Monday, 14 March 2011

నా రెండవ కధ (రెండవ భాగం)

తలుపు తీయగానే ఎదురుగా  వాసు ... గుండెల్లో ధడ ధడ మంటుంది ..." ఎన్ని సార్లు తలుపు కొట్టాలి ...ఏం చేస్తున్నావ్ లోపల "..ఎందుకో చాలా చిరాకు గా ఉన్నట్లు ఉన్నాడు రావడం రావడం విసుగ్గా అరిచాడు. నేనేం మాట్లాడలేదు.."ఏంటి ఏదో వాసన????".. షూ విప్పుతూ  అంటూ నా వైపు చూసి వంటగదిలోకి పరుగులు పెట్టాడు ...అప్పటికి గాని నేను ఈ లోకంలోకి రాలేదు  ...తన వెనుకే వెళ్లేసరికి అన్నం గిన్నె ,కూర గిన్నె మసి బొగ్గులు.. ఇంకాసేపు ఆగితే అది కూడా అంటుకుని మంటలు వచ్చేవేమో .  ఏం చేస్తున్నావ్ ఇంత నిర్లక్ష్యం గా ..ఛీ కొంప కొస్తే చాలు  ఏదో గోల ...కనీసం తిండి తినడానికి కూడా గతి ఉండదు  విసుగ్గా వెళ్లి బెడ్ రూమ్లో పడుకున్నాడు..
  
నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి.ఇదే ఇంకో సమయం అయితే మీరేనా ఉద్యోగం చేస్తుంది అనిగొడవ వేసుకునేదాన్ని ..కాని ఇప్పుడున్న పరిస్తితుల్లో మెదడంతా అల్లకల్లోలం గా ఉంది..ఏవేవో ఆలోచనలు ..రాజేష్ కి ఎవరిచ్చారు నా అడ్రెస్స్ ? ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు.?వాసు కి ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తాడు ?అర్ధం చేసుకుంటాడా? ఇవే ప్రశ్నలు తిరిగి తిరిగి . అంతలోనే మరొక భయం మొదలైంది ...ఇప్పుడు ప్రెగ్నెంట్ ని ..మందులు మాకులు ఏమి వాడకుండా హటాత్తుగా ప్రెగ్నెంట్ ని అయ్యాను..ఈ సమయం లో ఈ విషయం చెప్తే  లేని పోనీ అనుమానాలు మొదలవుతాయేమో? ఎక్కువ ఆలోచిన్చేస్తున్నానా? అలాంటి వాడా వాసు ? ఏమో అనుమానం పెను భూతం  అంటారు .ఒక వేళ అలా అనుకుంటే ?ఇప్పుడు ఏం చేయాలి? ఏ విషయం  ముందు చెప్పాలి? ఎంత సేపు ఆలోచించానో తెలియదు ..ఒక ప్రక్క విపరీతమైన నీరసం .వంట గదిలోనే గోడకు జారబడి ఆలోచిస్తూ నిద్ర పోయాను .

మధ్య రాత్రిలో నిధి ..నిధి అని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచాను ..వాసు కుదుపుతున్నాడు ... నేను కళ్ళు తెరవాగానే నన్ను గుండెలకు హత్తుకుని ఏంటిరా  ఇక్కడ పడుకున్నావ్ ..పద మన రూం కి అన్నాడు . ఆ మాత్రం ప్రేమకే కళ్ళల్లోంచి నీళ్ళు వరదలా వచ్చేసాయి .."ఇంకా నువ్వొస్తే అన్నం తినను అని అలుగుదాం ..ఎలాగూ నువ్వు బ్రతిమాలుతావ్ ఆ వంకన మాట్లాడేద్దాం  అనుకుంటే ఇంతకీ రావు అంతకూ రావు ...ఏం చేస్తున్నావో చూద్దాం అని వస్తే నువ్వు ఇలా ఒక్కదానివే పడుకుంటే బోలెడుజాలేసింది ... సారి రా కోపం లో తిట్టేసాను .నాకు నువ్వు తప్ప  ఇంకెవరున్నారు .మా బాసు వెధవ ఈ రోజు తెగ చిరాకు పెట్టేసాడు .దానికి తోడు నువ్వేమో మాట్లాడవు ...ఇక ఆ కోపం ,ఈ కోపం   నీ మీద చూపించేసాను ..నువ్వేకదా  నా కళ్ళకు లోకువగా  కనబడేది మరి అన్నాడు నుదిటిపై ముద్దు పెడ్తూ ".నాకు ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగి వచ్చేసింది. ఛీ ఎన్ని తిట్లు  తిట్టుకున్నాను ఈ నాలుగు రోజులు తనని.పైగా సంధ్య తో నన్నేదో కష్టాలు పెట్టేస్తున్నట్లు కనీసం హాస్పిటల్ కి కూడా తీసుకు వెళ్ళలేదు అని చెప్పి అక్కసు తీర్చేసుకున్నాను. ఎంత ప్రేమగా చూసుకుంటాడు నన్ను.ఏం ఒక్క మాట అనేసరికి అంత ఉక్రోష పడిపోవాలా నేను  ?

