Wednesday, 16 March 2011

నా రెండవకధ (మూడవ భాగం)

మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళగానే సంధ్య కు కాల్ చేసాను ..."సంధ్యా వాడు మళ్లీ లెటర్ వేసాడు ....ఈ సారి మా ఆయన తీసుకున్నారు పద్మ నుండి .ఆయన చదివి ఉంటే ఏమయ్యేది .నాకు చాలా భయం గా ఉంది ".భయం తో మాటలు తడబడిపోతున్నాయి నాకు. "హే కంగారు పడకు అలా ఏమీకాదు నేను చెపుతున్నానుగా ...ఇంతకూ ఏమి రాసాడు ? నిన్ను కలుస్తా అన్నాడా? ఏమైనా బెదిరిస్తున్నాడా ? "అంది అనునయంగా . "బెదిరించలేదు గాని చిన్నప్పుడు మేము చూసిన సినిమాల గురించి వాటి గురించి గుర్తు చేసాడు ...నా అడ్రెస్స్ తప్పో ఒప్పో ఇంకా తెలియ లేదు అంటున్నాడు .. ఫోన్ నెంబర్ ఇచ్చాడు మళ్లీ . ఎందుకిలా చేస్తున్నాడు? కళ్ళు తుడుచుకుంటూ అన్నాను .
 
 
 
 " సినిమాలకు కూడా వెళ్ళావా ?"అటునుండి ఆశ్చర్యంగా అడుగుతుంది సంధ్య. నాకు చాలా సిగ్గుగా అనిపించింది.అంటే రెండు మూడు వెళ్లాం అంతే ...ఎక్కువకాదు కంగారుగా అన్నాను .అంతేనా  ?ఇంకేమన్నా ఉన్నాయా ? అనుమానంగా తన ప్రశ్న . రెండుసార్లు తను బుగ్గ మీద ముద్దుపెట్టు కోవడం గుర్తొచ్చినా చెప్తే ఇంకెంత తక్కువకు దిగాజారిపోతానో సంధ్య  దృష్టిలో అని ఆ బాధను కోపంగా మార్చేసి " ఎలా కనబడుతున్నాను నీకు ?ఆఖరికి నువ్వు కూడా అర్ధం చేసుకోవడం లేదుకదా "అన్నాను .ఇద్దరు ముగ్గురు నా వైపు చూసారు .
 
 
"అబ్బా..నా ఉద్దేశం అదికాదు నిధి .అతనితో తీయించుకున్న  ఫొటోస్, లవ్ లెటర్స్ గట్రా ఇంకా ఇలాంటివి   ఏమన్నా ఉన్నాయా అని  అంది నెమ్మదిగా .ఆ మాట వినగానే దిగాలుతనం వచ్చేసింది.ఫొటోస్ లేవుకాని లవ్ లెటర్స్ కొన్ని రాసాను .తను రాసినవి అమ్మా,నాన్నా చింపేసారు.తను ఇంకా ఉంచాడంటావా ? భయంగా అడిగాను . తెలియదు మరి  అంది పొడిగా .సంధ్యా ఏదో ఒకటి చెయ్యవే .నరకం అనిపించేస్తుంది నాకు అన్నాను అభ్యర్ధనగా .
 
 
"సరే సరే కంగారు పడకు అదే ఆలోచిస్తున్నా నేనూను .నువ్వు ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకు  అసలే వట్టిమనిషివి కూడా కాదు .అవునూ ఈ ప్రెగ్నెన్సీ  విషయం మీ ఆయనకు చెప్పావా? "అని అడిగింది. లేదు , తను ఆఫీస్ వర్క్ మీద ప్రొద్దున్నే ఢిల్లీ వెళ్ళారు ,"అయినా  అసలు ఎక్కడ చెప్పనిస్తున్నాడు ఈ రాజేష్. నాలుగు  రోజులనుండి కంటికి సరిగా నిద్ర కూడా లేదు . ఏంటో ఏంటో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.ఒక్కోసారి ఇదంతా ఎందుకు జరిగింది అంతా వాసుకి చెప్పేద్దాం అని అనిపిస్తుంది ...కాని ...కాని ..వాసు అర్ధం చేసుకుంటాడా? తను లేకుండా నేను ఉండలేను"  అన్నాను ఏడుపుగొంతుకతో .."వద్దొద్దు ..అలా చెప్పకు .ఈ రోజు నాలుగు తిట్టి క్షమించేయచ్చు .కాని రేపు దీని తాలూకు నీడ నీ జీవితం మీద పడుతూనే ఉంటుంది .మీ ఇద్దరూ ఏం చేసారో ఏం మాట్లాడుకున్నారో,నువ్వు ఎందుకు ఇంటికి ఆలస్యం గా వస్తున్నావో అంటూ లేనిపోని ఆలోచనలు మొదలవుతాయి .ఎంతైనా తను కూడా సగటు భర్తే కదా .మొన్న జరిగిన విషయం అప్పుడే మర్చిపోయావా "అంది.  
 
