Tuesday, 10 May 2022

మహానటులు

 




 గుండె రగిలిపోతూ

మనసు మండి పోతూ ఉంటే

నిండుగా నవ్వేస్తూ

నిన్ను నవ్వించడం 

మామూలు విషయం అనుకున్నావా???

చేసి చూడు నీకే తెలుస్తుంది

అందుకే వాళ్ళను మహా నటులన్నారు... 

కాకపోతే కొందరు తెర మీద ఉంటారు 

...ఇంకొందరు మన మధ్యే ఉంటారు.... అంతే తేడా 

Thursday, 20 October 2011

దొరికిపోయాను


ఆఖరి మెట్టు పై అడుగు పెట్టి ఎదురుగా నీ నల్లని మోము చూడగానే  అర్ధం అయ్యింది ఈ రోజు నీకు దొరికేసానని...ఈ నాలుగు రోజులు నీకు చిక్కకుండా తప్పించుకున్నాననే పొగరు అనుకుంటా చాలా నిర్లక్ష్యంగా వచ్చేసాను ఏ మాత్రం జాగ్రత్త తీసుకోకుండా..

నీ వైపు భయంగా,దిగులుగా చూసాను..నువ్వేమాత్రం కనికరించేలా లేవని అర్ధం అయ్యింది..ఒక నిర్ణయానికొచ్చినట్లు  వడివడిగా అడుగులు వేసాను..ఎంత దూరం వెళతావో వెళ్ళు తప్పించుకోలేవులే అన్నట్లు నువు నవ్విన నవ్వు చెవులు చిల్లులు పడినట్లు వినబడుతుంది..

నా కంగారు చూసి ఒకరిద్దరు ఎగాదిగా చూసారు..ఎలా అయినా తప్పించుకోవాలి పరుగులాంటి నడకతో ముందుకు వెళ్ళాను..రోడ్డంతా నిర్మానుష్యం అయింది నా భయాన్ని పెంచుతూ ..అక్కడక్కడా ఇళ్ళు తలుపులు గడియపెట్టి ...

ఓ చిన్నారి పాప కిటికి ఊసలగుండా నన్ను చూస్తుంది ఆశ్చర్యంగా...కాళ్ళల్లో సత్తువ నశించింది ...వేగం తగ్గించాను ..ఎప్పుడు వచ్చి వాటేసావో వెనుకనుండి రివ్వు మంటూ.. బేలాగా చూసాను ..వదల్లేదు...మొదటి ముద్దు నుదుటిపై.. రెండవది చేతులపై..

ఓ ఇద్దరు పెద్దవాళ్ళు తమ వాహనాలపై వెళుతూ జాలిగా చూసారు నా వైపు...మరో ఇద్దరు కాలేజీ అబ్బాయిలు అల్లరిగా నవ్వుతూ వెనుకకు తిరిగి చూసారు...ఇంకొందరు అమ్మాయిలు అసూయగా చూసారుగాని ఒక్కరూ నాకు తోడురాలేదు..

ఎవరికి పట్టనట్లు వెళ్ళిపోతుంటే బాధ ఉక్రోషం..హఠాత్తుగా నీ కళ్ళల్లో మిరిమిట్లు గొలిపే మెరుపు మెరిసింది..కోటి ప్రశ్నలకు సమాధానంగా..

నిజంగా తనంటే ఇష్టం లేదా??? ఉంది !! సమాధానం స్పష్టంగా మనసులోనుండి వచ్చింది.. ఈ సమాజంకోసమే మనసుకు పెద్దరికపు ముసుగేసి ఆ ఇష్ట్టాన్ని చంపేసుకున్నాను..ఈ కొద్దిసేపు నాకోసం నేను ఈ పరదాలు తొలగించలేనా???


గట్టిగా ఊపిరి పీల్చాను ...నిండామునిగాకా చలేమిటి..... నేనూ నీతో పాటు పక్కున నవ్వాను నీ ప్రేమలో తడిసిపోతూ ...