బెడ్రూమ్లో కూర్చోగానే 'ఇక్కడే ఉండేం ఇప్పుడే వస్తా 'అని వంటగదిలోకి వెళ్లి కట్ చేసిన ఆపిల్స్, మజ్జిగా తెచ్చాడు ఇద్దరికీ.నాకొద్దు అన్నా బలవంతంగా తినిపించి .." ఈ మధ్య కాస్త నీరసం గా కనబడుతున్నావ్ .తినకపోతే ఎలా? చూడు పనుల్లో పడి నేను మర్చిపోతుంటాను నీ తిండి నువ్వు చూసుకోకపోతే కష్టం ..ఇంకా చిన్నపిల్లవా " అన్నాడు.తన గుండెల పై తల వాల్చి వింటూ "వాసూ నన్ను వదిలి వెళ్ళవు కదా ...నా మీద కోపం వస్తే వదిలేస్తావా "అన్నాను తన కళ్ళల్లోకి చూస్తూ .. ఇంకా అదే ఆలోచిస్తున్నావా ? నీ మీద నాకెందుకురా కోపం ...వాడు నిన్ను పట్టుకున్నాడని ఏదో కోపం లో  అన్నాను గాని ,నిన్ను అనుమానిస్తానా ?నీ గురించి నాకు తెలియదా..సీత ,సుమతి,సావిత్రి తరువాత శ్రీనిధి  ఎవరన్నా దగ్గరకొస్తే మాడి మసైపోడూ అన్నాడు నవ్వుతూ ...అది తనకి జోకేమోగాని నాకు బాకై గుచ్చుకుంది . ఏం చేయనిప్పుడు ? ఎలా చెప్పేది ?

నాకెందుకో సంధ్య గుర్తొచ్చింది ..మేమిద్దరం చిన్నప్పటి నుండి కలసి చదువుకున్నాం .పెళ్ళయ్యాక కూడా ఒకే ఊరు కావడం తో  తరుచూ కలుసుకుని మాట్లాడుకుంటాం.తనకి రాజేష్ విషయం తెలుసు .తనని అడిగి నిర్ణయం తీసుకుంటే?అలా తెల్లవార్లు ఏవేవో  ఆలోచిస్తూ గడిపేశాను . ప్రొద్దున్న ఆఫీస్ కి వెళ్ళగానే సంధ్యకు కాల్ చేసాను .ఊ ఏంటి మీ శ్రీవారు అలకపానుపు దిగారా? ఏమంటున్నారు అని ఏదో జోక్ వేయబోయింది."ఇప్పుడు నీ జోక్స్ వినే మూడ్ లేదు ప్లీజ్ సంధ్య చెప్పేది విను" అని నిన్న రాజేష్ ఉత్తరం సంగతి చెప్పాను.. "అయ్యో ఇదేంటే ?ఇదేం ట్విస్ట్ ? వాడికి ఇప్పుడు సడెన్గా నువ్వెందుకు గుర్తోచ్చావ్ ? సరే సరే కంగారు పడి మీ ఆయనకు ఏమీ చెప్పకు..తరువాత తరువాత లేనిపోని తలనెప్పులు .అదెప్పుడో తెలిసి తెలియని  వయసులో ఆకర్షణ .దానికి నువ్వంత ఫీలవ్వాల్సింది ఏమీ లేదు .నువ్వు సైలెంట్ గా ఊరుకో.వాడికి ఈ అడ్రెస్స్ కరెక్టో కాదో తెలియదు కదా .నాలుగు రోజులు చూసి అది సరి అయిన అడ్రెస్స్ కాదేమోలె అని మర్చిపోతాడు.అయినా ఆ లెటర్ వచ్చి  వారం పైనే అవుతుంది అంటున్నావ్ గా  ఇంకేం రాలేదుగా ..ఏం భయపడకు "అంది ధైర్యం చెబుతూ  ..

సరే అని తనతో పైకి అన్నా ఎక్కడో ఏదో భయం ..పక్కింటావిడ నావైపు పలకరింపుగా చూసి నవ్వినా భయమే , పోస్ట్ మెన్ మా వీధిలో కనబడినా భయమే.. రెండు రోజులయ్యాకా మెల్లిగా ఊపిరి పీల్చుకున్నాను ...సంధ్య అన్నట్లు అడ్రెస్స్ సరికాదని ఊరుకుని ఉంటాడు ..అనవసరం గా ఈ గొడవలో పడి తనకి అసలు విషయమే చెప్పలేదు ..ఈ రోజు చెప్పేయాలి అనుకుంటూ ఇంటికొచ్చేసరికి టేబుల్ మీద అదే తెల్ల కవర్ .ప్రక్కన మా ఆయన ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ...పద్మ ఇచ్చి ఉంటుంది ఇంకా చదివి ఉండరు ...నాకు చెమటలు పట్టేసాయి ..రాజేష్ నుండేనా ? దేవుడా దేవుడా తనదగ్గర నుండి వచ్చిన లెటర్ కాకుండా చూడు అనుకుంటూ తను చూడకుండా మెల్లగా లెటర్ చేతికి చిక్కిన్చుకుని బెడ్రూం లోకి పరుగులు పెట్టాను ...
వణుకుతున్న చేతులతో ఓపెన్ చేసి చదివాను ..