 
సంధ్య చెప్పినదానిలో నిజం లేక పోలేదు ...."పోనీ రాజేష్ కి  ఫోన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని గట్టిగా దులిపేయనా "ఆవేశం గా అన్నాను. "హే భలేదానివే అలా చెయ్యకు పూర్తిగా దొరికిపోతావ్ .వాడికి ఇంకా తెలియదుగా ఇదే మీ అడ్రెస్స్ అని .పోనీ ఒక పని చేస్తే అంది" సందిగ్ధంగా ఆగుతూ ..ఆ సమయం లో ఆసరాకు గడ్డిపోచ అయినా విలువైనదిగా అనిపిస్తుంది నాకు .'ఏంటీ'?? అన్నాను ఆత్రుతగా . మనమే వాడికి ఒక లెటర్ రాసి నువ్వన్న వ్యక్తి అడ్రెస్స్ ఇది కాదు .దయ చేసి ఇంకోసారి లెటర్స్ వేసి ఇబ్బంది పెట్టకండి అని చెప్తే?? అంది.
 
 నాకు ప్రాణం లేచోచ్చినట్లు అయ్యింది .కరెక్టే  అలా చేస్తే ఇక రాయడేమో  అన్నాను ఆశగా .నువ్వు రాయకు .మళ్ళీ నీ చేతి వ్రాత గుర్తుపట్టచ్చు.మళ్ళీ నీ ఉత్తరాలు అతని దగ్గర ఉన్నాయని అన్నావుగా.అడ్రెస్స్ చెప్పు నేనే రాసి పోస్ట్ చేస్తాను అంది. ఆ క్షణం లో సంధ్య మీద విపరీతమైన అభిమానం పుట్టుకోచ్చేసింది.వచ్చే జన్మ అంటూ ఉంటే నీ కడుపున పుట్టి ఋణం తీర్చుకుంటానే   అన్నాను . అంత వద్దులేగాని ఇప్పుడొకటి సుబ్బరంగా తిని నీ సంగతి చూసుకో అని ఫోన్ పెట్టేసింది. కొద్దిగా మనసు తేలిక అయ్యింది కాని ఇంకా ఏదో బెరుకు .
 
మేడ మీద ఒంటరిగా పచార్లు చేయడం మొదలు పెట్టాను ,వాసు లేని ఆ నాలుగు రోజులు నాలుగు యుగాలుగా అనిపించింది .ఇదే మొదటిసారి కాదు తను అలా వదిలి వెళ్ళడం,నేను బెంగ పడటం  .. కాని ఈసారి పరిస్థితి వేరు .తను ప్రక్కనే ఉండాలనిపిస్తుంది అదే క్షణం లో దూరంగా నేను ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. సంధ్య వేసిన ఉత్తరం వాడికి అంది ఉంటుందా? నమ్ముతాడా? ఇక నా గురించి వెదికే ప్రయత్నాలు మానేస్తాడా? ఏవేవో ఆలోచనలు..
 
 
నా దృష్టి ఎదురింటి మేడ మీద నాలాగే అటు ఇటు తిరుగుతున్నా పదహారేళ్ళ  అమ్మాయి మీద పడింది. ఇంకో రెండు ఇళ్ళ అవతల ఉన్న అబ్బాయి వైపు చూసి ఏవో సైగలు చేస్తుంది .వాడేదో తిరిగి చెపుతున్నాడు.చెప్పొద్దూ తిక్క కోపం వచ్చింది. వద్దే తల్లీ మీ వయసు ప్రేమలు పెళ్లి వరకూ వెళ్ళవు.సినిమాలు,సీరియళ్ళు చూసి ఇలాంటి ఆకర్షణలను ప్రేమ అనుకుని నిండా సమస్యలు ఉన్న గోతులలో  పడిపోతారు.. వాళ్ళేం మగమహారాజులు..ప్రశ్నలు వేయడం తప్ప జావాబులు చెప్పక్కరలేదు . మనమే ఇలా ఎటూ పాలుపోని స్థితిలో తేలుకుట్టిన దొంగల్లా ,కాలు కాలిన పిల్లుల్లా  తప్పుచేసిన వాళ్ళల్లా మిగిలిపోతాం కచ్చగా అనుకుంటుంటే  ఫోన్ మోగుతుంది క్రింద .
 
 
వాసు కాల్ అయ్యింటుంది. ఈ రెండు రోజులు తనకి కాల్ చేస్తే  మీటింగ్ లో ఉన్నాను మళ్లీ చేస్తాను అని,కొలీగ్స్ తో భోజనం చేస్తున్నా రాత్రికి కాల్ చేస్తా  అని పెట్టేసాడు కాని ఫోన్ చేయలేదు . అసలు ఏమనుకుంటున్నాడు నాగురించి?. ఇప్పుడు మాత్రం  గుర్తొచ్చికాదు ,ఖచ్చితంగా రేపు రావడానికి కుదరడం లేదు  ఇంకో నాలుగు రోజులు ఆలస్యం అవుతుంది అని కహానీలు చెప్పడానికి ..అదే చెప్తే అయిపోయాడే కోపంగా అనుకుంటూ విసురుగా హలో అన్నాను .
 
