ఆఖరి మెట్టు పై అడుగు పెట్టి ఎదురుగా నీ నల్లని మోము చూడగానే అర్ధం అయ్యింది ఈ రోజు నీకు దొరికేసానని...ఈ నాలుగు రోజులు నీకు చిక్కకుండా తప్పించుకున్నాననే పొగరు అనుకుంటా చాలా నిర్లక్ష్యంగా వచ్చేసాను ఏ మాత్రం జాగ్రత్త తీసుకోకుండా..
నీ వైపు భయంగా,దిగులుగా చూసాను..నువ్వేమాత్రం కనికరించేలా లేవని అర్ధం అయ్యింది..ఒక నిర్ణయానికొచ్చినట్లు వడివడిగా అడుగులు వేసాను..ఎంత దూరం వెళతావో వెళ్ళు తప్పించుకోలేవులే అన్నట్లు నువు నవ్విన నవ్వు చెవులు చిల్లులు పడినట్లు వినబడుతుంది..
నా కంగారు చూసి ఒకరిద్దరు ఎగాదిగా చూసారు..ఎలా అయినా తప్పించుకోవాలి పరుగులాంటి నడకతో ముందుకు వెళ్ళాను..రోడ్డంతా నిర్మానుష్యం అయింది నా భయాన్ని పెంచుతూ ..అక్కడక్కడా ఇళ్ళు తలుపులు గడియపెట్టి ...
ఓ చిన్నారి పాప కిటికి ఊసలగుండా నన్ను చూస్తుంది ఆశ్చర్యంగా...కాళ్ళల్లో సత్తువ నశించింది ...వేగం తగ్గించాను ..ఎప్పుడు వచ్చి వాటేసావో వెనుకనుండి రివ్వు మంటూ.. బేలాగా చూసాను ..వదల్లేదు...మొదటి ముద్దు నుదుటిపై.. రెండవది చేతులపై..
ఓ ఇద్దరు పెద్దవాళ్ళు తమ వాహనాలపై వెళుతూ జాలిగా చూసారు నా వైపు...మరో ఇద్దరు కాలేజీ అబ్బాయిలు అల్లరిగా నవ్వుతూ వెనుకకు తిరిగి చూసారు...ఇంకొందరు అమ్మాయిలు అసూయగా చూసారుగాని ఒక్కరూ నాకు తోడురాలేదు..
ఎవరికి పట్టనట్లు వెళ్ళిపోతుంటే బాధ ఉక్రోషం..హఠాత్తుగా నీ కళ్ళల్లో మిరిమిట్లు గొలిపే మెరుపు మెరిసింది..కోటి ప్రశ్నలకు సమాధానంగా..
నిజంగా తనంటే ఇష్టం లేదా??? ఉంది !! సమాధానం స్పష్టంగా మనసులోనుండి వచ్చింది.. ఈ సమాజంకోసమే మనసుకు పెద్దరికపు ముసుగేసి ఆ ఇష్ట్టాన్ని చంపేసుకున్నాను..ఈ కొద్దిసేపు నాకోసం నేను ఈ పరదాలు తొలగించలేనా???
గట్టిగా ఊపిరి పీల్చాను ...నిండామునిగాకా చలేమిటి..... నేనూ నీతో పాటు పక్కున నవ్వాను నీ ప్రేమలో తడిసిపోతూ ...
కిటికీలో నుండి చూసున్న పాపాయి కేరింతలు కొడుతుంది వర్షంలో తడుస్తున్న నన్ను చూస్తూ
16 comments:
:)ఇందుకే మిమ్మల్ని తరచుగా రాస్తూండమనేది. ఏం రాసినా అద్భుతంగా రాస్తారు.
ఇంతకీ కిటికీలోనుంచి తీసిన మీ చిత్రం మీకు ఎలా దొరికింది?
Hmmm...
wow.. very nice
wow.....fantastic
చాలా అద్బుతంగా వ్యక్తీకరించారు వర్షం గురించి .
చాలా బావుంది స్నేహగారూ....
సూపర్ గా రాశారు స్నేహగారూ...
నిజం వానలో మీరు తడిసి ఆ అనుభూతుల వానలో మమ్మల్ని తడిపారు! ధన్యవాదాలు!
శిశిర మీ కామెంట్ మంచి ప్రోత్సాహం నాకు
ప్రసాద్ గారు గూగుల్లో దొరికింది :)
మధురవాణిగారు ఎంతకంతగా నిట్టూర్చారు :)
రాజేష్ గారు ధన్యవాదాలు
రాజాగారు ధన్యవాదాలు
రమణా రెడ్డి గారు ధ్యాంక్స్ అండి
జ్యోతిర్మయిగారు ధాంక్యూ
అజ్ఞాతగారు ధన్యవాదాలు
రసజ్ఞ గారు ధాంక్యూ
బాగుందండీ.. బాగా వ్రాసారు.
ఆలోచన, అది వ్యక్తం చేసిన తీరు , అన్నీ బాగున్నాయండి ...:-) అభినందనలు
మీరు భలే రాస్తారండి....చివరిదాకా వచ్చేవరకు ఏంటో అనుకుని చదువుతూ ఉంటా ప్రతిసారి :)
మీలో నాకు బాగా నచ్చే విషయమేమంటే, టపా చివరి వరకూ చదివితే గానీ దేని గురించి రాస్తున్నారో తెలియకుండా భలే జాగ్రత్త పడతారు. నేనైతే మొదటి సారి చదివినప్పుడు చాలా టెన్షన్ గా చదువుతా, దేని గురించా ఇది అని. ముగింపు చదివేశాక ఊప్పిరి పీల్చుకుని, రెండో సారి మొత్తం టపా చదివి ఆనందిస్తా:) స్నేహ గారు, మీ రచనలు అద్భుతం అంతే :)
చాలా చాలా బాగుంది....
Post a comment