్న ఒక్కొక్క ఉద్వేగానికీ మీరు చెక్కుతూ వచ్చిన అక్షరరూపాలు ఆయా ఉద్వేగాలనే కళ్ళముందు నిలబెడుతున్నై. ఒక చిన్న సూచన - నేను అని కథ మొదలు పెడుతున్నప్పుడు ఆ నేను మగ/ఆడ అనేది పాఠకులకి ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది.
ఇలా సీరియల్ చెయ్యడం ఏం బాగాలేదు.
ఒక విన్నపం. నల్ల తెరమీద తెల్ల అక్షరాలు చదవడం కష్టంగా ఉంది. వీలున్నప్పుడు రంగులు మార్చగలరు.

సుమలత said...

స్నేహ గారు కద చాలా ఆత్రుతగా వుంది.
త్వరగా నెక్స్ట్ పార్ట్ పెట్టగలరు .....
మీ మాటలు చాలా మత్తుగా వున్నాయీ...

Ennela said...

ఒక జాబ్ రెసయిన్ చేసి..ఇంకో జాబ్ ఇంటర్వ్యూ కి వెళుతుంటే, పాత బాస్ తో ప్రయాణించాల్సి వచ్చింది...అదీ ఇదీ వేరు అయినా, సేం ఫీలింగ్...హహహ..బాగా వ్రాసారు...

Anonymous said...

నెక్స్ట్ పార్ట్ తొందరగా రాయండి ప్లీస్

ప్రయాణం said...

chala bahundhi,
nenu kuda yela oka ammaiyini bhadha petanemo.
two times chusi vachi height nachaka vere yedho karanam cheppanu.
aa amayini nenu bhadhapettanu.....
sorry to that girl

Anonymous said...

nice start andi...next part plz...

Anonymous said...

మనుషుల సెన్సిటివిటీని చాలా బాగా capture చేసారు.
అభినందనలు
శారద

sneha said...

మనసు పలికేగారు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు
మంజుగారు ధన్యవాదాలు
కొత్తపాళి గారు మీకు కధ నచ్చినందుకు ధన్యవాదాలు.టెంప్లెట్ మార్చాను చూడండి

sneha said...

సుమలత గారు నా మాటలు మత్తుగా ఉన్నాయా :D
వెన్నెల గారు ధన్యవాదాలండి
ఆహ్లాదా తప్పకుండా రాస్తాను

sneha said...

ప్రయాణం గారు చాలా మంది పెళ్ళిచూపులతో విసిగిపోయిన స్నేహితురాళ్ళ మాటలను దృష్టిలో పెట్టుకున్నాను :) పెళ్ళిచూపులు అనేవి కొద్దిగా ఇబ్బంది పెడతాయి ఒక్కోసారి
అజ్ఞాత గారు ధన్యవాదాలు
శారద గారు థేంక్ యూ

శిశిర said...

చాలా చాలా బాగా రాశారు. ఆ అమ్మాయి ఆలోచనలలోని సున్నిత్వాన్ని బాగా వ్యక్తీరించారు. Waiting for next part.

Kathi Mahesh Kumar said...

(చాలా)బాగుంది. రెండోభాగం కోసం ఎదురుచూస్తూ..

Praveena said...

chala bagundi...tondaraga rpost cheyyandi rendo baganni...

సుజాత said...

రెండో పార్టు ఎప్పుడు?

sneha said...

శిశిర గారు ధన్యవాదాలు
మహేష్ కుమార్ గారు థేంక్యూ
ప్రవీణగారు తప్పకుండా
సుజాత గారు ఈ రోజే ప్రచురిస్తాను..
ఈ స్పంధన చూసాకా ఇప్పుడు భయం వేస్తుంది ఎలా రాస్తానో అని :D

మంచు said...

చాలా బాగుంది. Very Nice

sneha said...

manchu gaaru thank you very much

Vineela said...

అయ్యో స్నేహ గారూ...మీరు ఒక్కరే కాదండి..ఇలాంటివి మా గ్యాంగ్ కి కూడా అనుభవం అయ్యాయి/avutunnayi. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి....atanu మిమ్మల్ని మిస్ చేసుకున్నాడు లేదా మీకు అతని కన్నా మంచి అబ్బాయి దొరుకుతాడు అందుకనే అల జరిగి వుతుంది.

sneha said...

వినీల గారు అయ్యొ ఇది నా స్టొరీ కాదండి.ఒక ఫ్రెండ్ కి జరిగిన సంఘటనను కధలా అల్లుకున్నాను.