డియర్ శ్రీ 
 ఇది నేను రాస్తున్న రెండో లెటర్ ..ఇంతకు ముందు ఒక లెటర్ వేసాను అది అందిందో లేదో ? నిన్ను చూడాలని ఉంది ..ఏంటిరా అన్ని మర్చిపోయావా ?దొంగ చాటుగా మనం ఇంట్లో చెప్పకుండా చూసిన సినిమాలు,అల్లరి వేషాలు  అన్నీ  గుర్తున్నాయా? నీకేమో తెలియదు కాని నాకెప్పుడు నువ్వు గుర్తొస్తూనే ఉంటావ్. నా నెంబర్ ఇస్తున్నా ఒకసారి ఫోన్ చేయరా  .
ఎదురుచూస్తూ 
 రాజేష్

మంచం మీద కూలబడిపోయాను అలా.. ఏం చేయాలి ఇప్పుడు ? వదిలేలా లేడు..ఇంటి కోచ్చేస్తాడా  కొంపదీసి. పాత స్నేహం కొద్ది రాస్తున్నాడా? లేక కక్ష కొద్ది ఏడిపించడానికా  ? దేవుడా ఏమిటి నాకీ పరిక్షా..అప్పట్లో చిన్నతనం ..తెలియదు ...పైగా ఎంత మంచిగా ఉండేవాడు ...ఎంత తెలివైనవాడు.. అతనికి అర్ధం కాదా ? నాకు పెళ్లైంది ...ఇటువంటి పనులు కాపురంలో చిచ్చుపెడతాయని తెలియదా ? లేక కావాలని ఉక్రోషంతో చేస్తున్నాడా ?తలపట్టుకుని కూర్చున్నా.."నిధి ఎంత సేపు? ..లోపలేం  చేస్తున్నావ్ .నిద్రపోతున్నావా "వాసు అరుపులకు ఈ లోకం లోకి వచ్చాను . 

11 comments:

మందాకిని said...

సస్పెన్స్ విడిపోయిందోచ్! అది శ్రీ అనే అబ్బాయికి రాసిన ఉత్తరం. ఆ శ్రీ ఒకవేళ శ్రీనివాసు, శ్రీనిధి భర్త పూర్తిపేరు కూడా అయ్యుండొచ్చు. :)

మందాకిని said...

సారీ, మరిచాను.
బాగా రాస్తున్నారు అని చెప్పడం
నిజం స్నేహగారూ!

sneha said...

మందాకిని గారు :) ష్ గప్ చిప్

తృష్ణ said...

బావుందండి. బాగా రాస్తున్నారు. ఈ మధ్యన కథల పోటీల ప్రకటనలు చాలానే వచ్చాయి కదండి మరి పంపకపోయారా?

శిశిర said...

ఇప్పటి నుండి మీ బ్లాగులో కథలు "చివరి భాగం" అని టైటిల్ చూసాకే చదువుతాను. లేకపోతే "ఊ.. తర్వాత? " అనేది మీ బ్లాగులో నా పర్మినెంట్ కామెంట్ అయ్యేలాగుంది. :) సస్పెన్స్‌లో పెట్టేస్తున్నారు. ఏమవుతుందా అని ఆలోచించాల్సొస్తూంది. :) చాలా బాగా రాస్తున్నారు.

Anonymous said...

good..waiting 4 next part... :) :)

డేవిడ్ said...

స్నేహ గారు మీరు మమ్ముల్ని సస్పెన్స్ లో పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా....చాలా బాగ రాస్తున్నారు.

మనసు పలికే said...

స్నేహ గారూ, మీ శైలి నాకు బాగా నచ్చింది:) కథను నడిపించే విధానం బాగుంది. మొత్తంగా మీ కథ నచ్చింది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్..:)

sneha said...

తృష్ణ గారు కధల పోటీకా? అసలు కధలు రాయడం వచ్చోలేదో అని మీ మీద ప్రయోగాలు చేస్తున్నాను అంతే నచ్చినందుకు ధన్య వాదాలు
శిశిర గారు అయితే ఆఖరి బాగం ముందు రాసేస్తాను .మీరు కామెంట్ పెట్టను అన్నారుగా :
అజ్ఞాతగారు థేంక్యూ
డేవిడ్ గారు ప్రచురించేస్తాను కాసేపటిలో
మనసుపలికే గారు నచ్చినందుకు ధన్యవాదాలు

మంచు said...

కథ పూర్తి అయ్యేవరకూ నేను చదవడం స్టార్ట్ చెయ్యను... చెయ్యను ... చెయ్యను ...GRRRRRRR..controlll

sneha said...

:D :D