కిటికీలో నుండి చూసున్న పాపాయి కేరింతలు కొడుతుంది వర్షంలో తడుస్తున్న నన్ను చూస్తూ



Friday, 14 October 2011

ఎందుకూ ???






కన్నీటికి నేనంటే ఎంత ఇష్టమో కాస్త బాధపడగానే 
వెచ్చని స్పర్శతో బుగ్గలు తడిమి  తోడుగా వస్తుంది..


మోకాళ్ళు నాకు  మరింత దగ్గరకు చేరి  
 తలను తన ఒడిలోకి తీసుకుని ఓదారుస్తాయి


చేతులు చుట్టూ పెనవేసి  గట్టిగా హత్తుకుని
నీకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పుతాయి..


ముంగురులు నా నుదిటి పై తారాడుతూ 
లాలనగా నిమురుతూ నాబాధని తగ్గించే ప్రయత్నం చేస్తాయి..


నా కోసం ఇవన్ని ఇంత తపన పడుతుంటే 
పిచ్చిమనసు ఇంకేవరికోసమో ఎదురుచూస్తుంది ఎందుకూ ???

Sunday, 9 October 2011

మా కిటికీ


కొన్నింటితో అనుబంధం ఎలా ఏర్పడుతుందోగాని ఏళ్ళతరబడి అది పెరుగుతునే ఉంటుంది మావంటింటి కిటికితో నాకు ఏర్పడినట్లు.తన సన్నిదిలో ఎన్నెన్ని జ్ఞాపకాలు పలకరించాయో ,ఇంకెన్ని ఆలోచనలు పురుడుపోసుకున్నాయో..అక్కడ నించుంటేచాలు టన్నులకొద్దీ కరగని క్షణాలను  గుప్పెటతోపట్టి ఆవలకు విసిరేయచ్చు...

కిటికీ ఊసలను పట్టుకుని బయటకు చూస్తే చాలు ఒంటరితనం నన్నొక్కదాన్ని చేసి మాయమైపోతుంది.. అప్పుడప్పుడూ చందర్రావుగారు "హెలో" అని కుశలమడిగి చల్లగా పలకరిస్తే..ప్రతిరోజూ సూర్యారావు గారు వెచ్చగా బుగ్గలను తడిమి ధైర్యం చెప్తారు.. ఏ రాత్రివేళో వారికోసం గంటలకొద్ది ఎదురు చూస్తున్నప్పుడు నాతలను తనకు   ఆన్చి ఆదమరచి నిదురపోయిన అనుభవాలు ఇప్పటికీ ఆ ఊసలకు వ్రేళ్ళడుతూనే ఉన్నాయి...

ఒక్కోసారి నల్లమబ్బు,మెరుపు తీగా కలసి పిలవగానే పరిగెత్తుకుని తన చెంతకు వెళతానా ... చల్లటి వర్షపుపూలను మొహానికేసి కొట్టి పక్కున నవ్వేస్తుంది... ఉక్రోషంగా చూస్తూ నా చేతులు బయటకు పెట్టి వానముత్యాలు రాసులుగా దోసిళ్ళతో నింపి లోపలకు తేవడానికి ప్రయత్నిస్తానా కాని చేతులు లోపలకు తీసుకురాలేక తనకు తగిలి మొత్తం నేలపాలైపోయి ఒట్టిచేతులు వెక్కిరిస్తూ చూస్తుంటే జీవితసత్యమేదో గుంభనంగా చెప్తున్నట్లు నా వైపు గంభీరంగా చూస్తుంది ...

