Sunday, 28 August 2011

బాల్యమా ఇకరావా?

    

నిన్న మొన్నటి వరకూ నా చుట్టూనే ఉన్నావుగా
మరి కాలం బూచి ఎప్పుడు మాయం చేసిందో నిన్ను
యవ్వనపు ఏమరుపాటుతో గమనించనేలేదు
గుర్తువచ్చి వెనకకు చూస్తే గుప్పెళ్ళకొద్దీ  జ్ఞాపకాలు గుండెలపై పరిచేసి పోయావు.
ఒక్కొక్కటి ఏరుకుంటుంటే ఎటు చూసినా నువ్వేకనబడుతున్నావ్..


వరండా గేటుపై ఊగుతూ ,అమ్మ చెవిలో గారంగా గుసగుసలాడుతూ
చందమామతో పరుగులు పెడుతూ ,నేస్తాలతో అలసటరాని ఆటలాడేస్తూ
ఒకటా రెండా ఎన్నెన్ని అనుభూతులు నీతో పెనవేసుకున్నానో


నాన్నమ్మ చేతిముద్ద తాలూకు రుచి ఇంకా నోట్లో నీటిమడుగు చేస్తునేఉంది.
నాన్న తిట్లువింటూ అమ్మ నడుమును పెనవేసిన వెచ్చదనం అలాగేఉంది.
అమ్మపై అలిగి మంచం క్రింద నిద్రపోయిన జ్ఞాపకం ఇంకా మేలుకునేఉంది .
స్నేహితుల తగాదాలలో తగిలిన గాయాల కన్నీటి ఉప్పదనం పెదవులకు తెలుస్తూనే ఉంది.
అన్నీ ఇక్కడిక్కడే ఈ మూలనే నక్కినట్లుగా ఉన్నాయి
నువ్వుమాత్రం నన్నొదిలి ఎక్కడికి వెళ్ళిపోయావ్

భయము బెదురులేని ఎన్నెన్ని సాహసాలు
కుళ్ళు కపటం తెలియని  గిల్లికజ్జాలు
నిన్నను చూసి బెరుకూ  లేదు
రేపును తలుచుకుని బెంగాలేదు
 

అప్పటికి ఇప్పటికి పొంతనాలేదు
ఆనాటి నువ్వుకు ఈనాటి నేనుకు పోలికాలేదు
నీ జ్ఞాపకాలు నన్ను వదిలిపోనేపోవు
ఇక నువ్వునాకోసం రానేరావు

10 comments:

శిశిర said...

చాలా బాగుంది.

Anonymous said...

చక్కగా వుంది వర్ణన.

శర్మ said...

1. భాల్యమా కాదు బాల్యమా..
2. బాల్యం మనల్ని విడిచిపొలేదు మనమే బాల్యాన్ని విడిచాం అనిపిస్తూ ఉంటుంది
3. చక్కటి ప్రయత్నం.. అభినందనలు!!

మధురవాణి said...

ఎందుకు రాను.. మళ్ళీ నీ ప్రతిరూపంలో ప్రాణం పోసుకుని ప్రతి రోజూ నీ కళ్ళ ముందే తిరుగుతూ సరికొత్త జ్ఞాపకాలని పంచుతానుగా! ;)

Good one! :)

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుందండీ.. ఆ రోజులు తిరిగి రానివే అయినా మనలో ఉన్న చిన్నారికి బలవంతంగా పెద్దమనిషి ముసుగు వేసి మనమే దాచేస్తామండీ.. తనని స్వేఛ్ఛగా వదిలేస్తే మళ్ళీ మళ్ళీ ఆ అనుభూతులను సొంతం చేసుకోవచ్చు..

kiran said...

సూపరండి..ఇంకో మాట లేదంతే..:)

sneha said...

శిశిర గారు ధన్యవాదాలు
తొలకరిగారు థాంక్యూ
శర్మగారు మార్చేసాను
మధురవాణి గారు మీ వ్యాఖ్య చాలా బాగుంది :)
వేణుగారు మీరన్నది నిజమే కాని పెద్దరికపు ముసుగు తొలగించుకోవడం అంత సులభం కాదు,పెరిగిన బాధ్యతలు బంధాలు తద్వారా వచ్చే భయాలు మనకాళ్ళకు ఎప్పటికప్పుడు సంకెళ్ళువేసేస్తునే ఉంటాయి :)
కిరణ్ గారు థాంక్యూ :)

వేణూ శ్రీకాంత్ said...

హ్మ్ అదీ నిజమేలెండి..

మనసు పలికే said...

స్నేహ గారు,
చదువుతూ ఉన్నానా.. కళ్లలో సన్నని నీటి తెర. ఎప్పుడొచ్చిందో ఎందుకొచ్చిందో తెలీదు. చిన్ననాటి ఙ్ఞాపకాలు, అనుభూతులు, చిలిపి చేష్టలు ఇంకా చాలా చాలా వరసగా కళ్ల ముందు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. చాలా చాలా బాగా రాసారు. నేనైతే అలా నా చిన్ననాటి రోజులకి వెళ్లిపోయాను.

Kalyan said...

touching!