Sunday, 9 October 2011

మా కిటికీ


కొన్నింటితో అనుబంధం ఎలా ఏర్పడుతుందోగాని ఏళ్ళతరబడి అది పెరుగుతునే ఉంటుంది మావంటింటి కిటికితో నాకు ఏర్పడినట్లు.తన సన్నిదిలో ఎన్నెన్ని జ్ఞాపకాలు పలకరించాయో ,ఇంకెన్ని ఆలోచనలు పురుడుపోసుకున్నాయో..అక్కడ నించుంటేచాలు టన్నులకొద్దీ కరగని క్షణాలను  గుప్పెటతోపట్టి ఆవలకు విసిరేయచ్చు...

కిటికీ ఊసలను పట్టుకుని బయటకు చూస్తే చాలు ఒంటరితనం నన్నొక్కదాన్ని చేసి మాయమైపోతుంది.. అప్పుడప్పుడూ చందర్రావుగారు "హెలో" అని కుశలమడిగి చల్లగా పలకరిస్తే..ప్రతిరోజూ సూర్యారావు గారు వెచ్చగా బుగ్గలను తడిమి ధైర్యం చెప్తారు.. ఏ రాత్రివేళో వారికోసం గంటలకొద్ది ఎదురు చూస్తున్నప్పుడు నాతలను తనకు   ఆన్చి ఆదమరచి నిదురపోయిన అనుభవాలు ఇప్పటికీ ఆ ఊసలకు వ్రేళ్ళడుతూనే ఉన్నాయి...

ఒక్కోసారి నల్లమబ్బు,మెరుపు తీగా కలసి పిలవగానే పరిగెత్తుకుని తన చెంతకు వెళతానా ... చల్లటి వర్షపుపూలను మొహానికేసి కొట్టి పక్కున నవ్వేస్తుంది... ఉక్రోషంగా చూస్తూ నా చేతులు బయటకు పెట్టి వానముత్యాలు రాసులుగా దోసిళ్ళతో నింపి లోపలకు తేవడానికి ప్రయత్నిస్తానా కాని చేతులు లోపలకు తీసుకురాలేక తనకు తగిలి మొత్తం నేలపాలైపోయి ఒట్టిచేతులు వెక్కిరిస్తూ చూస్తుంటే జీవితసత్యమేదో గుంభనంగా చెప్తున్నట్లు నా వైపు గంభీరంగా చూస్తుంది ...

సంతోషమొక్కటే పంచుకుంటే తను నా మంచి నేస్తం ఎలా అవుతుంది...మదిని పట్టి సుడులు తిరిగే విపరీతమైన బాధ గుండెలను దాటుకుని కన్నీటి రూపంలో బయటకు వచ్చినపుడు ఆసరాగా నా తలను తనకేసి అదుముకుని లాలిస్తుంది..నా కన్నీటి చారికలు నాకు చూపుతూ నేనున్నాను నీకు అని తోడుగా నిలుస్తుంది....ఒక్కోసారి అదుపులేని ఆవేదన కట్టలు తెన్చుకున్నప్పుడు నా చేతి వెళ్ళు తన తలుపు సందుల్లో నలిగిపోతుంటే ముల్లును ముల్లుతోనే తీసినట్లు ఒక బాధను మరొక బాధ మాత్రమే తీర్చాలా అని బేలగా చూస్తుంది ...

మా కిటికీ పరిచయం చేసిన మరో మంచిస్నేహితుడు పేరు ఊరూతెలియని ఓ పచ్చని చెట్టు ..అదైతే ఆకులు ,రెమ్మలు ,కొమ్మలు ,పూవులు అన్నీ నన్ను చూడగానే కేరింతలు కొట్టేవే..గాలి సాన్నిహిత్యాన్నిబట్టీ వయ్యారంగానో ,హాడవుడిగానో కదులుతూ ఎన్నెన్ని కబుర్లుచెబుతాయో..నా కళ్ళముందే చిన్ని పిట్టలు గూళ్ళనుకట్టి, గుడ్లనుపెట్టి ,పిల్లలని పొదిగి కువకువలాడుతుంటే నాకోసమేఅన్నట్లు మాధ్యాహ్నం వేళకు తన చెంతకుపిలిచి వాటిని ఆడిస్తుంది....తన ఊహ తప్పుకాదన్నట్లు అవేమో ఆ ఊసపై నుండి ఇక్కడకు ఈ ఊసపై నుండి అక్కడకు గెంతూతూ నన్ను చూడగానే దూరంగా పారిపోతూ నేను ప్రక్కకు తొలగగానే మళ్ళి వెదుకుతూ దాగుడు మూతలు ఆడతాయి...నేనూ వాటితోపాటు వయసుమరచి ఆడేస్తుంటే మౌనంగా చూస్తూ నవ్వుకుంటుంది..

కృష్ణుడు యశోదకు ముల్లోకాలు చూపించినట్లు ,తన వైపు చూస్తే చాలు మా కిటికీ నాకు జీవితమంటే ఏమిటో ఇట్టే చూపించేస్తుంది .. బాల్యం, కౌమారం , వృద్ధాప్యం ..సంతోషం ,విచారం ఒక్కటేమిటి ఎందరెందరో కళ్ళముందు తిరుగుతూ తెలియకుండానే నాకు జీవిత పాఠాలు నేర్పించేసి పోతారు ..ఇలా కాసేపు ఆలోచనలు రేకెత్తిస్తూ, మరికాసేపు ఆలోచనలో పడేస్తూ ,అంతలోనే ఆలోచింపజేస్తూ అండగా ఉండే మా కిటికీని వదిలి ఎలా వెళ్ళేది?

7 comments:

రసజ్ఞ said...

చాలా చక్కని పదజాలంతో కూడిన వర్ణన.

జ్యోతిర్మయి said...

అదేంటో మీ కిటికీతో నాక్కూడా అనుబ౦దం ఏర్పడిపోయింది.బ్లాగు చదువుతుంటే మన౦ కిటికీ పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకున్నట్లుగా వుంది.మీ శైలి చాలా బావుంది.

మధురవాణి said...

woww... Beauty!! :)

sneha said...

రసజ్ఞ గారు ధన్యవాదాలు
జ్యోతిర్మయిగారు మీకూ అనుబంధం ఏర్పడిపోయిందా..:) గంటలతరబడి అక్కడే నించుని నాకు నచ్చినవాళ్ళగురించి ఆలోచిస్తూ విసుగూ విరామాం లేకుండా కబుర్లు చెప్పేస్తుంటాను మా కిటికీకి..:)
మధురవాణి గారు :)

kiran said...

wowwww..!!!!..చాలా బాగుందండి :)
నాకూ కిటికీ మంచి నేస్తమే :)....ఎన్నెన్ని గుర్తు చేసేస్తుందో :)

sneha said...

kiran gaaru thank you

కొత్త పాళీ said...

very nice