సంతోషమొక్కటే పంచుకుంటే తను నా మంచి నేస్తం ఎలా అవుతుంది...మదిని పట్టి సుడులు తిరిగే విపరీతమైన బాధ గుండెలను దాటుకుని కన్నీటి రూపంలో బయటకు వచ్చినపుడు ఆసరాగా నా తలను తనకేసి అదుముకుని లాలిస్తుంది..నా కన్నీటి చారికలు నాకు చూపుతూ నేనున్నాను నీకు అని తోడుగా నిలుస్తుంది....ఒక్కోసారి అదుపులేని ఆవేదన కట్టలు తెన్చుకున్నప్పుడు నా చేతి వెళ్ళు తన తలుపు సందుల్లో నలిగిపోతుంటే ముల్లును ముల్లుతోనే తీసినట్లు ఒక బాధను మరొక బాధ మాత్రమే తీర్చాలా అని బేలగా చూస్తుంది ...

మా కిటికీ పరిచయం చేసిన మరో మంచిస్నేహితుడు పేరు ఊరూతెలియని ఓ పచ్చని చెట్టు ..అదైతే ఆకులు ,రెమ్మలు ,కొమ్మలు ,పూవులు అన్నీ నన్ను చూడగానే కేరింతలు కొట్టేవే..గాలి సాన్నిహిత్యాన్నిబట్టీ వయ్యారంగానో ,హాడవుడిగానో కదులుతూ ఎన్నెన్ని కబుర్లుచెబుతాయో..నా కళ్ళముందే చిన్ని పిట్టలు గూళ్ళనుకట్టి, గుడ్లనుపెట్టి ,పిల్లలని పొదిగి కువకువలాడుతుంటే నాకోసమేఅన్నట్లు మాధ్యాహ్నం వేళకు తన చెంతకుపిలిచి వాటిని ఆడిస్తుంది....తన ఊహ తప్పుకాదన్నట్లు అవేమో ఆ ఊసపై నుండి ఇక్కడకు ఈ ఊసపై నుండి అక్కడకు గెంతూతూ నన్ను చూడగానే దూరంగా పారిపోతూ నేను ప్రక్కకు తొలగగానే మళ్ళి వెదుకుతూ దాగుడు మూతలు ఆడతాయి...నేనూ వాటితోపాటు వయసుమరచి ఆడేస్తుంటే మౌనంగా చూస్తూ నవ్వుకుంటుంది..

కృష్ణుడు యశోదకు ముల్లోకాలు చూపించినట్లు ,తన వైపు చూస్తే చాలు మా కిటికీ నాకు జీవితమంటే ఏమిటో ఇట్టే చూపించేస్తుంది .. బాల్యం, కౌమారం , వృద్ధాప్యం ..సంతోషం ,విచారం ఒక్కటేమిటి ఎందరెందరో కళ్ళముందు తిరుగుతూ తెలియకుండానే నాకు జీవిత పాఠాలు నేర్పించేసి పోతారు ..ఇలా కాసేపు ఆలోచనలు రేకెత్తిస్తూ, మరికాసేపు ఆలోచనలో పడేస్తూ ,అంతలోనే ఆలోచింపజేస్తూ అండగా ఉండే మా కిటికీని వదిలి ఎలా వెళ్ళేది?

Wednesday, 31 August 2011

ఎవరు చెప్తారు నీకు?


నీతోఉన్న ప్రతిక్షణం  పోట్లాడాలనిపిస్తుంది
నువ్వెళ్లిన మరుక్షణమే  మాట్లాడాలనిపిస్తుంది
నీ సమక్షంలోకంటే నీ నిరీక్షణలోనే ఎక్కువ ప్రేమిస్తున్నానేమో ....

 నీ తడికన్నుల చల్లదనం చెంపకు తాకినట్లవుతుంది
ఆ వేడినిట్టూర్పు వెచ్చదనం తనువును తడుముతునే ఉంది
అలిగిన నీమోము బింకంగా నను చూస్తున్నట్లనిపిస్తుంది
అంతలోనే కోపాల కారాల ఘాటు అలుముకుంటుంది.