 
'హలో శ్రీ 'అటునుండి ఎవరిదో గొంతు  .నాకు ఒక్కసారిగా గొంతు తడారిపోయింది . బిక్కచచ్చిపోయి అలా నిలబడిపోయాను ."హలో  హలో  నేను రాజేష్ ని మాట్లాడుతున్నాను అండి  . ఇది  ఫలానా నెంబర్ ఏనా అంటూ మా ఇంటి నెంబర్ చెపుతున్నాడు .నా చేతిలో రిసీవర్ ఎలా పెట్టేసానో తెలియదు. కాసేపు మెదడంతా స్తంభించి పోయినట్లు అయ్యింది. అయిపొయింది  మా ఇంటి నెంబర్ తెలుసుకున్నాడు. దేవుడా ఇప్పుడేం చేయాలి ? చమట తో వొళ్ళంతా తడిచిపోతుంది.మళ్ళీ ఫోన్ రింగవుతుంది .. ఆ శబ్దం వింటుంటేనే ఫోన్ నేల కేసి కొట్టాలనిపిస్తుంది ..
 
 

11 comments:

నైమిష్ said...

కథ మరియు కథనం బాగున్నాయి...నాల్గవ భాగం కోసం ఎదురుచూస్తున్నాను..

మందాకిని said...

ఈ కథకి ఇంకా పేరు పెట్టలేదా! నాలాంటి వాళ్ళు బోల్డన్ని పేర్లు ఈ పాటికే సూచించేశారా? :)
-శ్రీ- బాగుంటుంది. తొలివలపులు కూడా బాగుంటుంది. ఈ వ్యాఖ్య మీరు ప్రచురించనక్కర లేదు.

శిశిర said...

మళ్ళీ "ఊ.. తర్వాత?" :)

శివ చెరువు said...

ఈ సారి మీ కధ లాస్ట్ పార్ట్ ప్రచురించారని తెలిస్తే తప్ప చదవడం మొదలు పెట్టను.. మంచి..హోర్రోర్ సినిమా చూస్తున్నప్పుడు పవర్ కట్ లాగ ఉంది పరిస్థితి.:) Well written as usual..

మంచు said...

చస్.. నాకు అస్సలు కంట్రొల్ లేదు... ఇప్పుడు తరువాతి బాగం కొసం ఎదురు చూస్తూ ఉండాలి... :((((

మంచు said...

కానీ ఎమాటకామాటే.. మీ శైలి సూపర్ అంతే...

డేవిడ్ said...

"........................" బాగుంది...తర్వాత?

కావ్య said...

నేను నీతో పచ్చి స్నేహ .. నీకు అసలు మనసే లేదు .. :) మా అందరకి BP తెప్పిద్దామని ఇలా చేస్తున్నావు .. త్వరగా రాయమ్మ

sneha said...

మందాకిని మీ మొదటి కామెంట్ పబ్లిష్ చేయలేదు (ఎందుకో మీకు తెలుసు :))...రెండవది వద్దు అన్నారుగా .కధలంటే ఏదో తోచింది రాయగలను కాని పేర్లు పెట్టడం తెలియడం లేదండి అదే కష్టం గా ఉంది.ఎవరైనా చదివాకా మంచి పేరు సూచిస్తారని వదిలేసాను.మీరు చెప్పిన రెండు పేర్లు బాగున్నాయి చివర్లో ప్రచురిస్తాను .
నైమిష్ గారు కధ నచ్చినందుకు ధన్యవాదాలు
శిశిరా ఊ తర్వాత ..ఎమైతే బాగుంటుంది చెప్పండి రాసేద్దాం అలా :)
శివ గారు థేంక్యూ ..పెద్ద సస్పెన్సేమి కాదండి.మళ్ళా ఎక్కువ ఊహించేసుకుని చివర్లో ఇంతేనా అనకూడదు మరి
మంచు గారు ఈ రోజు ఓపికగా పెట్టిన కామెంట్శ్ చాలా నవ్వొచ్చాయి .అయినా రోజుకొక భాగం రాసేస్తున్నా ఎందుకులే ఫ్లో మిస్ అవుతుంది అని :)
డేవిడ్ గారు తర్వాత కధ రాసాను కాని చాలా మార్పులు చేయాలి కొద్దిగా బద్దకం
కావ్య Thank you తప్పకుండా మీ కోసం త్వరలో ప్రచురించేస్తాను :)

మనసు పలికే said...

ఓర్నాయనోయ్.. ఏదో హర్రర్ సినిమా చూస్తున్నంత టెన్షన్‌తో చదివిస్తున్నారు మీరు కథని;) చాలా చాలా బాగుంది మీ శైలి:) ముగింపు కి ఇంకా ఎన్ని భాగాలు ఉంది;)

sneha said...

మనసుపలికే గారు అదే ఆలోచిస్తున్నా.ఇంకో రెండు భాగాలు రాయాలా? లేక ఒకే భాగం లో చెప్పేయనా అని :D