Tuesday, 12 July 2011

నాకోసం మళ్ళీ వచ్చేయవూ


నీకూ నాకు అనుబంధం నా పుట్టుకతోనే ఏర్పడిపోయింది .. ఆటలాడినా ,అన్నం తిన్నా ,అలసిపోయినా ఆలోచనలో ఉన్నా నాకు తెలియకుండానే అక్కున చేర్చుకుంటావు ..కమ్మని కలల్లాంటి కబుర్లు చెప్తావు..అవి ఒక్కోసారి పెదవులపై నవ్వులు పూయిస్తే, ఇంకోసారి గుండెల్లో వణుకుని తెప్పిస్తాయి...ఆ క్షణం ఉలిక్కిపడినా ,భయం వేసినా కోపం వచ్చినా కొద్ది క్షణాలే .. మళ్ళీ నీ వెచ్చని కౌగిలిలో చేరిపోతాను ..

.నా మీద నీకున్న ప్రేమను చూసి అసూయపడినవారెందరో..నువ్వు వాళ్ళను కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడవని ,ఒక వేళ పలకరించినా మొహమాటంగా అంటి అంటనట్లు ఉంటావని చాలా సార్లు నాదగ్గర వాపోయారు..వాళ్ళ అసూయచూసి ఎంత గర్వంగా ఉండేదో తెలుసా ...

మన బంధం ఇలాగే ఉంటుందని ఎవరూ విడదీయరని అనుకున్నానా ..అనుకున్న కొద్దిరోజులకే మన ఎడబాటు నా పెళ్ళిరూపంలో వచ్చేసింది.. చిన్నప్పుడు నా అల్లరి భరించలేక బలవంతంగా నీకు అప్పగించి పనులు చక్కబెట్టుకున్న అమ్మానాన్నే నాకో తోడును తీసుకొచ్చి నీకు దూరం చేసేసారు ...

అయినా వాళ్ళను అని ఏం లాభంలే నేను మాత్రం తక్కువ తిన్నానా? నువ్వు గుమ్మం దగ్గర దీనంగా నావైపు చూసినా, నేనున్నాను అని సంజ్ఞలు చేసినా కొత్త మోజులో పట్టించుకునేదాన్ని కాదు.. అతని నవ్వులు ,అతని మాటలు ,అతని చేతలు,అతని బాసలు అన్నీ నీకంటే ఎక్కువ మత్తెక్కించేవి ... అందుకే నువ్వెక్కడ మా ఇద్దరి మధ్యలో వచ్చేస్తావో అని విదిలించికొట్టేదాన్ని..చిన్న బుచ్చుకున్నావో...మనసు నొచ్చుకున్నావో మెల్లగా నాకు తెలియకుండానే దూరం అయిపోయావు..

ఎవరి పేరు చెప్పి బాధ్యతలు ,బంధాలు అని అప్పటివరకూ నిన్ను నిర్లక్ష్యం చేసానో వాళ్ళ అవసరాలు తీరంగానే నన్ను నిర్లక్ష్యం చేసేస్తున్నారు ..అప్పుడుగాని నీ విలువ తెలియలేదు.. హఠాత్తుగా దిగులైపోయాను నువ్వు గొర్తొచ్చి ..మన అనుబంధం గుర్తొచ్చి..నాకు నేనే పలకరించాలని ఎంత ప్రయత్నించినా నా వైపు చూడవు .. చూసినా ఇంతకు ముందులా అక్కున చేర్చుకోవు.... ఎప్పుడో నీకు దయకలిగితే పలకరిస్తావు లేదా నేను విదిలించికొట్టినట్లే విదిలించిపోతావు..


చేసింది తప్పే ఇంకెప్పుడూ దూరం చేసుకోను ...నాకోసం మళ్ళీ వచ్చేయవూ ... గాఢమైన నిద్రలో నన్ను సేదతీర్చవూ ...మునుపటిలాగే నీ కలల కబుర్లలో నన్ను ముంచెత్తవూ..నీవులేకపోతే జీవించడం కష్టం...ఎందుకంటే నువ్వు నా నిద్రాదేవివి.

7 comments:

మధురవాణి said...

హుమ్మ్... ఎందుకని మనం పెద్దయ్యే కొద్దీ నిద్ర కొద్ది కొద్దిగా దూరమై పోతూ ఉంటుంది.. అనుకుంటూ ఉంటా నేను..
కారణాలేవైనా తనకీ, మనకీ దూరం పెరిగే మాట మాత్రం నిజం! మరిప్పుడేం చెయ్యగలం? :(

అన్నట్టు, ఇప్పుడిలా స్నేహని చూపించి రాధాగోపాళం సినిమా గుర్తు చేసి నన్ను డిస్టర్బ్ చేస్తారా? :(

sneha said...

ఏం చేస్తాం చెప్పండి, మనల్ని పలకరించేవరకూ ఎదురు చూడటమే,
పొటో సరైనది దొరకలేదు స్నేహ కరుణించింది :)

kallurisailabala said...

nidra gurinchi enta bagar rasaro. nenu adagakundane vachhestundilendi. my best friend kada

kiran said...

ఆహ్హ :) భలే ఉందండి...ఏంటో అనుకున్నా...చివరి లైను వరకు..:))

sneha said...

శైలబాల గారు ధాంక్యూ ,నిద్ర పిలిస్తే వస్తున్నందుకు అదృష్టవంతులు
కిరణ్ గారు ధన్యవాదాలు

జ్యోతిర్మయి said...

ఏం చెప్తున్నారో ఊహించడానికి ప్రయత్నించా, ఆచూకీ దొరకలా. చివరి వాక్యం చదివాక మళ్ళీ మొత్తం చదివాను చాలా బావుంది.

sneha said...

జ్యోతిర్మయిగారు :)