నన్నర్ధం చేసుకోవట్లేదని కోప్పడతాను కాని
నిజానికి నాకు నేనే అర్ధంకావట్లేదని ఎలా చెప్పను నీకు ?
ఏకాంతపు వాకిట్లో మౌనంగా
నీ తలపుల రంగవల్లులు దిద్దుతూ
నిదురరాని నిశిరాత్రులు గడుపుతున్నానని
ఎవరు చెప్తారు నీకు?

Sunday, 28 August 2011

బాల్యమా ఇకరావా?

    

నిన్న మొన్నటి వరకూ నా చుట్టూనే ఉన్నావుగా
మరి కాలం బూచి ఎప్పుడు మాయం చేసిందో నిన్ను
యవ్వనపు ఏమరుపాటుతో గమనించనేలేదు
గుర్తువచ్చి వెనకకు చూస్తే గుప్పెళ్ళకొద్దీ  జ్ఞాపకాలు గుండెలపై పరిచేసి పోయావు.
ఒక్కొక్కటి ఏరుకుంటుంటే ఎటు చూసినా నువ్వేకనబడుతున్నావ్..


వరండా గేటుపై ఊగుతూ ,అమ్మ చెవిలో గారంగా గుసగుసలాడుతూ
చందమామతో పరుగులు పెడుతూ ,నేస్తాలతో అలసటరాని ఆటలాడేస్తూ
ఒకటా రెండా ఎన్నెన్ని అనుభూతులు నీతో పెనవేసుకున్నానో


నాన్నమ్మ చేతిముద్ద తాలూకు రుచి ఇంకా నోట్లో నీటిమడుగు చేస్తునేఉంది.
నాన్న తిట్లువింటూ అమ్మ నడుమును పెనవేసిన వెచ్చదనం అలాగేఉంది.
అమ్మపై అలిగి మంచం క్రింద నిద్రపోయిన జ్ఞాపకం ఇంకా మేలుకునేఉంది .
స్నేహితుల తగాదాలలో తగిలిన గాయాల కన్నీటి ఉప్పదనం పెదవులకు తెలుస్తూనే ఉంది.
అన్నీ ఇక్కడిక్కడే ఈ మూలనే నక్కినట్లుగా ఉన్నాయి
నువ్వుమాత్రం నన్నొదిలి ఎక్కడికి వెళ్ళిపోయావ్

భయము బెదురులేని ఎన్నెన్ని సాహసాలు
కుళ్ళు కపటం తెలియని  గిల్లికజ్జాలు
నిన్నను చూసి బెరుకూ  లేదు
రేపును తలుచుకుని బెంగాలేదు
 

అప్పటికి ఇప్పటికి పొంతనాలేదు
ఆనాటి నువ్వుకు ఈనాటి నేనుకు పోలికాలేదు
నీ జ్ఞాపకాలు నన్ను వదిలిపోనేపోవు
ఇక నువ్వునాకోసం రానేరావు

Wednesday, 27 July 2011

పిచ్చుక



నువులేక మా చూరు బోసిపోయింది
కాన రాక మా పెరడు మూగపోయింది

మా పంట చేలు ,ధాన్యపుగాదెలు
వాకిళ్ళు ,బావులు బెంగపడ్డాయి

మా ఏటిగట్లు ,ఆ కోవెల మెట్లు
కాకమ్మ, చిలకమ్మా కధల నేస్తాలన్నీ కుమిలిపోతున్నాయి

నీ బుల్లికువకువలు,నువ్వు చేసే సందడులు
ఒకనాటి జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి

ఆ గడ్డిపరకలు, ఈ చిట్టి ఒడ్లు
నీ గురుతుగా మాకు మిగిలిపోయాయి

సాంకేతికత  నీపాలిట బ్రహ్మాస్త్రం కాగా
కాలుష్యపు కోరలు కబళిస్తూ పోగా
మా నిర్లక్ష్యం,నిర్లిప్తత శాపమై తగలగా

అంతరించిపోతూ , అరుదైన జాబితాలో చేరిపోతున్నావు
మానవ మనుగడని ప్రశ్నిస్తూ సాక్ష్యంగా నిలిచావు